‘మామునూర్’లో భూసేకరణే ఆలస్యం
మామునూరు మినహా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఇతర గ్రీన్‌ఫీల్డ్ ఏయిర్‌పోర్టులకు కేంద్రం అనుమతి నిరాకరించింది. దీంతో తమ ప్రాంతంలో విమానాలు ఎగిరేది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారికి తీరని నిరాశ ఎదురైంది. దాదాపు పది సంవత్సరాలుగా భూ అన్వేషణ, సర్వేలు, సాంకేతిక విషయాలపేర గడుపుతూ వొస్తున్న కేంద్రం, ప్రతిపాదనలో ఉన్న మూడు విమానాశ్రయాల ఏర్పాటు సాధ్యంకాదని సోమవారం పార్లమెంట్ సాక్షిగా తేల్చేసింది. తెలంగాణలో ఒక్క శంషాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా విమానాశ్రయాలు లేక పోవడంతో గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆరు చోట్ల విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.
అయితే తెలంగాణ ఏర్పడిన ఈ పన్నెండు ఏళ్ళ కాలంలో ఏ ఒక్క కొత్త ఏయిర్‌పోర్టుకు అనుమతి లభించలేదు. పైగా ప్రతిపాదనలోని మూడింటినే కేంద్రం గుర్తించింది. కొత్తగూడెం, మహబూబ్‌నగర్, జక్రాన్‌పల్లి ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటు సాద్యాసాధ్యాలపైన కేంద్రం దృష్టిపెట్టింది. పలుసార్లు, పలువురు అధికారులు ఇక్కడ విమానాశ్రయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం సూచించిన భూములను పరిశీలించారు.
అయితే రాష్ట్ర ప్రభుత్వం చూపించిన ఈ భూములేవీ విమానాశ్రయాల నిర్మాణానికి పనికిరావని తేల్చేసిన విషయాన్ని బిఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపి వద్దిరాజు రవిచంద్ర అడిగిన ప్రశ్నకు సివిల్ ఏవియేషన్ స్టేట్ మినిస్టర్ మురళీధర్ మొహాల్ తెలపడంతో ఎయిర్‌పోర్టు రావడంతో తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది.





