– కూతురు ప్రేమపై విషం చిమ్మిన తల్లిదండ్రులు
– యువకుడిని పిలిపించి దారుణంగా హత్య
సంగారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్ 10:సంగారెడ్డి జిల్లా బీరంగూడలో దారుణం జరిగింది. కూతురును ప్రేమించిన ఇంజనీరింగ్ స్టూడెంట్ జ్యోతి శ్రావణ్ సాయి(20)ని మాట్లాడదామని ఇంటికి పిలిపించి అమ్మాయి తల్లిదండ్రులు హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన అమీన్‌పూర్ పరిధిలోని లక్ష్మీనగర్‌లో వెలుగులోకి వచ్చింది. జ్యోతి శ్రావణ్ సాయి, బీరంగూడ ఇసుకబావికి చెందిన శ్రీజ (19) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు తమ కూతురిని ప్రేమించొద్దని పలుమార్లు సాయిని హెచ్చరించారు. అయినప్పటికీ వారు తమ ప్రేమను కొనసాగించారు. సాయిపై పగ పెంచుకున్న శ్రీజ కుటుంబం ఇద్దరికీ పెళ్లి చేస్తామని, మాట్లాడుకుందామని అతనిని ఇంటికి పిలిపించారు. ఇంటికి పిలిచి ఒక్కసారిగా సాయిపై దాడి చేశారు. విచక్షణా రహితంగా అతనిని కొట్టడంతో శ్రావణ్ సాయికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఇంట్లోకి లాక్కెళ్లి మరీ దాడి చేశారు. దెబ్బలకు తాళలేక విలవిలలాడిపోయిన శ్రావణ్ ప్రాణాలు కోల్పోయాడు. జ్యోతి శ్రావణ్ సాయి మైసమ్మ గూడలోబి సెయింట్ పీటర్ కాలేజీలో బీటెక్ సీఎస్‌ఈ సెకండియర్ చదువుతూ కుత్బుల్లాపూర్‌లో రూం తీసుకుని ఉంటున్నాడు. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్ చెరు ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. అమీన్‌పూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వీరిద్దరూ పదో తరగతి వరకూ కలిసి చదువుకోవడంతో సాన్నిహిత్యం ఏర్పడి ప్రేమకు దారితీసినట్టు తెలుస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.