– వ్యవసాయం, గృహాలు, పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా
– కోల్ ఇండియా నుంచి అదనపు బొగ్గు కొనుగోలు చేయండి
– బొగ్గు కొనుగోలుకు నిధుల కొరత లేదు
– డిమాండ్ పెరిగినా ప్రజలకు ఇబ్బందులు కలగొద్దు
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 : ఎల్నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగి విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎల్నినోతో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో విద్యుత్ డిమాండ్ను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రజాభవన్లో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంగళవారం ఆకస్మిక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యుత్ అవసరాలు, సరఫరా సంసిద్ధత, బొగ్గు లభ్యత, అవసరమైన వనరుల సమీకరణ తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వాతావరణ పరిస్థితుల కారణంగా రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగి విద్యుత్ వినియోగం అధికమయ్యే పరిస్థితులు ఏర్పడవచ్చని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పెరిగే డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలను సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ముందస్తు ప్రణాళికతో వ్యవహరిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. వ్యవసాయానికి, గృహావసరాలకు, పరిశ్రమలకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. డిమాండ్ పెరిగినప్పటికీ సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పడకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విద్యుత్ సరఫరా సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని భట్టి హామీ ఇచ్చారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు నిల్వలను తగిన స్థాయిలో అందుబాటులో ఉంచుకోవాలని, అవసరమైతే కోల్ ఇండియా నుంచి అదనంగా బొగ్గును కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. బొగ్గు కొనుగోలుకు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ సహకారాన్ని సమర్థంగా వినియోగించుకుని, రాష్ట్రంలోని ఏ రంగానికీ విద్యుత్ కొరత కారణంగా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యమని పేర్కొంటూ మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ శాఖ ముందస్తు సన్నద్ధతతో వ్యవహరించాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. కాన్ఫరెన్స్లో ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్, ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్, ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి.పాటిల్, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





