ఉడకలేదని తెలుపుతున్న మెతుకు!

తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి, పది సంవత్సరాల తెలంగాణ/భారత రాష్ట్ర సమితి పాలన తర్వాత, కాంగ్రెస్ పాలన ప్రారంభమై ఏడాది నిండుతున్నది. ఏ ప్రభుత్వానికైనా ఏడాది పని తీరు ఒక గణనీయమైన సూచికే అవుతుంది. ఐదు మైళ్ల ప్రయాణంలో ఈ మైలు ఎలా గడిచిందో ఈ మైలురాయి దగ్గర ఆగి మదింపు చేసుకోవచ్చు. అటువంటి వివరమైన ప్రోగ్రెస్ రిపోర్ట్ కు ఈ శీర్షిక పరిధి అనుమతించదు గాని స్థూలమైన అంశాలనైనా ప్రస్తావించుకోవాలి.

ఏడాది గడిచాక ఈ ప్రభుత్వం మీద కొట్టవచ్చినట్టు కనిపించే అంశం ఇంత తొందరగా ఇంత పెద్ద ఎత్తున ప్రజా అసంతృప్తిని, వ్యతిరేకతను మూటగట్టుకోగలిగిన సర్కారు మరొకటి ఉండదు, కనీసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేదు అనేదే. ఎప్పుడైనా ప్రభుత్వాలు జనాభాలో అత్యధిక శాతం ప్రజలకు వ్యతిరేకంగా ఉంటాయని, అతి కొద్ది మంది ప్రయోజనాల కోసం మాత్రమే పని చేస్తాయని, ఏ ప్రభుత్వం మీదనైనా ప్రజలలో అసంతృప్తి, వ్యతిరేకత పోగు పడతాయని సాధారణ, స్థూల అభిప్రాయం ఉండేవాళ్లు కూడా ఆ అసంతృప్తి, వ్యతిరేకతలను సంపాదించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వపు వేగాన్నీ, సామర్థ్యాన్నీ చూసి ఆశ్చర్యపోవలసిందే. పది సంవత్సరాల పాలనతో తీవ్రమైన వ్యతిరేకత మూటగట్టుకుని ఓడిపోయిన ప్రధాన ప్రతిపక్షం ఇవాళ్టికివాళ ఎన్నికలు పెడితే గెలిచే పరిస్థితిలో ఉన్నదనడం అతిశయోక్తి కాదు.

కాంగ్రెస్ ఏడాది పాలన సమీక్ష వేరు వేరు దృక్కోణాల నుంచి జరగవచ్చు. గత ప్రభుత్వ పనితీరుతో ఈ ప్రభుత్వ పనితీరును పోల్చి చూడవచ్చు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల, ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ ప్రభుత్వాల పనితీరుతో ఈ ప్రభుత్వ పనితీరును పోల్చి చూడవచ్చు. కాంగ్రెస్ అధినాయకులు, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల, ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీల నేపథ్యంలో ప్రభుత్వ పనితీరును పోల్చి చూడవచ్చు. తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షల వైపు నుంచి, రాష్ట్రంలో సాగిన, సాగుతున్న ప్రజా ఉద్యమాల ఆకాంక్షల వైపు నుంచి కూడా ప్రభుత్వ పనితీరును పోల్చి చూడవచ్చు. ఈ దృక్కోణాలలో ఏ దృక్కోణం నుంచి చూసిన నికరంగా వచ్చే ఫలితం దాదాపు సమానమే. ప్రభుత్వం ప్రజానుకూలంగా, ప్రజల ఆకాంక్షలను, ప్రయోజనాలను నెరవేర్చే దిశగా సాగుతున్నదా లేదా అనేదే.

