ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి
సహాయక చర్యలు పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటన
సంగారెడ్డి,ప్రజాతంత్ర,జులై 1: పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన అని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 48 మంది మృతదేహాలు సంఘటన స్థలంలో లభ్యమయ్యాయని చెప్పారు. ఇంకా 11 మంది ఆచూకీ లభ్యం కావాల్సి ఉందన్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి తెలిపారు. మంగళవారం సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారంలో ఘటన స్థలాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావుతో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సంస్థ ఫార్మా కంపెనీలకు రా మెటీరియల్ అందిస్తుందన్నారు. గతంలో సైతం ఒక పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్ కారణంగా 11 మంది చనిపోయారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఉన్నతాధికారులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందని ప్రభుత్వానికి ఆయన సూచించారు. పరిశ్రమల్లో తనిఖీలు, లంచాల కోసం జరుగుతున్నాయా..? లేక నామ్ కే వాస్తే ప్రకారం జరుగుతున్నాయా..? అంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. పొట్ట కూటి కోసం వొచ్చి.. ఇలా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంతో 46 మంది చనిపోవటం చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. సిగాచి సంస్థలకు ఈ ఘటనలో మృతి చెందిన వారి జాబితా వచ్చిన తర్వాత ఆ యా రాష్ట్రాల వారికి తమ పార్టీ అండగా ఉంటుందని హా ఇచ్చారు. ఆచూకీ తెలియకుండా పోయిన వారి కోసం త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అలాగే పరిశ్రమల ప్రాంతంలో కచ్చితంగా అంబులెన్స్ ఉండే విధానం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ఆ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహకరిస్తామని స్పష్టం చేశారు. శిధిలాల కింద మృతదేహాల కోసం పోలీస్ జాగిలాలను వినియోగించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఆయన విజ్జప్తి చేశారు. చనిపోయిన కుటుంబ సభ్యులు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోతానంటే వారికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదంటూ విలేఖర్లు అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాస్తా ఘాటుగా సమాధానమిచ్చారు.