ఎం‌పీటీసీ, జేడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికలపై త్వరలో నిర్ణయం

– అందరితో చర్చించి ఓ నిర్ణయానికి వొస్తాం
– స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణంలో ఎన్నిక‌లు
– అధికార్ల‌కు అభినంద‌న‌లు
– మీడియా సమావేశంలో సిఎం రేవంత్‌ ‌వెల్లడి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 18: ‌రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో, ప్రజాస్వామ్య‌బద్ధంగా ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించినందుకు ఎన్నికల యంత్రాంగానికి, అధికారులకు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి  అభినందనలు తెలిపారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను సాధించడంపై శాసనసభ సమావేశాల్లో చర్చించి అన్ని పార్టీల అభిప్రాయం మేరకు ఎంపీటీసీ, జేడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికలపై నిర్ణయానికి వస్తామని చెప్పారు. రాష్ట్రంలో 12,728 పంచాయతీలకు గాను 12,702 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగ్గా, ప్రజాస్వామిక బద్ధంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం, ప్రజలు స్వేచ్ఛగా తీర్పును ఇవ్వడం అభినందనీయమని అన్నారు. ఈ ఎన్నికల  నిర్వహణలో అధికారులు స్వేచ్ఛగా పనిచేశారని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, దామోదర రాజనర్సింహరు, ధనసరి అనసూయ సీతక్కలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి డియా సమావేశంలో మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పరిపాలన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలతో ప్రజల ముందుకు వెళ్లగా, తమకు 7,527 గ్రామ పంచాయతీల్లో (66 శాతం) ప్రజలు అందించిన ఆశీర్వాదం.. ప్రభుత్వంపై మరింత బాధ్యత పెంచిందని చెప్పారు. ప్రజల ఆశీర్వాదంలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండిండినీ సమపాళ్లలో ముందుకు తీసుకెళుతున్నామని అన్నారు. రాష్ట్రంలో కొత్తగా రేషన్‌ ‌కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీ, రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నధాన్యానికి బోనస్‌ ‌చెల్లింపు, ఉచిత కరెంట్‌, ‌మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌, ‌రూ. 500 లకే సిలిండర్‌, 27 ‌వేల కోట్ల రూపాయల మేరకు సున్నా వడ్డీకే మహిళా సమాఖ్యలకు రుణాలు, 4.5 లక్షల మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే 61 వేల ఉద్యోగాల భర్తీ, సుదీర్ఘకాలం అపరిష్కృతంగా ఉన్న ఎస్సీ వర్గీకరణ సమస్యకు పరిష్కారం, వందేళ్లుగా జరగని బీసీ కులగణన చేపట్టడం, పేదలకు మంచి విద్యను అందించాలన్న ప్రయత్నాలు… ఇలా అనేక అంశాల్లో ప్రభుత్వం ఒక క్రమపద్ధతిలో అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు వెళుతోందని ముఖ్యమంత్రి వివరించారు. ఒకవైపు ఆదాయాన్ని పెంచుకుంటూ దుబారాను తగ్గిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం జరక్కుండా ప్రజలకు మేలు చేయాలన్నదే ప్రభుత్వ తాపత్రయమని ఒక ప్రశ్నకు సమాధానంగా ముఖ్యమంత్రి చెప్పారు. కృష్ణా, గోదావరి జలాలపై తెలంగాణ హక్కులకు సంబంధించి పూర్తి వివరాలతో శాసనసభలో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page