వేగానికున్న ప్రాధాన్యత భద్రతకు ఏదీ?

చిన్నపాటి నిర్లక్ష్యమే భారీ మూల్యానికి  కారణం

బైక్‌ నడపడంలో తాము నేర్పరులమని, హెల్మెట్‌ అవసరం లేదని, ఇది శిరోభారమని భావించేవారు మనలో చాలా మందే ఉన్నారు. హెల్మెట్‌ భారం కాదు అది ఒక రక్షణ కవచం. యువత బైక్‌ ఎక్కితే చాలు రయ్‌ రయ్‌ మని దూసుకుపోతుంటారు. మితివిూరిన వేగం, మద్యం మత్తులో నడపడం, ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించడం పరిపాటిగా మారింది.  నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రయాణం ప్రమాదకరమైనదిగా మారింది. ఇటీవల కాలంలో జరుగుతున్న ఘటనలు ..మన ముందున్న లెక్కలు ఈ విషయం చెబుతున్నాయి. ముఖ్యంగా టూవీలర్‌ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వాహన ప్రమాదాలలో చనిపోతున్న వారు కూడా ద్విచక్ర వాహనదారులే అధికం. దీనికి వారి నిర్లక్ష్యం కూడా కారణమవుతోంది.  ఇటీవల యువత సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, రాంగ్‌రూట్‌, ఓవర్‌టేక్‌ చేయడం, నిర్లక్ష్యంగా హెల్మెట్‌ లేకుండా డ్రైవింగ్‌ చేస్తూ ప్రాణాలు తీసుకుంటున్నారు. సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనాలు నడుపుతున్న సంఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి.  ‘శరీరానికి తలకాయ ప్రధానం, ఇంద్రియాలలో నైనం ప్రధానం, షడ్రుచులలో ఉప్పు ప్రధానం, నదులకు నీరు ప్రధానం’ అని సుభాషిత రత్నావళి చెబుతుంది. కానీ, శిరస్సుకు శిరస్త్రాణం ప్రధానం అని జీవితం చెబుతుంది.

ఉరుకుల పరుగుల జీవితంలో వేగానికున్న ప్రాధాన్యత భద్రతకు ఇవ్వకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. హెల్మెట్‌ లేకపోతే ఏమౌతుందిలే  అన్న చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది యువకులు ప్రాణాలను కోల్పోతున్నారు. దేశంలో ఏడాదికి సగటున 1.78లక్షల మంది రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్నారని, అందులో 60మంది 18నుంచి 34 ఏళ్లలోపు వారేనని సాక్షాత్తూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఇటీవల లోక్‌సభలో వెల్లడించారు.  దేశంలో ప్రతి గంటకూ దాదాపు 53 ప్రమాదాలు, 19 మరణాలు జరుగుతున్నాయి. దీనిలో 45 శాతం ద్విచక్ర వాహన ప్రమాదాలే.  దేశంలో ప్రస్తుతం యువ జనాభా ఎక్కువగా వుంది. అయితే, ప్రస్తుతం 15 ఏళ్ల లోపు వున్న బాలల శాతం 2036 నాటికి గణనీయంగా తగ్గనుందని  ‘భారతదేశంలో మహిళలు-పురుషులు 2023’ నివేదిక వెల్లడిస్తోంది. దీనికంటే ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే ద్విచక్ర వాహన ప్రమాదాలలో చనిపోతున్న వారిలో ఎక్కువమంది యువతే కావడం. తెలుగు రాష్ట్రాల్లో   హెల్మెట్‌ ధరించకుండా బైక్‌లు నడుపేవారి సంఖ్య అధికంగా ఉంది. హెల్మెట్‌ ధారణ తప్పనిసరి చేయాలని ఎ.పి హైకోర్టు గతంలోనే స్పష్టం చేసింది.

 

తాజాగా ‘హెల్మెట్‌ పెట్టుకోకపోవడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నా యని, గత జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్యకాలంలో హెల్మెట్‌ ధరించకపోవడం వల్ల ఏపీలో  667 మంది చనిపోయారని’ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హెల్మెట్‌ వినియోగించేలా చేయడంలో పోలీసులు కఠినంగా వ్యవహరించకపోవడం వల్లే అంతమంది చనిపోయారని, పోలీసుల అలసత్వం వల్లే ఈ పరిస్థితి నెలకొందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒక పరిమితి వరకే బండి వేగం మన చేతుల్లో వుంటుంది. ఆ పరిమితి దాటితే ఆ వేగాన్ని కంట్రోల్‌ చేయడం కష్టం. వేగాన్ని నియంత్రిం చుకోలేకపోతే అది ప్రమాదానికి దారితీస్తుంది. ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా హెల్మెట్‌ పెట్టుకోవాలని  మోటారు వాహనాల చట్టం 1998లోని 129, 177 సెక్షన్లు చెబుతున్నాయి. దీని ప్రకారం జరిమానా విధించడమే కాదు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేసే అవకాశం కూడా వుంటుంది.  మనం ప్రయాణించే రోడ్డు రేస్‌ ట్రాక్‌ కాదు. వాహనం ఎక్కగానే రేసింగ్‌ మూడ్‌లోకి వెళ్లిపోవడం వల్ల కోరి ప్రమాదాన్ని తెచ్చుకోవడమే అవుతుంది. టైర్లు, బ్రేకులు, బైక్‌ కండిషన్‌ పట్ల శ్రద్ధ పెట్టాలి. చాలావరకు రోడ్డు ప్రమాదాలు, టైర్లు, బ్రేకులు విఫలమవడం వల్లనే జరుగుతాయి. హెల్మెట్‌ ధరిస్తే? ప్రాణాలు కోల్పోకుండా కనీసం గాయాలతోనైనా బయటపడే అవకాశం వుంటుంది. హెల్మెట్లు ప్రమాదాలలో మరణాన్ని నివారించగలవు, నిరోధించగలవు. అయితే, అది మాత్రమే చాలదు. బైక్‌ నడిపేటప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం విూకే కాదు, తోటి ప్రయాణీకులకు కూడా ప్రమాదమే నన్న విషయం గుర్తించాలి.
రేగటి నాగరాజు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page