– ఖమ్మం-బొమ్మకల్ రహదారిపై భారీగా వరద
ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: మొంథా తుపాను ప్రభావంతో కురిసిన భారీవర్షాలకు ఖమ్మంలోని మున్నేరు వాగు మరోమారు ఉధృతంగా ప్రవహిస్తోంది. అంతకంతకూ నీటిమట్టం పెరగడంతో మరోమారు భయాందోళనలు మొదలయ్యాయి. వాగు పరివాహకంలోని కాలనీలను వరద చుట్టుముట్టింది. మోతీనగర్, బొక్కలగడ్డ కాలనీల్లోకి వరద చేరింది. మోతీనగర్‌లోని 35, బొక్కలగడ్డలో 57 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మున్నేరుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం నీటిమట్టం 24.7 అడుగులకు చేరింది. ఎగువన భారీ వర్షాలతో వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. మున్నేరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో వరద నీరు ఖమ్మం-బోనకల్ ప్రధాన రహదారిపై చేరింది. ఖమ్మం నగరం సపంలోని దంసలాపురం వద్ద ఆర్‌అండ్‌బీ రహదారిపై మూడు అడుగుల మేర వచ్చింది. దీంతో పోలీసులు ఆ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. వాహనాలు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. చింతకాని మండలం రామకృష్ణాపురం సమీపంలో లో లెవెల్ వంతెనపై వరద ప్రవహిస్తోంది. పాలేరు జలాశయానికి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ఖమ్మంలోని రాపర్తి నగర్ బీసీ కాలనీ వద్ద డంపింగ్ యార్డుకు వెళ్లే రహదారి కొట్టుకుపోయింది. టీఎన్జీవోస్ కాలనీని నలువైపులా వరద నీరు ముంచెత్తడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్నేరు పరివాహక ప్రాంతంలోని ఏదులాపురం పరిధిలో కేబీఆర్ నగర్, ప్రియదర్శిని కళాశాల ప్రాంతంలో ఉన్న ఇళ్ల చుట్టూ వరద నీరు చేరింది.———————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





