అవగాహన లేని వారి మాటలు పట్టించుకోవద్దు..
•టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: కాంగ్రెస్ పార్టీలోని ఇతర కులాలకు చెందిన కొంతమంది నాయకులు ఇటీవల రెడ్డి సామాజిక వర్గంపై చేసిన విమర్శల్ని తప్పుగా తీసుకోవొద్దని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయన మంగళవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీలో నాయకులకు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్పే హక్కు ఉంటుంది. రెడ్డి సామాజిక వర్గంపై ఇతర కులాలకు చెందిన కొందరు చేసిన వ్యాఖ్యలను మన తోటి సోదరులు చేసిన వ్యాఖ్యలుగానే భావించండి. కాంగ్రెస్ పార్టీపై చేసిన ఈ వ్యాఖ్యల పట్ల అన్యధా భావించకండన్నారు.
రెడ్డి సామాజిక వర్గం తెలంగాణ ప్రాంతంలో గ్రామాల్లో అన్ని కులాలు, మతాలకు సంబంధించిన వాళ్లతో స్నేహంగా కలిసి మెలిసి జీవనం సాగించే సామాజిక వర్గం ఇది పూర్వం నుంచి వొస్తున్న సాంప్రదాయం అని అన్నారు. గ్రామాల్లో ఆయా వర్గాలకు సంబంధించిన వాళ్లకు ఎటువంటి సమస్య వొచ్చినా వారితో కలిసి వారి సమస్యలను తీర్చడం కోసం పనిచేసిన సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం అని వివరించారు. అందుకే, ఇన్నేళ్లుగా ఆ సామాజిక వర్గం పట్ల ప్రజలు ఇంత ప్రేమ, ఆప్యాయతను చూపిస్తూన్నారన్నారు. కొంతమంది చేసిన వ్యాఖ్యలకు బాధపడి, వారిని తప్పుగా అనుకొని కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేక భావనను పెంచుకోవద్దని కోరారు.
కాంగ్రెస్ పార్టీలోకి మధ్యలో వొచ్చిన కొందరు ఇతర కులాలకు చెందిన నాయకులు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. కానీ, ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న ఇతర కులాలకు సంబంధించిన కొంతమంది నాయకులు, ఇటీవల మాట్లాడిన మాటలు మాత్రం కేవలం ఎమోషనల్ గా మాట్లాడిన మాటలే తప్ప, మన సామాజిక వర్గం పైన వ్యతిరేకతతోనో, ఇంకోరకంగానో మాట్లాడిన మాటలు కాదని గుర్తించాలని కోరారు. రెడ్డి సామాజిక వర్గం ప్రస్తుతం తెలంగాణలో నాయకత్వ స్థానంలో ఉందనీ, ఈ సామాజిక వర్గానికి సంబంధించిన వారంతా పెద్ద మనసుతో ఉండాలి ఓపిగ్గా ఉండాలనీ జగ్గారెడ్డి కోరారు.