 

“ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఈ అప్రజాస్వామిక విధానాలన్నిటినీ, చర్యలన్నిటినీ సమీక్షించడం, సవరించడం, ఆ అప్రజాస్వామిక చర్యలకు బాధ్యులైన అధికారులను విచారించడం, మళ్లీ అటువంటి అప్రజాస్వామిక చర్యలు, ప్రజాస్వామిక హక్కుల ఉల్లంఘన జరగబోవని హామీ పడడం. గతం కన్నా భిన్నమైన భవిష్యత్తును వాగ్దానం చేసిన కొత్త తెలంగాణ ప్రభుత్వం ఆ వాగ్దానాన్ని నిలుపుకుంటుందా?” అని సరిగ్గా ఏడాది కింద ప్రశ్నించాను.

 

కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక 2023 తెలంగాణ ప్రజలకు ప్రధానంగా ఆరు పథకాలు వాగ్దానం చేసింది. అవి, మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయూత. మహాలక్ష్మి కింద స్త్రీలకు ప్రతి నెలా రు. 2500, రు. 500 కే గ్యాస్ సిలిండర్, స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా కింద ప్రతి రైతుకూ, కౌలుదారుకూ ప్రతి సంవత్సరం రు. 15,000, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రు. 12,000, వరి పంటకు రైతుకు అదనంగా రు. 500, గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకూ అన్ని ఇళ్లకూ ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇండ్లు కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, రు. ఐదు లక్షలు, తెలంగాణ ఉద్యమ కార్యకర్తలకు 250 చ.గజాల స్థలం, యువ వికాసం కింద విద్యార్థులకు ఐదు లక్షల రూపాయల విద్యా భరోసా కార్డ్, ప్రతి మండలంలోనూ తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్, చేయూత కింద ప్రతి నెల రు. 4000 పెన్షన్, రు. 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా ఈ హామీలలో కొన్ని. నిజానికి ఈ వాగ్దానాలలో స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం మినహా ఏ ఒక్కటీ పూర్తిగా అమలు కాలేదు. కొన్ని అరకొరగా అమలయ్యాయి. సాంకేతిక, నిర్వహణా ఇబ్బందులు అలా ఉంచి, అసలు ఈ వాగ్దానాలను అమలు చేసే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉందా అనేది అనుమానం. ఈ వాగ్దానాల అమలు గురించి మాత్రమే కాదు, ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాల కల్పన, రైతు రుణమాఫీ వంటి హామీల గురించి కూడా ప్రభుత్వం విడుదల చేస్తున్న గణాంకాలు అర్ధసత్యాలు, అబద్ధాలు మాత్రమే. వీటిలో ఒక్కొక్క వాగ్దానపు అమలు తీరు గురించి వివరణ, విశ్లేషణ ఒక గ్రంథమే అవుతుంది.

ఆ వాగ్దానాలు అలా ఉంచి, కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రకటించిన హామీలకు తోడుగా, ఏడో హామీగా ముఖ్యమంత్రి కాక ముందే పిసిసి అధ్యక్షుడుగానే రేవంత్ రెడ్డి పౌరహక్కుల పునరుద్ధరణ, ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనే ఏడో హామీ ప్రకటించారు. దాన్ని ఎన్నికల ప్రచారంలో భాగంగా అనేకచోట్ల చెప్పడం మాత్రమే కాదు, ఫలితాలు వచ్చాక ప్రజలకు కృతజ్ఞతలు చెపుతూ ఇచ్చిన ఉపన్యాసంలో మళ్లీ చెప్పారు. అధికారం చేపట్టినాక ముఖ్యమంత్రి హోదాలో ఆ హామీని పునరుద్ఘాటించారు.

కాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, విభజనానంతరం కెసిఆర్ పాలనలోనూ తెలంగాణలో అమలైనటువంటి పోలీసు రాజ్యమే, ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనే, అణచివేతే రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్య పునరుద్ధరణ పాలనలో యథాతథంగా, ఇంకా రెండాకులు ఎక్కువ చదివినట్టుగా అమలవుతున్నది. ఆరు హామీలూ అమలు చేశారా లేదా చూడడానికి, మాట్లాడడానికి, అడగడానికి, చర్చించడానికి కూడా ఏడో హామీ అమలు కావాలి. కాని రేవంత్ రెడ్డి పోలీసు రాజ్యం ఏడో హామీకి పూర్తిగా గుండు సున్నా చుట్టేసింది.

ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనే పదబంధాన్ని రేవంత్ రెడ్డి విరివిగా ఉపయోగిస్తున్నప్పుడు, ‘ప్రజాస్వామ్య పునరుద్ధరణ’ అంటే ఏమిటో వివరిస్తూ ఏడాది కింద, సరిగ్గా ఆయన గద్దెనెక్కిన మర్నాడు ఒక ప్రముఖ దినపత్రికలో నేనొక వ్యాసం రాశాను. ఆ వ్యాసంలో అంతకు ముందు పది సంవత్సరాలలో అణచివేతకు గురైన ప్రజాస్వామ్య అంశాల జాబితా ఇచ్చాను: వాక్సభా స్వాతంత్ర్యాల మీద, స్వేచ్ఛాయుత ప్రజాభిప్రాయ వ్యకీకరణ మీద, అంటే రాజ్యాంగ అధికరణం 19 (1) హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కుల మీద ఉక్కుపాదం. సభలు, సమావేశాలు, ఊరేగింపుల మీద అప్రకటిత నిషేధం, సభ ఏర్పాటు చేసిన హాలు యాజమాన్యాన్ని బెదిరించడం, నిరసన ప్రకటిస్తామని స్థలమూ సమయమూ ప్రకటించినవారిని ఆ సమయానికి ముందే ఇంటికి వచ్చి అరెస్టు చేయడం, ధర్నాచౌక్ ను మూసివేయడం. ముఖ్యమంత్రి, ఇతర ముఖ్య నాయకులు ఏదైనా పట్టణానికో, గ్రామానికో వెళ్తున్నప్పుడు ముందస్తుగా అక్కడి ప్రతిపక్ష, ప్రజాసంఘ నాయకులను అక్రమంగా నిర్బంధించడం. భిన్నాభిప్రాయం ప్రకటించే పత్రికల మీద, ఛానళ్ల మీద ఆంక్షలు, సామ దాన భేద దండోపాయాలు అమలు చేయడం, మరొక వైపు అబద్ధాలూ అర్ధసత్యాలూ ప్రచారంలో పెట్టడం, నిర్బంధాలు, నిషేధాలు, తప్పుడు కేసులు, బూటకపు ఎన్ కౌంటర్లు, తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలకు దిగిన ఆదివాసులు, నిరుద్యోగులు, రైతులు, కౌలుదార్లు, విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, ఆంగన్వాడీ సిబ్బంది, ఉపాధ్యాయులు, రెవెన్యూ సిబ్బంది వంటి ఎన్నో వర్గాల మీద అణచివేత… ఇవీ పునరుద్ధరించవలసిన ప్రజాస్వామ్యం సమస్యలు.

ఆ జాబితా అంతా వివరించి, “ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఈ అప్రజాస్వామిక విధానాలన్నిటినీ, చర్యలన్నిటినీ సమీక్షించడం, సవరించడం, ఆ అప్రజాస్వామిక చర్యలకు బాధ్యులైన అధికారులను విచారించడం, మళ్లీ అటువంటి అప్రజాస్వామిక చర్యలు, ప్రజాస్వామిక హక్కుల ఉల్లంఘన జరగబోవని హామీ పడడం. గతం కన్నా భిన్నమైన భవిష్యత్తును వాగ్దానం చేసిన కొత్త తెలంగాణ ప్రభుత్వం ఆ వాగ్దానాన్ని నిలుపుకుంటుందా?” అని సరిగ్గా ఏడాది కింద ప్రశ్నించాను.

