అభివృద్ధిలో తెలంగాణతో ఏ రాష్ట్రం పోటీ పడలేదు

యంగ్‌ ఇం‌డియా ఇంటిగ్రేటెడ్‌ ‌రెసిడెన్షియల్‌ ‌స్కూల్స్‌లో ఉచిత విద్య
ఇందిరా గిరి జిల్లా వికాసం పథకం
పదేళ్ళ ఫామ్‌ ‌హౌస్‌ ‌పాలనలో ప్రజల సొమ్ము దుబారా
అడ్డగోలుగా మాటలకు అభివృద్ధి సమాధానం
కెసిఆర్‌  ‌తెచ్చింది, ఇచ్చిందేమి లేదు
డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క

కొత్తగూడెం, ప్రజాతంత్ర, మే 17: ప్రజాపాలన ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకు పోతుందని, అభివృద్ధిలో తెలంగాణతో పోటీపడే శక్తి దేశంలో ఏ రాష్ట్రానికి లేదని డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.  కొత్తగూడెం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శనివారం డిప్యూటిసి సిఎం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం పార్లమెంట్‌ ‌సభ్యులు రామసహాయం రఘురామ రెడ్డితో కలిసి హాజరయ్యారు. అందులో భాగంగా కొత్తగూడెం కలెక్టరేట్‌లో మూడు 33కెవి విద్యుత్‌ ‌సబ్‌ ‌స్టేషన్‌‌తో పాటు రెండు ప్రధాన వంతెనలు, ప్రభుత్వ కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఐడివోసి భవనంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో డిప్యూటి సిఎం మాట్లాడుతూ పదేళ్లు ఫామ్‌ ‌హౌస్‌ ‌పాలనలో ప్రజల సొమ్ము దుబారా చేసి తెలంగాణను అప్పుల ఊబిలో నెట్టేసిన ఘనత బిఆర్‌ఎస్‌ది అన్నారు. ప్రజా పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంతో రాష్ట్ర ఎదుగుదలను చూసి వోర్వలేని తనంతో బిఆర్‌ఎస్‌ ‌నాయకులు అక్కసు వెల్లగక్కుతున్నారని విమర్శించారు. అడ్డగోలుగా మాట్లాడే నాయకులు అభివృద్ధితోనే సమాధానం చెబుతాము అన్నారు.
ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే లేనంత విద్యుత్‌ ‌డిమాండ్‌ ‌వచ్చినప్పటికీ చిన్న అంతరాయం లేకుండా రికార్డు స్థాయిలో విద్యుత్‌ ‌సరఫరా చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్‌ ‌పాలనలోనే రాష్ట్రానికి కరెంటు వచ్చిందని, కెసిఆర్‌ ‌తెలంగాణకు తెచ్చింది, ఇచ్చింది ఏమి లేదని ఎద్దేవ చేశారు. సాగు నీటికి కాలువలు లేకుండా ప్రాజెక్టులు కట్టి తెలంగాణ ఖజానా వృధా చేశారని ఆగ్రహించారు. ప్రాజెక్టుల నుండి సాగునీటి కాలువలకు భూ సేకరణ చేపడతామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం సిఎం రేవంత్‌ ‌రెడ్డి నాయకత్వంలో పక్కా ప్రణాళికతో ముందుకు పోతోందని స్పష్టం చేశారు. గోదావరి నదిపై నావిగేషన్‌కు అధ్యయనం చేయిస్తామన్నారు. రాష్ట్రంలో సాఫ్ట్వేర్‌, ‌ఫార్మా, విద్యుత్తు, హెల్త్, ‌హౌసింగ్‌ ‌వంటి పరిశ్రమలతో పాటు సంక్షేమ పథకాలతో రాష్ట్రం సమగ్ర అభివృద్ధి చెందుతుంది అన్నారు. గిరిజనులు ఆత్మగౌరవంతో బతికేలా, అడవి నీ కాపాడుకునేందుకు ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని తీసుకువస్తున్నామని తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఆదిలాబాద్‌ ‌నుంచి భద్రాచలం వరకు, కృష్ణ పరివాహక ప్రాంతంలోని గిరిజనులకు ప్రతి మూడు నెలలు, ఆరు నెలలకు ఆదాయం వచ్చేలా ఇందిరా గిరి జిల్లా వికాసం పథకాన్ని రూపొందించాము అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వమే బోర్లు వేసి సోలార్‌ ‌ద్వారా విద్యుత్‌ ‌సౌకర్యం కల్పించి, డ్రిప్పు, స్ప్రింక్లర్లను ఏర్పాటుచేసి ఉద్యాన శాఖ ద్వారా అవకాడో, వెదురువంటి పంటల సాగుకు సహకారం అందిస్తామని చెప్పారు. ఈ నెల 18 నుండి నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లా అచ్చంపేటలో ఈ పథకాన్ని ప్రారంభిస్తామని, గిరిజనులపై ఒక్క రూపాయి భారం పడకుండా రూ 12,500 కోట్లు ఖర్చు చేయబోతున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. 2023-24లో రాష్ట్రంలో 15వేల మెగావాట్ల విద్యుత్తు డిమాండ్‌ ఉం‌డగా గత పాలకులు అది కూడా సక్రమంగా చేయలేకపోయారని అన్నారు. రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగి ఈ ఏడాది మార్చిలో 17,162 మెగావాట్ల డిమాండ్‌ ఉన్నా చిన్న అంతరాయం లేకుండా విద్యుత్‌ ‌సరఫరా చేశామన్నారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే ఈ విద్యుత్‌ ‌డిమాండ్‌ ఏర్పడలేదు అన్నారు. థర్మల్‌ ‌పవర్‌తో పాటు హాస్టల్లో అందుబాటులో ఉన్న సోలార్‌, ‌హైడల్‌, ‌విండ్‌ ‌పవర్‌ ‌వినియోగంలోకి తెస్తున్నామని తెలిపారు. 20,000 మెగావాట్ల గ్రీన్‌ ‌పవర్‌ ఉత్పత్తి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికల రూపొందించుకొని ముందుకు పోతుందన్నారు.సీతారామ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత ప్రాజెక్టుగా ముందుకు తీసుకుపోతున్నామని స్పష్టం చేశారు. ప్రాజెక్టు కాలువలకు కావలసిన భూసేకరణ చేపట్టాలని అందుకు అవసరమైన నిధులను విడుదల చేస్తామన్నారు. ప్రాజెక్టులు నిర్మించి సాగునీటి కాలువలు నిర్మించకపోవడంతో ఉపయోగం ఉండదని, బ్యారేజీలు, రిజర్వాయర్లు కట్టి వదిలేస్తే సముద్రంలో నీళ్లు ఉన్నట్టే కానీ ఉపయోగం ఉండదు అన్నారు.
