ఆనందోత్సాహాల మ‌ధ్య‌ ‘నిట్‌’ వ్యవస్థాపక దినోత్సవం

– పండిట్‌ నెహ్రూ శంకుస్థాపన చేసిన తొలి ఆర్‌.ఇ.సి.
– నైపుణ్యాలపై దృష్టి.. 81.3 శాతం ప్లేస్‌మెంట్లు

కాజిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 10: వరంగల్‌ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ (నిట్‌) 67వ స్థాపన దినోత్సవాన్ని శుక్రవారం ఉత్సాహంతో జరుపుకున్నట్లు ‘నిట్‌’ పిఆర్‌ఓ కార్తీక్‌ బాలసుబ్రహ్మణ్యం ఒక ప్రకటనలో తెలిపారు. భారత తొలి ప్రధానమంత్రి పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ దేశంలోనే తొలి ప్రాంతీయ ఇంజినీరింగ్‌ కాలేజీ (ఆర్‌ఈసి)కి 1959లో శంకుస్థాపన చేసిన చారిత్రక దినం ఇది అని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా భారత లోహ పరిశోధన సంస్థ గౌరవ సభ్యుడు, స్టీల్‌ రీసెర్చ్‌ అండ్‌ టెక్నాలజీ మిషన్‌ ఆఫ్‌ ఇండియా గవర్నింగ్‌ బోర్డు సభ్యుడు, రూర్కెలా స్టీల్‌ ప్లాంట్‌ మాజీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సనక్‌ మిశ్రా హాజరయ్యారు. డాక్టర్‌ మిశ్రా భారత జాతీయ ఇంజినీరింగ్‌ అకాడమీ, భారత లోహ సంస్థ మాజీ అధ్యక్షుడిగానూ సేవలందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్ఞానాన్ని లోతుగా అర్థం చేసుకోవడం ద్వారానే నిజమైన విజ్ఞానం, మేధస్సు సాధ్యమవుతుందని వక్కాణించారు. స్వాగతోపన్యాసంలో ‘నిట్‌’ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బిద్యాధర్‌ సుబుధి సంస్థ అసాధారణ ప్రయాణాన్ని వివరించారు. ప్రస్తుతం 11 బి.టెక్‌, 26 ఎం.టెక్‌, 5 ఎం.ఎస్‌.సి, ఎం.సి.ఎ, ఎం.బి.ఏ, బి.ఎస్‌.సి-బి.ఎడ్‌, సమగ్ర ఎం.ఎస్‌.సి. కోర్సులు బోధిస్తున్నట్టు వెల్లడిరచారు. తాజాగా పునర్నిర్వచించిన పాఠ్యక్రమం స్వయం అభ్యాసం, ఆవిష్కరణ, పరిశ్రమ అవసరాలకు తగిన నైపుణ్యాలపై దృష్టి సారిస్తోందని ఆయన పేర్కొన్నారు. 2024-25లో అధ్యాపకులు 884 జర్నల్స్‌, 350 కాన్ఫరెన్స్‌ పేపర్లు, 127 పుస్తక అధ్యాయాలు ప్రచురించి 95 జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారని, అలాగే 25 పేటెంట్లు సాధించారని తెలిపారు. సంస్థకు మొత్తం రూ.45.65 కోట్ల విలువైన పరిశోధనా నిధులు లభించాయని, వీటిలో జ్ఞాన్‌, స్పార్క్‌, ఎంఎస్‌ఎంఈ, మైటీ వంటి జాతీయ పథకాల కింద ప్రాజెక్టులు ఉన్నాయని సుబుధి చెప్పారు. ముఖ్య ఆవిష్కరణగా ఎలక్ట్రికల్‌ కన్డక్టివ్‌ అప్లికేషన్స్‌ కోసం సిల్వర్‌ నానోవైర్ల నిరంతర ఉత్పత్తి అనే సాంకేతికతను ఐఐటి రోపర్‌తో కలిసి పరిశ్రమకు బదిలీ చేశామని కూడా వివరించారు. తమ ఎన్‌ఐటి 81.3% ప్లేస్‌మెంట్‌ రేటు సాధించిందని, అత్యధిక వార్షిక ప్యాకేజీ రూ.64 లక్షలుగా నమోదైందని, ఆరు బి.టెక్‌ కార్యక్రమాలు జూన్‌ 2028 వరకు ఎన్‌బిఎ టియర్‌-1 గుర్తింపు పొందాయన్నారు. డైరెక్టర్‌ పూర్వ విద్యార్థుల సహకారాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆర్‌.సుధాకర్‌ రావు (1982 ఎలక్ట్రికల్‌) రూ.కోటి విరాళంగా ఇచ్చి డిజైన్‌ థింకింగ్‌ అండ్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ స్థాపించగా, డాక్టర్‌ వి.ఏ.శాస్త్రి (1964 బిఈ) ఇన్నోవేషన్‌ అండ్‌ ఇన్‌క్యుబేషన్‌ సెంటర్‌, నిట్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ఫౌండేషన్‌కు రూ.1.5 కోట్లు విరాళమిచ్చారన్నారు. 1995, 1997 బి.టెక్‌ బ్యాచ్‌లు కలిపి రూ.1.15 కోట్లు విరాళమిచ్చి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే విద్యార్థులకు మద్దతు అందించాయని, దిల్లీ అలుమ్ని చాప్టర్‌, వేణు నుగురి (1988, ఎలక్ట్రికల్‌) ఈ-రిక్షాలు, ఎలక్ట్రిక్‌ వాహనాలు, రూ.90 లక్షల విలువైన పరికరాలు స్మార్ట్‌ ఎలక్ట్రిక్‌ గ్రిడ్‌ ల్యాబ్‌కి విరాళంగా అందించారని, ఇవి పూర్వ విద్యార్థులకు సంస్థ పట్ల ఉన్న అనుబంధం, సృజనాత్మకత, సుస్థిరత, విద్యార్థి సంక్షేమంపై నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. డిస్టింగ్విష్డ్‌ అలుమ్ని అవార్డ్స్‌ 2025లో ప్రముఖ పూర్వ విద్యార్థులకు అకాడెమియా, రీసెర్చ్‌, ఇండస్ట్రీ, కార్పొరేట్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌, పబ్లిక్‌ లైఫ్‌ రంగాలలో చేసిన విశిష్ట కృషికి పురస్కారాలు ప్రదానం చేశారు. వీరిలో డాక్టర్‌ ఆర్‌.విజయ్‌, ప్రొఫెసర్‌ మాధవీలత గాలి, డాక్టర్‌ నవీన్‌ మంజూరన్‌, సునీత నదంపల్లి, కృష్ణప్రసాద్‌, విపిన్‌ జైన్‌, డాక్టర్‌ దీపక్‌ రెడ్డి పుల్లగురం ఉన్నారు. అదనంగా విద్యార్థుల అకాడెమిక్‌ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు పీ.వి.ఆర్‌. మోహన్‌ మెమోరియల్‌ మెరిటోరియస్‌ అవార్డు ప్రదానం చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, వరంగల్‌, హైదరాబాద్‌ అలుమ్ని చాప్టర్ల సభ్యులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page