కాంగ్రెస్‌వి క‌ల్ల‌బొల్లి క‌బుర్లే!

– తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాన్ని మార్చారు
– అందాల‌పోటీతో సాధించిందేంటి?
– రైతుల‌కు జ‌నుము, జీలుగ విత్త‌నాలు లేవు
– ధాన్యంపై 3 నుంచి10కిలోల త‌రుగు తీస్తున్న‌రు
– రేవంత్‌కు ఇవేమీ ప‌ట్ట‌డంలేదు
– విరుచుకుప‌డ్డ బీఆర్ ఎస్ నేత హ‌రీష్‌రావు

తెలంగాణ తల్లి విగ్రహం మార్పు, అందాల పోటీల నిర్వహణలో వైఫల్యంతో రాష్ట్రానికి తీర‌ని మ‌చ్చ తెచ్చారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి హ‌రీష్‌రావు విరుచుకుప‌డ్డారు. గజ్వెల్ నియోజకవర్గం, తీగుల్ గ్రామంలో ఆయ‌న ఆదివారం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, తెలంగాణ తల్లి విగ్రహాన్నిఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ గ్రామంలో సొంత జాగా కొని, సొంత పైసలతో పార్టీ ఆఫీసు నిర్మించిన ఘనత తీగుల్ పార్టీ కార్యకర్తలకే దక్కింద‌ని ప్ర‌శంసించారు. 2001లో బిఆర్ఎస్ పార్టీ పెట్టిన నాడు జాగ కొంటే రజతోత్సవం సందర్భంగా బిల్డింగ్ ప్రారంభించుకోవ‌డం ద్వారా రాష్ట్రానికే ఈ గ్రామం ఆద‌ర్శంగా నిలిచింద‌న్నారు.

స్వాతంత్రోద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు తీగుల్ గ్రామానికి గొప్ప చ‌రిత్ర వున్న‌ద‌న్నారు. 1969 తొలి తెలంగాణ ఉద్యమంలో ఈ గ్రామం నుంచి కుమ్మరి బాలయ్య, కిష్టాపురం శాంతయ్య, ఆంజనేయులు, మల్లారెడ్డి వంటి వారు ఎందరో జై తెలంగాణ అని ముందుండి పోరాటం చేసిన సంఘ‌ట‌నలు గుర్తుకు తెచ్చుకుంటే ఎంతో గ‌ర్వంగా వుంటుంద‌న్నారు.  తెలంగాణ తల్లి ఉద్యమానికి స్పూర్తి, ఆ తల్లి దీవెనతో తెలంగాణ సాధించుకున్నం. తల్లిని మార్చితే ఏం వస్తద‌ని ప్ర‌శ్నించారు. కేసీఆర్ ఆనవాళ్లు చేయడం సాధ్యమయ్యే పనేనా? రైతు బంధు మార్చుతవా?  కల్యాణ లక్ష్మి మార్చుతవా? సచివాలయం తీసేస్తవా? 125 అడుగుల అంబేద్కర్ తీసేస్తవా? అని ప్ర‌శ్నించారు.
తెలంగాణ త‌ల్లిని మార్చ‌డం, చార్మినార్ బొమ్మ తీయడం, కాకతీయుల కాళాతోరణం మార్చడం ఇదేనా నువ్వు చెప్పిన మార్పంటే? అని ప్ర‌శ్నించారు.  కేసీఆర్ ఉన్నపుడు కరెంట్ కష్టాలు లేవు. రేవంత్ రెడ్డి రాంగనే కేసీఆర్ కిట్టు బంద్ అయ్యింది. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పాత రోజులు వచ్చినయి. కాంగ్రెస్ పార్టీ అంటేనే కల్లబొల్లి మాటలు చెప్పడం, అధికారంలోకి వచ్చాక ప్రజల్ని మోసం చేయడం. పింఛన్లు 4వేలు అన్నడు, 15వేల రైతు బంధు అన్నడు, పెండ్లి చేసుకుంటే తులం బంగారం అన్నడు, ఆడోళ్లకు నెలకు 2500 ఇస్తమన్నడు. నమ్మి ఓటేస్తే నట్టేట ముంచిండు. ఆశపడ్డందుకు బాధ పడే పరిస్థితి వచ్చింది జన్మల కాంగ్రెస్ కు ఓటు వేయద్దని అంటున్నరు. జనుము, జీలుగు విత్తనాలు ఇవ్వమంటే చేత గాదు కేసీఆర్ ఉండగా రూ.1100 సంచి ఉంటే, ఇప్పుడు రూ. 2700 చేసిండు. రూ. 200 కోట్లు పెట్టి అందాల పోటీలు పెడితే ఎవరి కడుపు నిండింది?  ఇంగ్లాండ్ లో ఉండే కంటెస్టెంట్ ని రేవంత్ రెడ్డి దోస్తులు ఇబ్బంది పెడితే పారిపోయింది! పోటీ నుంచి విరమించుకొని ఆమె దేశానికి పారిపోవడం అవమానకరమ‌న్నారు. నీ విందు వినోదాల కోసం పెట్టావా, అందాల బామలను చూడడానికి 5 సార్లు పోయినవు. ఒక్క సారి కూడా ధాన్యం కొనుగోళ్లు చూసేది లేదా, జనుము జీలుగు విత్తనాలు ఉన్నయా లేవా చూసేది లేదా?  రూ. 200 కోట్లు ఖర్చు పెట్టి చూసే సోకు ఉంటే చూసినవు తప్ప ప్రజలకు చేసిందేం లేదు.
భోజనాలు చేసినవు, ముచ్చట్లు పెట్టి వచ్చినవు తప్ప ఏం చేసినవు. ధాన్యంలో మూడు నుంచి 10 కిలోలు తరుగు తీస్తున్నరు. అసెంబ్లీలో మాత్రం తరుగు తీయడం లేదు అన్నడు. సన్నాలు కొంటే ఇప్పటికీ ఒక్క రూపాయి బోనస్ రాలేదు. బోనస్ బోగస్ చేసిండు. రూ. 1100 కోట్లు బాకీ పడ్డడు. ఎరువులు అందుతలేవు, పత్తి విత్తనాల కోసం రైతుల ధర్నాలు చేస్తున్నరు. పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రానికి ఎవరు రావడం లేదు. రియల్ ఎస్టేట్ ఢమాల్ అయ్యింది. ఉన్నపుడు మనిషి విలువ తెలియదు. ఇప్పుడు కేసీఆర్ విలువ అందిరికి అర్థం అవుతున్నది.  పదేండ్లలో కేసీఆర్ నిలబెడితే, రేవంత్ రెడ్డి ఏడాదిన్నరలో పడగొట్టిండు రాజీవ్ యువశక్తి కాంగ్రెస్ కార్యకర్తల జేబులు నింపడానికే ఇస్తున్నరు. దళిత బంధు బంద్, ఎస్సీ కార్పొరేషన్ బంద్, ముస్లీంలకు ఇచ్చేది బంద్, బీసీలకు ఇచ్చేది బంద్ పెట్టారు. రేవంత్ పాల‌న‌లో అన్నీ బందేన‌ని ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page