పాశమైలారం ఘటనపై ప్రభుత్వ నిర్లక్ష్యం
మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 30: పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన ప్రమాద ఘటన స్థలిని ఎమ్మెల్యే చింతాప్రభాకర్, ఇతర నాయకులతో కలిసి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు పరిశీలించారు. కలెక్టర్, ఎస్పీ, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలతో మాట్లాడి సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఘటన జరిగి ఐదు గంటలు గడుస్తున్నా సహాయక చర్యలు అందించడంలో, కుటుంబ సభ్యులకు వివరాలు తెలపడంలో ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శించారు. ఇంత పెద్ద పేలుడు జరిగి 12మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం ప్రమాదం జరిగే సమయంలో కంపెనీలో 140మంది పనిచేస్తున్నట్లు తెలుస్తుండగా నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలి 12మంది మృతిచెందగా, దాదాపు 26మందిని పలు ఆసుపత్రులకు తరలించారన్నారు. ఎంతమంది బయటకు రాగలిగారు అనేది అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. కుటుంబ సభ్యులు పరిశ్రమ వద్దకు వచ్చి తమ వారి గురించి ఆందోళన చెందుతున్నారని, తమవారి జాడ చెప్పాలని అధికారులను వేడుకుంటున్నారని, ఆ కుటుంబీలకు మృతుల, క్షతగాత్రల వివరాలు తెలిపే ప్రయత్నం చేయాలని కలెక్టర్, ఎస్పీకి సూచించామన్నారు. ఇతర రాష్ట్రాల వారు ఇక్క్డడ పనిచేస్తున్నారని, వారి కుటుంబీకులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. ప్రమాదం జరిగి 5 గంటలు గడుస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని హరీష్‌రావు విమర్శించారు. కంట్రోల్ రూం పెట్టండి.. కామన్ ఫోన్ నెంబర్ పెట్టండి అని అధికారులకు సూచించానన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ అద్బుతంగా పని చేస్తున్నండగా ప్రభుత్వం, అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రత్యేక అధికారులను పెట్టుకోండి.. అటెండెన్స్ లిస్ట్ పెట్టుకోండి.. డ్యూటీలో ఎంత మంది ఉన్నరు అంటే కలెక్టర్ ఒక లెక్క, ఎస్పీ ఒక లెక్క చెబుతున్నారు. అసలు కార్మిక శాఖ, ప్రభుత్వం ఏం చేస్తున్నది.. బాధిత కుటుంబ సభ్యులు ఎవరిని కలవాలో చెప్పాలన్నారు. హ్యాండ్ మైక్ పెట్టుకుని గైడ్ చేసే బాధ్యత లేదా అని నిలదీశారు. గాయపడ్డ వారిని ప్రాథమిక ఆసుపత్రుల్లో చేరుస్తున్నారు.. 30శాతం కాలితే డేంజర్.. కార్పొరేట్ ఆసుపత్రులకు వారిని ఎందుకు పంపడం లేదని హరీష్‌రావు ప్రశ్నించారు. ఏఐజీ, కేర్, అపోలో ఆసుపత్రులకు పంపితే మొదటి గంటలో వైద్యం అందితే ప్రాణాలు కాపాడవచ్చన్నారు. గతంలో జరిగిన ఘటనల్లో ఐదుగురు చనిపోయారు.. వరుస ప్రమాదాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారు.. ఏడాదిలో మూడో ఘటన జరగటం దురదృష్టకరం.. ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది.. భద్రతా చర్యలు తీసుకోవడంలో విఫలం.. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలి.. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలి.. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు మంచి వైద్యం అందించి రూ.50లక్షల పరిహారం ఇవ్వాలని బీఆర్‌ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామని హరీష్‌రావు అన్నారు.