– కమీషన్ వ్యాపారులకు ఓపెన్ ప్లాట్ల కేటాయింపు
– భార్య పేర లైసెన్సులు.. భర్తల పేర చిల్లర అడ్డాలు
– కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా అటకెక్కిన విచారణ
– రాజకీయ ఒత్తిళ్లతో బయటకు రాని నివేదిక
– చిరు వ్యాపారుల ఆవేదన పట్టని ఉన్నతాధికారులు
వరంగల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25 : వరంగల్‌లోని లక్ష్మీపురం మోడల్ కూరగాయల మార్కెట్‌లో అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. నిరుపేద చిరు వ్యాపారులకు అండగా ఉండాల్సిన మార్కెట్ యంత్రాంగం ధనబలం, రాజకీయ పలుకుబడి ఉన్న కమీషన్ వ్యాపారులకు కొమ్ముకాస్తోంది. అక్రమంగా ఓపెన్ ప్లాట్లు, షట్టర్ల కేటాయింపులపై స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొండా సురేఖకు, జిల్లా కలెక్టర్‌కు స్వయంగా ఫిర్యాదు చేసినా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమాత్రం మారకపోవడం గమనార్హం. మార్కెట్‌లో చాలామంది వ్యాపారులు తమ భార్యల పేరుతో కమీషన్ లైసెన్సులు పొంది వారి పేరుతో ఓపెన్ ప్లాట్లు పొంది వాటిని అద్దెలకు ఇచ్చి నెలవారీగా ఆదాయం పొందుతున్నట్లు తెలుస్తోంది. సుమారు మూడేళ్ల క్రితం లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ కొత్తగా నిర్మించిన మోడల్ మార్కెట్‌లోకి మార్చారు. ఈ సమయంలో కమీషన్ వ్యాపారులకు షట్టర్లు, నిత్యం వ్యాపారం చేస్తున్న మినీ హోల్‌సేల్ వ్యాపారులకు 8*8 ఫ్లాట్లు, చిల్లర వ్యాపారులకు 6*6, మిగిలిన వారికి 4*4 ఫ్లాట్లు కేటాయించారు. మార్కెట్‌లో 103 కమీషన్ లైసెన్సులు ఉండగా ఇందులో కొంతమంది అప్పటి మార్కెట్ ఉన్నతాధికారికి పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి తమ భార్యల పేరుతో కమీషన్ లైసెన్సులు ఉన్నా తమ పేరుతో ఓపెన్ ప్లాట్లు కేటాయించుకున్నారు. ఓపెన్ ప్లాట్లు వస్తాయని ఆశ పడిన వారికి దక్కకుండా పోయే సరికి మంత్రి సురేఖ, జిల్లా కలెక్టర్ సత్యశారదలకు ఫిర్యాదు చేశారు. చిరు వ్యాపారుల ఫిర్యాదుతో కలెక్టర్ మార్కెట్‌కు వచ్చి అక్రమంగా కేటాయింపులపై విచారణ జరిపించాలని డీఎంవో సురేఖను ఆదేశించారు. డీఎంవో ఆదేశాలతో అప్పటి గ్రేడ్ 2 కార్యదర్శి నేతృత్వంలో విచారణ జరిపి నివేదికలను కలెక్టర్‌కు సమర్పించినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన వెంటనే కమీషన్ వ్యాపారులు కొందరు స్థానిక అధికార పార్టీ నాయకులను పట్టుకుని విచారణ నివేదకను బయటకు రాకుండా చేసిట్లు పలువురు చిరు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. అతర్వాత మార్కెట్ సందర్శనకు వచ్చిన మంత్రి చిరు వ్యాపారులకు న్యాయం చేస్తామని అనడం తప్ప ఆచరణలోకి రాలేదు. అదే అదనుగా భావించిన అధికార పార్టీ నాయకులు తమ అనుయాయులకు ఫ్లాట్లు ఇప్పించుకోగా కూరగాయల మార్కెట్ సూపర్‌వైజర్లు డబ్బులకు ఫ్లాట్లను అమ్ముకున్నారన్న ఆరోపణలు వినిపించాయి. మార్కెట్‌పై ఆధారపడి జీవిస్తున్న కొంత మంది యువ చిరు వ్యాపారులు ప్రజావాణిలో ఫిర్యాదు చేసి అదనంగా ఉన్న ఫ్లాట్లను రద్దు చేసి ఆ స్థానంలో తమకు కేటాయించాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై కలెక్టర్ విచారణ జరిపి కమీషన్ లై సెన్సు ఉన్న వ్యాపారికి ఉన్న ఓపెన్ ప్లాట్లను తొలగించి ఫిర్యాదు దారునికి కేటాయించాలని మార్కెట్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు.
ఒక కమీషన్ లైసెన్సు.. రెండు ఓపెన్ ప్లాట్లు 
పాత మార్కెట్ నుంచి మోడల్ మార్కెట్‌కు మారిన సమయంలో అప్పటి నేతల అండదండలతో ఒక వ్యాపారి కమీషన్ లైసెన్స్‌తో షట్టరు, 8*8 కేటగిరిలో ప్లాట్ నెంబర్ 25, మరొకటి మార్కెట్ ఆఫీసు ప్రక్కన 22 పేరున ఓపెన్ ప్లాటు పొందాడు. దీనిపై మార్కెట్ కార్యదర్శితో పాటు ఇతర ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో ఇటీవల గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు 20ఏళ్లుగా మార్కెట్‌లో చిల్లర వ్యాపారం చేస్తున్న వ్యాపారి ఫిర్యాదు చేశారు. ఈవిషయంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మార్కెట్ కార్యదర్శికి సిఫారసు చేయగా ఫిర్యాదుదారునికి మార్కెట్ అధికారులు ఫోన్ చేసి భవిష్యత్తులో ఇతర ఫ్లాటు కేటాయిస్తామని ప్రస్తుతం ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడికి గురిచేస్తున్నట్లు సమాచారం.
పట్టించుకోని అధికారి 
లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ మొత్తం అస్తవ్యస్తంగా తయారైందని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రత్యేకంగా గ్రేడ్ 2 కార్యదర్శిని ప్రత్యేకంగా కేటాయించారు. ఆయన వచ్చి మూడు నెలలు అయినప్పటికి మార్కెట్ వైపు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రేయిన్ మార్కెట్‌లో పత్తి సెక్షన్‌లో విధులు నిర్వర్తించిన ఆయన.. అక్కడ జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోకుండా కూరగాయల మార్కెట్ విధులు అప్పగించారు. ఇప్పటికైనా మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి స్పందించి కూరగాయల మార్కెట్‌పై దృష్టి పెట్టాలని వ్యాపారులు కోరుతున్నారు.
20 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నా : ఎస్‌కే.సిరాజ్, దేశాయిపేట 
లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లో 20 ఏళ్లుగా కూరగాయలు అమ్ముతున్న నాకు ప్లాట్ కేటాయించలేదు. అనర్హులకు రెండేసి ఫ్లాట్లు ఇచ్చారు. మా లాంటి పేద చిరు వ్యాపారులను పట్టించుకోలేదు. వెంటనే అదనంగా పొందిన వారి ఫ్లాట్లు రద్దు చేసి అర్హులకు అందించాలి.
———————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