హైదరాబాదులోని ఒక ప్రధాన సమావేశ మందిరానికి తమ అనుమతి లేకుండా హాలు ఎవరికీ అద్దెకు ఇవ్వవద్దని స్థానిక పోలీసు అధికారులు అత్యంత అనుచితమైన, రాజ్యాంగ వ్యతిరేకమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రొ. జి ఎన్ సాయిబాబా సంస్మరణ సభకు వరంగల్ లో ఆటంకాలు కల్పించారు. పౌరహక్కుల సంఘం సభ తర్వాత ఊరేగింపు జరపడానికి అనుమతి అడిగితే, ప్రొ. హరగోపాల్ పాల్గొంటున్నారు గనుక అనుమతి ఇవ్వం అని బాజాప్తా చెప్పారు. హైకోర్టు ఆదేశాల వల్ల ధర్నా చౌక్ నిరసనలను అనుమతించడం మొదలైనా, ఎంతమంది రావచ్చు, ఎప్పుడు నిరసన తెలపవచ్చు వంటి అనవసరమైన ఆంక్షలు అమలు చేయడానికి పోలీసులు ఇంకా ఉవ్విళ్లూరుతూనే ఉన్నారు. లగచెర్ల లో తమ న్యాయమైన నిరసన తెలుపుతున్న ప్రజల మీద అర్ధరాత్రి దాడి చేసి గ్రామంలో భయభీతావహం సృష్టించి గ్రామస్తుల మీద అక్రమ కేసులు బనాయించారు. దిలావర్ పూర్ లో ప్రజల నిరసన సభకు అనుమతి నిరాకరించారు. ధన్వాడలో బహిరంగ సభకు అనుమతి నిరాకరించారు. విద్యార్థుల, నిరుద్యోగ యువజనుల ఆందోళనలపై అప్రజాస్వామికంగా, దౌర్జన్యపూరితంగా ప్రవర్తించారు.

ఈ ఏడాదిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఆ వాగ్దానాన్ని నిలుపుకోలేదు సరిగదా, గత పది సంవత్సరాల దారుణ దమననీతిని యథాతథంగా, మరికాస్త ఎక్కువగా కొనసాగించారు. ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉందని, అందులో ప్రాథమిక హక్కుల అధ్యాయం ఒకటుందని, అందులో 19 (1) అధికరణం వాక్సభా స్వాతంత్ర్యాలకు హామీ ఇస్తుందని ఉమ్మడి రాష్ట్రం రోజుల నుంచీ పోలీసులు మరిచిపోయారు. లేదా రాజ్యాంగమంటే లెక్కేమిటి అనుకున్నారు. కెసిఆర్ ప్రభుత్వం ఆ మతిమరపును, ఆ తూష్ణీభావాన్ని పెంచి పోషించింది. ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ పోలీసుతత్వాన్ని కొనసాగించింది.

హైదరాబాదులోని ఒక ప్రధాన సమావేశ మందిరానికి తమ అనుమతి లేకుండా హాలు ఎవరికీ అద్దెకు ఇవ్వవద్దని స్థానిక పోలీసు అధికారులు అత్యంత అనుచితమైన, రాజ్యాంగ వ్యతిరేకమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రొ. జి ఎన్ సాయిబాబా సంస్మరణ సభకు వరంగల్ లో ఆటంకాలు కల్పించారు. పౌరహక్కుల సంఘం సభ తర్వాత ఊరేగింపు జరపడానికి అనుమతి అడిగితే, ప్రొ. హరగోపాల్ పాల్గొంటున్నారు గనుక అనుమతి ఇవ్వం అని బాజాప్తా చెప్పారు. హైకోర్టు ఆదేశాల వల్ల ధర్నా చౌక్ నిరసనలను అనుమతించడం మొదలైనా, ఎంతమంది రావచ్చు, ఎప్పుడు నిరసన తెలపవచ్చు వంటి అనవసరమైన ఆంక్షలు అమలు చేయడానికి పోలీసులు ఇంకా ఉవ్విళ్లూరుతూనే ఉన్నారు. లగచెర్ల లో తమ న్యాయమైన నిరసన తెలుపుతున్న ప్రజల మీద అర్ధరాత్రి దాడి చేసి గ్రామంలో భయభీతావహం సృష్టించి గ్రామస్తుల మీద అక్రమ కేసులు బనాయించారు. దిలావర్ పూర్ లో ప్రజల నిరసన సభకు అనుమతి నిరాకరించారు. ధన్వాడలో బహిరంగ సభకు అనుమతి నిరాకరించారు. విద్యార్థుల, నిరుద్యోగ యువజనుల ఆందోళనలపై అప్రజాస్వామికంగా, దౌర్జన్యపూరితంగా ప్రవర్తించారు.

