లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్య
రాజ్యాంగం స్థానంలో మనుస్మృతి ఉండాలని వీడీ సావర్కర్ చెబితే ఇప్పుడు బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని రక్షిస్తామని అనడం విడ్డూరంగా ఉందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాజ్యాంగంపై లోక్‌సభలో జరుగుతున్న చర్చలో రాహుల్ పాల్గొన్నారు. రాజ్యాంగంలో అసలు భారతీయతే లేదనీ, దాని స్థానంలో మనుస్మృతి ఉండాలని ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ చెప్పిన మాటలను రాహుల్ గుర్తు చేశారు. ఏకలవ్యుడి బొటనవేలిని ద్రోణుడు నరికించినట్లే అదానీ, అంబానీ లాభం కోసం చిన్న వ్యాపారుల వేలిని బీజేపీ కత్తిరించిందని రాహుల్ వ్యాఖ్యానించారు. అగ్నివీర్, ప్రశ్నపత్రాల లీక్‌ల ద్వారా యువత బొటనవేలిని కత్తిరించారని మండిపడ్డారు. మద్దతు ధర కోసం ఉద్యమిస్తున్న రైతుల బొటనవేలిని కత్తిరించారని దుయ్యబట్టారు. సామాజిక, ఆర్థిక సమానత్వం లేకుంటే రాజకీయ సమానత్వం ఉండదని అంబేడ్కర్ చెప్పారన్న రాహుల్, కులగణనతో సమానత్వం వైపు అడుగులేస్తామని తెలిపారు.
మతం, జాతి, కులం, లింగం లేదా జన్మస్థలం ఆధారిత వివక్షను నిషేధించాలని రాజ్యాంగం చెబితే బీజేపీ మాత్రం విద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని తెలిపారు. మనుస్మృతి వంటి ప్రాచీన విధానాలతోనే దేశం నడవాలని బీజేపీ కోరుకుంటోందని ఆరోపించారు. రాజ్యాంగం గురించి, భారతదేశాన్ని ఎలా నడపాలని ఆర్‌ఎస్‌ఎస్ సుప్రీం లీడర్ సావర్కర్ భావించారో చెబుతూ నా ప్రసంగాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. ‘‘రాజ్యాంగంలో చెత్త విషయం ఏమిటంటే, దానిలో భారతీయత ఏమీ లేదు. మనుస్మృతి అనేది మన హిందూ దేశానికి వేదాల తర్వాత అత్యంత పూజనీయమైనది. మన ప్రాచీన కాలం నుంచి మన సంస్కృతి, ఆచారాలు, ఆలోచనలు, ఆచరణలకు ఆధారమైంది.’’ ఇవి సావర్కర్ చెప్పిన మాటలు. సావర్కర్ తన రచనల్లో మన రాజ్యాంగంలో భారతీయత ఏమీ లేదని స్పష్టంగా చెప్పారు. రాజ్యాంగాన్ని మనుస్మృతితో భర్తీ చేయాలని ఆయన చెప్పారు. దానికి వ్యతిరేకంగానే మేం పోరాటం చేస్తున్నామన్నారు.