మార్చి 1 నుంచే లక్ష రేషన్‌ ‌కార్డులు పంపిణీ

రేషన్‌ ‌కార్డుల జారీకి రంగం సిద్ధం
ఎన్నో ఏళ్ల తర్వాత తీరనున్న కల

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,  ఫిబ్రవరి 25 : ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పేదలకు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం శుభవార్తను అందించింది. గత పదేళ్లకు పైగా అన్ని అర్హతలు ఉన్న తెల్ల రేషన్‌కార్డు లేకపోవడంతో అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డులు ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు మార్చి ఒకటి నుంచి కొత్త రేషన్‌ ‌కార్డులు జారీ చేయనున్నట్లు రేవంత్‌ ‌రెడ్డి సర్కార్‌ ‌ప్రకటించింది. మార్చి ఒకటిన ఒకే రోజు లక్ష కార్డులు జారీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఈ మేరకు హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లాల్లో లక్ష కార్డులను అధికారులు పంపిణీ చేయనున్నారు. కొత్త జిల్లాల ప్రకారం.. హైదరాబాద్‌- 285, ‌వికారాబాద్‌ ‌జిల్లా- 22 వేలు, నాగర్‌కర్నూల్‌ ‌జిల్లా- 15 వేలు, నారాయణపేట జిల్లా- 12 వేలు, వనపర్తి జిల్లా- 6 వేలు, మహబూబ్‌నగర్‌ ‌జిల్లా- 13 వేలు, గద్వాల్‌ ‌జిల్లా- 13 వేలు, మేడ్చల్‌ ‌మల్కాజిగిరి జిల్లా- 6 వేలు, రంగారెడ్డి జిల్లా- 24 వేలు చొప్పున లక్ష కార్డులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మార్చి 8 తర్వాత అన్ని జిల్లాల్లో పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.

కాగా, 2014 నుంచి తెలంగాణలో నూతన రేషన్‌ ‌కార్డులు జారీ చేయలేదు. ఈ పదేళ్లలో లక్షల మంది వివాహాలు చేసుకుని వేరు కాపురాలు పెట్టారు. ప్రభుత్వ పథకాలు ఏమైనా అందాలంటే రేషన్‌ ‌కార్డులు కీలకం. కార్డులు లేక అనేక మంది సంక్షేమ పథకాలను కోల్పోయిన సందర్భాలూ అనేకం ఉన్నాయి. ఈ సమస్యను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజలకు నూతన కార్డులు జారీ చేస్తున్నట్లు శుభవార్త చెప్పింది. ఇందులో భాగంగానే ఈ ఏడాది జనవరి 26న కూడా 16,900 కుటుంబాలకు రేషన్‌ ‌కార్డులు మంజూరు చేశారు. మరోసారి ఈ ప్రక్రియ చేపట్టి మరికొన్ని కుటుంబాలకు లబ్ధి చేకూర్చేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ప్రజాపాలన, గ్రామ సభల్లో దరఖాస్తులు స్వీకరించిన అధికారులు.. తాజాగా మీ సేవా కేంద్రాల ద్వారా కూడా అప్లికేషన్లు తీసుకుంటున్నారు. వాటిని పరిశీలించిన అనంతరం అర్హులకు నూతన కార్డులను మంజూరు చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page