– అత్యంత దుర్భర పేదరికాన్ని నిర్మూలించాం
– కేరళ అసెంబ్లీలో సీఎం విజయన్ ప్రకటన
– నిరసనగా విపక్షం వాకౌట్
తిరువనంతపురం, నవంబర్ 1: దారిద్య్ర రహిత రాష్ట్రంగా కేరళ అవతరించినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ అసెంబ్లీలో ప్రకటించారు. దేశంలో అత్యంత దుర్భర పేదరికాన్ని నిర్మూలించిన తొలి రాష్ట్రంగా గుర్తింపు పొందిందన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ఈ విషయాన్ని వెల్లడిరచారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 21,263 మందికి మొదటిసారిగా రేషన్ కార్డులు, ఆధార్, పెన్షన్లు వంటి ముఖ్యమైన పత్రాలు మంజూరు చేసిందని తెలిపారు. 4,394 కుటుంబాలకు జీవనోపాధి ప్రాజెక్టుల ద్వారా పని కల్పించామన్నారు. ప్రజలందరికీ సమాన హక్కులు నివాసం, విద్య, వైద్యం అందుతున్నట్లు తెలిపారు. దీనివల్ల రాష్ట్రం అత్యంత దుర్భర పేదరికం నుంచి బయటపడిరదంటూ వనవంబర్ 1న కేరళ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శనివారం శాసనసభలో ముఖ్యమంత్రి చరిత్రాత్మక ప్రకటన చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 300 నిబంధన కింద కేరళను తీవ్ర పేదరిక రహిత రాష్ట్రంగా ప్రకటించారు. కేరళను భారత దేశంలోనే మొట్టమొదటి తీవ్ర పేదరికం లేని రాష్ట్రంగా మార్చడంలో మనం విజయం సాధించాం.. ఈరోజు జరుపుకునే అవతరణోత్సవం ఓ చరిత్రాత్మకం.. చరిత్రలో ఒక స్థానాన్ని ఏర్పర్చుకుంది అని వివరించారు. నవ కేరళ సృష్టిలో మరో మైలురాయిని గుర్తించే సమయంలో అసెంబ్లీ సమావేశమైంది. 2021లో కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాల్లో తీవ్ర పేదరికన నిర్మూలన ఒకటి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన అతి ముఖ్యమైన వాగ్దానాలలో ఒకదాన్ని నెరవేర్చడానికి ఇది నాంది కూడా. స్థానిక స్వపరిపాలన శాఖ నాయకత్వంలో కేరళ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ సమన్వయంతో కేవలం రెండు నెలల్లో తీవ్ర పేదరికంలో ఉన్న కుటుంబాలను గుర్తించే పక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ప్రయత్నంలో ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, కుటుంబశ్రీ కార్మికులు, స్వచ్ఛంద సేవకులు, అధికారులు సహా ఇతరులు భాగస్వాములయ్యారని తెలిపారు. సమాజంలో అన్ని వర్గాల నుండి తీసుకున్న సమష్టి అభిప్రాయాలు, సూచనల ద్వారా లబ్దిదారుల కుటుంబాలను గుర్తించి చరిత్రాత్మక ప్రాజెక్టును ప్రారంభించాం అని విజయన్ చెప్పారు. కాగా, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు సీఎం ప్రకటనను తప్పుబట్టాయి. ప్రభుత్వం తప్పుడు ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తోందని విమర్శించాయి. ప్రతిపక్ష నేత సతీశన్ అసెంబ్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రకటన భారీ మోసం అని విమర్శించారు. ప్రభుత్వ ప్రకటనను వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రతిపక్ష సభ్యుల ఆరోపణలపై సీఎం స్పందిస్తూ ఆయన వ్యాఖ్యలు అప్రస్తుతమని తోసిపుచ్చారు. దీనిపై ప్రతిపక్షాలు ఎందుకు భయపడుతున్నాయో అర్థంకావడం లేదన్నారు. ఈ ప్రభుత్వం తాను నెరవేర్చగల వాగ్దానాలను మాత్రమే చేస్తుంది.. చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తుంది. ఇప్పటికే సాధించిన వాటిని నిలబెట్టుకోవడానికి చర్యలు తీసుకుంటామని విజయన్ పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