గత ప్రభుత్వం వందలాది మంది మీద డజన్ల కొద్దీ అక్రమ కేసులు బనాయించిందని, అవన్నీ బేషరతుగా ఉపసంహరించుకోవలసినవని, కనీసం వాటి మీద సమీక్ష అయినా జరపమని పౌరసంఘాలు కోరిన కోర్కెను అంగీకరించి, సమీక్ష జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారని వార్తలు వచ్చినప్పటికీ, ఏడాది గడిచినా ఒక్క కేసు కూడా ఎత్తివేయలేదు. హరగోపాల్, పద్మజాషా వంటి వారి మీద పెట్టిన కేసు ఉపసంహరించుకుంటామని గత ప్రభుత్వమే ప్రకటించినా, ఇప్పటివరకూ ఆ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున అవసరమైన మెమో కూడా వేయలేదు. దిలావర్ పూర్ ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా పోరాడుతున్నప్రజలకు సంఘీభావం తెలియజేశారనే కారణంతో ఒక ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు.

సరిగ్గా ఇది రాస్తున్న సమయానికి ముఖ్యమంత్రి యువ వికాసం పేరుతో పెద్దపల్లిలో సభ జరుపుతుండగా, స్థానిక ప్రతిపక్ష, ప్రజాసంఘ నాయకులను అరెస్టు చేసి అక్రమంగా పోలీసు స్టేషన్ లో నిర్బంధించి ఉంచారు.  టీవీ ఛానళ్లలో చర్చలు జరిగితే ప్రభుత్వ విధానాల మీద విమర్శలు వస్తాయని, అసలు టీవీ చర్చలే జరపగూడదని ఆంక్షలు విధిస్తున్నారు. పత్రికలను భయపెట్టడం, ప్రభుత్వ వ్యతిరేక వార్తలు, వ్యాఖ్యలు రాకుండా అడ్డుకోవడం యథావిధిగా సాగిపోతున్నది. ప్రధాన స్రవంతి మాధ్యమాల నోరు అట్లా మూసేసి, ఇక ప్రజలకు మిగిలిన సామాజిక మాధ్యమాల మీద పడ్డారు. వ్యక్తుల మీద బెదిరింపులు సరేసరి, ప్రతిపక్ష సోషల్ మీడియా, డిజిటల్ సమాచార సారథి మీద విపరీతమైన కక్ష సాధింపు సాగిస్తున్నారు.

అన్నిటికీ మించి, ప్రతిరోజూ భారతీయ జనతా పార్టీతో, ఆర్ ఎస్ ఎస్ తో వైరం ఉన్నట్టు మాటలు గుప్పిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, విప్లవోద్యమానికి వ్యతిరేకంగా అమిత్ షా నడుపుతున్న ఆపరేషన్ కగార్ లో ఇష్టపూర్వక భాగస్వామిగా ఉన్నది. ఈ ఏడాది పాలనలో మూడు బూటకపు ఎన్ కౌంటర్లు (జూలై 25 దామరతోగు, సెప్టెంబర్ 5 రఘునాథపాలెం, డిసెంబర్ 1 చల్పాక) జరిపి పద్నాలుగు మందిని హత్య చేసింది. ఈ ఘటనల్లో ఒకదానిలో పోలీసులు ప్రకటించినట్టుగా నిజమైన ఎన్ కౌంటరేనా కాదా నిజనిర్ధారణ చేయడానికి వెళ్లిన మేధావుల బృందాన్ని అరెస్టు చేసి ఘటనా స్థలానికి వెళ్లకుండా అడ్డుకుంది. మిగిలిన మెతుకుల దాకా పోనవసరం లేదు, ఈ ఒక్క మెతుకే అన్నం ఉడికిందో లేదో, తమ హామీల పట్ల తమకే గౌరవం ఉందో లేదో తెలుపుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page