‌ప్రతి మహిళకు వ్యక్తిగత రుణాలు

గరిష్ఠ రుణ పరిమితి రూ.15లక్షలు
మహిళా ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం
మెప్మా సభ్యులతో ప్రత్యేక డ్రైవ్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 18: రాష్ట్రంలోని ప్రతి పేదింటి మహిళా ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలకు పేదవర్గాలకు చెందినవారైతే చాలు. తెల్లకార్డు తప్పనిసరిగా ఉండి తీరాలి. దీంతో పాటుగా స్వయం సహాయక సంఘాల్లో సభ్యులై ఉండాలి. ఈ పథకానికి అర్హులై ఉండి కూడా డ్వాక్రా గ్రూపుల్లో లేమని సిటీలు, పట్టణాల్లోని మహిళలు చింతించాల్సిన అవసరం లేదు. అలాంటి వారి కోసం ప్రభుత్వమే తగిన ఏర్పాట్లు చేసింది. కొత్తగా డ్వాక్రా గ్రూపుల్లో సభ్యత్వం పొందడానికి, స్వయం సహాయక సంఘాల ఏర్పాటుకు మెప్మా (పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ –  సహకరిస్తుంది. అర్హురాలైన ప్రతి మహిళలకూ సభ్యత్వం కల్పించి పథక ప్రయోజనాలు అందేలా చూస్తుంది.

కొత్తగా డ్వాక్రా సంఘాల్లో చేరాలని ఆశించే మహిళలు ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. మెప్మా ప్రతినిధులే మీ ఇంటికి వచ్చి ఆ అవకాశం కల్పిస్తారు. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్‌ని ప్రారంభించింది ప్రభుత్వం. జనవరి చివరి వరకూ చేపట్టే ఈ డ్రైవ్‌లో భాగంగా మెప్మా ఉద్యోగులు, సిబ్బందీ ఇంటింటికీ వెళ్లి ప్రత్యేక సర్వే నిర్వహిస్తారు. డ్వాక్రా గ్రూపుల్లో లేని మహిళల వివరాలు సేకరించి నెలాఖరు కంతా ఆ డేటా మొత్తం ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఆసక్తి ఉండి అర్హులైతే చాలు. మెప్మా సభ్యులే వారిని స్వయం సహాయక సంఘాల్లో  చేర్చుతారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మెప్మానే అర్హులైన మహిళలను స్వయం సహాయక సంఘాల్లో చేర్పించి రుణాలు ఇప్పిస్తుంది. గడువులోగా పని చేయాలని తెలంగాణ ప్రభుత్వం రూల్‌ ‌పెట్టడంతో వీలైనంత త్వరగా ఈ పని పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తోంది మెప్మా. ఇందిరా మహిళాశక్తి పథకంలో భాగంగా.. కొత్తగా డ్వాక్రా గ్రూపులో సభ్యత్వం పొందిన ప్రతి మహిళకు రూ.3.50 లక్షల వ్యక్తిగత రుణం ఇస్తారు.

గరిష్ఠ రుణ పరిమితి రూ.15లక్షల వరకూ ఉంటుంది. మెప్మా స్వయం సహాయక సంఘాలకు లభించే అన్ని ప్రయోజనాలూ వీరికి లభిస్తాయి. ఈ పథకం పొందినవారు ప్రమాదవశాత్తూ మరణిస్తే కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల బీమా పరిహారం దక్కుతుంది. సాధారణ మరణం అయితే రూ.2 లక్షల బీమా పరిహారం ఇస్తారు. తెల్లరేషన్‌ ‌కార్డు తప్పనిసరిగా ఉండాలి. మెప్మా ద్వారా డ్వాక్రా సంఘాల్లో చేరి ఉండాలి. ఇందిరా మహిళాశక్తి పథకం కింద రుణం తీసుకునే మహిళ.. ఏదైనా వ్యాపారం మొదలుపెట్టవచ్చు. పెద్ద వ్యాపారం చెయ్యాలనే ఆలోచన ఉన్నవారు మెప్మా ఉద్యోగుల సహాయంతో భారీ మొత్తంలో రుణాలు పొందవచ్చు. మరిన్ని వివరాలకు మెప్మా టోల్‌ ‌ఫ్రీ నంబర్‌ 040 1234 1234‌కి కాల్‌ ‌చేయవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page