గత పాలకులు పదేళ్ళలో ఏ ప్రాజెక్టు నుంచి ఒక్క ఎకరాకు సాగునీరు ఇవ్వలేదని, లక్ష కోట్లు ఖర్చు చేసిన కాలేశ్వరం నుంచి ఒక్క ఎకరాకు సాగునీరు అందించ లేదని విమర్శించారు.డిండి, ఎస్‌ఎల్‌బిసి ప్రాజెక్టులను గుర్తించి ప్రాధాన్యత అక్రమంలో పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది అన్నారు. కేంద్ర నుంచి రాష్ట్రానికి రావలసిన నిధులు, అభివృద్ధి పనుల గురించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఢిల్లీలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రానికి చెందిన ఎంపీలంతా కలిసి కేంద్ర మంత్రులతో సంప్రదింపులు జరుపుతారని, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రులు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులు అధికారులను కలుస్తారని వెల్లడించారు. రాష్ట్ర ఎంపీలకు కావలసిన పూర్తి సమాచారం అందించామని, అందరూ చక్కగా పనిచేస్తున్నారని కితాబు ఇచ్చారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం సీఎం రేవంత్‌ ‌రెడ్డి నాయకత్వంలోని యావత్‌ ‌క్యాబినెట్‌ ‌సమగ్ర ప్రణాళికలతో ముందుకు పోతుంది అన్నారు. రాష్ట్రంలోని అనేక జిల్లాలను కలుపుతూ రీజినల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు నిర్మిస్తున్నామని, రీజినల్‌ ‌రింగ్‌ ‌రోడ్డుకు ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డుకు మధ్య ఫార్మా, అగ్రికల్చర్‌, ‌హౌసింగ్‌ ‌వంటి అనేక క్లస్టర్లను నిర్మించబోతున్నట్టు తెలిపారు. రాష్ట్రానికి సి పోర్టు లేదని, రోడ్డు మార్గం ద్వారానే రవాణా జరుగుతుందన్నారు. రాష్ట్రంలో గోదావరి నదిపై రవాణాకు ఉన్న అవకాశాలనుపై అధ్యయనం చేస్తామని, అవకాశం ఉంటే సిఎంతో పాటు క్యాబినెట్‌ ‌దృష్టికి తీసుకువెళ్లి చర్యలు చేపడతామన్నారు. ముందుగా నావిగేషన్‌ ‌పై సమగ్ర అధ్యయనం జరిగేలా చూస్తానని తెలిపారు. అన్ని వర్గాల పిల్లలకు ఉచితంగా ప్రపంచ స్థాయి విద్య అందించేందుకు యంగ్‌ ఇం‌డియా ఇంటిగ్రేటెడ్‌ ‌రెసిడెన్షియల్‌ ‌స్కూల్స్ ‌నిర్మిస్తున్నామని, మొదటి దశలోనే 104 నియోజకవర్గాల్లో ఈ పాఠశాలల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసి టెండర్ల పక్రియ ప్రారంభించాము అన్నారు. ఒక్కో పాఠశాలకు రూ 200 కోట్లు ఖర్చు చేస్తున్నామని సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక పద్ధతుల్లో ఈ పాఠశాలల నిర్మాణం అన్నారు. ఈకార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, వైరా శాసనసభ్యులు రాందాస్‌ ‌నాయక్‌, ఎన్‌పిడిసిఎల్‌ ‌సిఎండి కర్నాటి వరుణ్‌ ‌రెడ్డి, సింగరేణి సిఎండి బలరాం, జిల్లా కలెక్టర్‌ ‌జితేష్‌ ‌వి పాటిల్‌, ‌జిల్లా ఎస్పీ రోహిత్‌ ‌రాజ్‌, ఐటీడీఏ పీవో రాహుల్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page