- పాత, కొత్త చట్టాలపై సమగ్ర అవగాహన అవసరం
- దేశానికి అనుగుణంగా చట్టాల రూపకల్పన జరగాలి
- కనుమరుగు కానున్నభారత సాక్ష్యాధార చట్టం
పాలకులు వారి అవసరాలకు అనుగుణంగా మార్చుకుంటున్న చట్టాలను కూడా చర్చించాలి. చట్టం ఎవరికైనా ఒక్కటే అన్న భావన ప్రజల్లో రావాలి. రాజకీయ నాయకులు చట్టాల నుంచి తప్పించుకోకుండా కఠిన చర్యలు తీసు కోవాలి. బాధితులకు న్యాయం చేయడంతో పాటు.. సత్వర న్యాయం మన చట్టాల లక్ష్యం కావాలి. ఆ మేరకు చట్టాల అమలులో ప్రభుత్వాలు చిత్తశుద్దితో పనిచేయాలి. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పుడు పనులకు సంబంధించి విచారణలు వేగవంత కావాలి. బ్రిటిష్ కాలం నాటి చట్టాలను పూర్తిగా సంస్కరించి భారతదేశానికి అనుగుణంగా చట్టాల రూపకల్పన జరగాలి. ఐపిసి, సిఆర్‌పిసిల స్థానంలో కొత్తగా తీసుకుని వచ్చిన చట్టాలను స్వాగతించాల్సిందే. ఓ రకంగా చెప్పాలంటే భారత న్యాయ వ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది. మన దేశంలో బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారత శిక్షా స్మృతి(ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్‌పీసీ), భారత సాక్ష్యాధార చట్టం కనుమరుగు కానున్నాయి. వాటి స్థానంలో గతేడాది పార్లమెంటు ఆమోదించిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్), భారతీయ సాక్ష్య అధినియమ్(బీఎస్‌ఏ) అమల్లోకి వచ్చాయి. జీరో ఎఫ్‌ఐఆర్, పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే ఆన్‌లైన్‌లో ఫిర్యాదు నమోదు, ఎస్సెమ్మెస్ లాంటి ఎలక్టాన్రిక్ మాధ్యమాలతో సమన్ల జారీ లాంటి అత్యాధునిక పద్ధతులు కొత్త చట్టాలతో న్యాయవ్యవస్థలోకి వచ్చాయి.
వీటిని తేవడంలో కీలక పాత్ర పోషించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, భారతీయుల కోసం భారతీయులు ఈ చట్టాలను రూపొందించారు. దీంతో ఇక వలస పాలన నాటి నేర న్యాయచట్టాలు శాశ్వతంగా కనుమరుగుకానున్నాయి. కొత్త చట్టాల ఆత్మ, శరీరం, స్ఫూర్తి అంతా భారతీయమేనని తెలిపారు. ఈ కొత్త చట్టాల ప్రకారం.. క్రిమినల్ కేసుల్లో విచారణ పూర్తయిన 45 రోజుల్లోగా కచ్చితంగా తీర్పు వెలువడాలి. ఇందుకు అనుగుణంగా ఖచ్చితంగా పనిచేయాల్సి ఉంటుంది. తొలి విచారణ జరిగిన 60 రోజుల్లోపు అభియోగాలు నమోదు చేయాలి. వ్యవస్థీకృత నేరాలను, ఉగ్రచర్యల ను కొత్త చట్టాల్లో స్పష్టంగా నిర్వచించారు. రాజద్రోహం అనే పదాన్ని తొలగించారు. అయితే దేశ సార్వభౌమత్వం, సమగ్రతలకు భంగం కలిగించే చర్యలను శిక్షార్హం చేశారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల కోసం కొత్త అధ్యాయాన్ని చేర్చారు. కొత్త చట్టాల ప్రకారం.. చిన్నారులపై సామూహిక అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష లేదా యావజ్జీవశిక్ష పడనుంది. రద్దయిన ఐపీఎస్‌లో కొన్ని సెక్షన్లు సంక్లిష్టంగా ఉండేవి. ఏ నేరం ఏ సెక్షన్ కిందకు వస్తుందన్న విషయంలో కాస్త గందరగోళం ఉండేది. వాటిని ప్రస్తుతం సరళతరం చేశారు.
భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లో 511 సెక్షన్లు ఉంటే భారతీయ న్యాయ సంహితలో ఆ సంఖ్యను 358కి కుదించారు. ఐపీసీలోని 6 నుంచి 52 సెక్షన్ల మధ్య ఉన్న పలు నిర్వచనా లను ఒక సెక్షన్ కిందకు తెచ్చారు. 18 సెక్షన్లను ఇప్పటికే రద్దు చేశారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేయడం, చిన్నారులపై సామూహిక అత్యాచారం, మూకదాడి తదితర నేరాలకు ఐపీసీలో ప్రత్యేకంగా సెక్షన్లు లేవు. దీంతో గందరగోళం ఏర్పడేది. భారతీయ న్యాయ సంహితలో ఆ లోటును పూడ్చారు. ఇందుకు సంబంధించి చట్టాలను రూపొందించారు. క్రిమినల్ కేసుల్లో దర్యాప్తు మరింత పకడ్బందీగా జరగడానికి వీలుగా తీవ్రమైన నేరాల్లో సాక్ష్యాల సేకరణకు ఫోరెన్సిక్ నిపుణులు సంఘటన స్థలాన్ని సందర్శించడాన్ని తప్పనిసరి చేశారు. దాదాపు 150 ఏళ్లుగా అమలులో ఉన్నచట్టాలకు పాతరేయడం ఓ మంచి పరిణామంగా చేయాలి. ఇందుకు అనుగుణంగా పోలీసులు, న్యాయస్థానాలను కూడ సన్నద్దం చేయాలి. ఇప్పటికే అనేక దశలుగా పోలీస్‌లకు శిక్షణ శిబిరాలు నిర్వహించారు. కంప్యూటర్ వ్యవస్థలో అవసరమైన మార్పులు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత పారదర్శకంగా దర్యాప్తు, న్యాయవిచారణ చేసేందుకు కొత్త చట్టాలు ఊతమిస్తాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
ఫిర్యాదు అందిన 24 గంటల్లోగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి. 14 రోజుల్లోగా దర్యాప్తు చేపట్టి కేసును కొలిక్కి తేవాలన్న ప్రాథమిక లక్ష్యం ఇందులో కనిపిస్తోంది. మహిళలపై కొన్ని నేరాలకు సంబంధించి బాధితురాలి వాంగ్మూలా న్ని మహిళా మేజిస్టేట్ర్ ముందు నమోదు చేయాల్సి ఉంటుంది. వారు లేని పక్షంలో మహిళా సిబ్బంది సమక్షంలో పురుష మేజిస్టేట్ర్ ఎదుట హాజరుపర్చాలి. బాధితులతోపాటు నిందితులు కూడా ఎఫ్‌ఐఆర్ నకళ్లను ఉచితంగా పొందే వీలుంటుంది. వీటితోపాటు పోలీస్ రిపోర్టు, ఛార్జిషీటు, స్టేట్‌మెంట్లు, ఇతర డాక్యుమెంట్లను 14 రోజుల్లోగా పొందవొచ్చని కొత్త చట్టం పేర్కొంటోంది. ఇదే క్రమంలో కేసు విచారణలో అనవసర జాప్యాన్ని నివారించడానికి, సకాలంలో న్యాయం అందేలా చేయడానికి, న్యాయస్థానాలు కూడా గరిష్ఠంగా రెండు వాయిదాలు మాత్రమే మంజూరు చేస్తాయి. సాక్షుల భద్రతను వారి సహకారాన్ని దృష్టిలో ఉంచుకుని, సాక్షుల రక్షణ పథకాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పని సరిగా అమలు చేయాల్సి ఉంటుంది. అత్యాచార నేరాల కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో, వీడియో ద్వారా పోలీస్‌లు నమోదు చేయాల్సి ఉంటుంది.
మహిళలు, దివ్యాంగులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులతో పాటు 15 ఏళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్ల కంటే ఎక్కువ వయసు వారు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లడం నుంచి మినహాయింపు ఉంటుంది. వారు తాము నివాసం ఉన్న చోటే పోలీస్‌ల సాయం పొందవొచ్చు. స్వల్ప నేరాలకు సంబంధించి నేరస్థులకు సమాజ సేవచేసే అవకాశాన్ని కొత్త చట్టాలు కల్పిస్తున్నాయి. ఆర్థిక సంబంధ నేరాల్లో నిందితుల ఆస్తులు, నేరం ద్వారా సంక్రమించిన సొమ్ముతో వారు కొన్న స్థిర, చరాస్తులనూ జప్తు చేసే అధికారం పోలీస్‌లకు ఉంటుంది. సాక్షుల వాంగ్మూలాలు, ఆడియో, వీడియో సాక్షాలన్నింటినీ జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన డిజి లాకర్‌లో భద్ర పరుస్తారు. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టం (సీసీటీఎన్‌ఎస్) ద్వారా ఇప్పటికే దేశ వ్యాప్తంగా అన్నిపోలీస్ స్టేషన్లకు అనుసంధానం చేసినందున , సాక్షాలను ఆన్‌లైన్ ద్వారా పంపుతారు. డిజి లాకర్‌ను ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం (ఐసీజేఎస్) కు అనుసంధానం చేస్తారు.
పోలీస్‌లు, న్యాయవాదులు, న్యాయమూర్తులు అవసరమైనప్పుడు సాక్షాలను పరిశీలించుకోవొచ్చు. దీని వల్ల ఆధారాలు మాయం చేయడం సాధ్యం కాదు. పాత చట్టాల కింద నమోదైన కొన్ని కేసులు నెలల తరబడి దర్యాప్తు, కొన్నేళ్ల పాటు విచారణ జరిగే అవకాశం ఉంది. దీంతో దర్యాప్తు అధికారులు పాత, కొత్త చట్టాలపై సమగ్ర అవగాహనతో ఉండాలి. రెండు రకాల కేసులు కలిపి దర్యాప్తు, న్యాయ విచారణ జరిపేటప్పుడు, సంక్లిష్టత ఎదురయ్యే అవకాశం రాకుండా చూడాలి. చట్టాలను తెచ్చిన బిజెపి ప్రభుత్వం ఇవి సమగ్రంగా, పారదర్శకంగా అమలు చేసేలా కార్యాచరణ చేయాలి. క్షేత్రస్థాయిలో పోలీసులక శిక్షణ ఇవ్వాలి. అందుకు తగ్గట్లుగా కోర్టులను సిద్దం చేయాలి. ఆధునిక సాంకేతకి పరిజ్ఞానం అందచేయాలి. అన్నింటిని మించి పటిష్టం చట్టాలను పక్కాగా అమలు చేసి, ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పగలగాలి. ఇందుకు పార్లమెంట్ కూడా జవాబుదారీ కావాలి.
(సీనియర్ జర్నలిస్ట్ )