- బిఆర్‌ఎస్‌ను విలీనం చేసుకునే ఖర్మా మాకు పట్టలేదు
- పాక్‌తో యుద్ధంపై రేవంత్ వ్యాఖ్యలు దుర్మార్గం
- మీడియా సమావేశంలో బిజెపి ఎంపి రఘునందన్ రావు
హైదరాబాద్,ప్రజాతంత్ర,మే 30: కవిత తన పంచాయితీ విషయాన్ని తండ్రి, అన్న కెటిఆర్‌లతో తేల్చుకోవాలని, మధ్యలో బిజెపిని ఎందుకు లాగుతోందని ఆ పార్టీ ఎంపీ రఘునందన్‌రావు (MP RaghunandanRao) అన్నారు. బిఆర్‌ఎస్ వొస్తామన్నా కలుపుకోవడానికి సిద్దంగా బిజెపి లేదని స్పష్టం చేశారు. ఏముందని మిమ్ములను చేర్చుకుంటామని అన్నారు. బిజెపి తెలంగాణలో అధికారంలోకి వొస్తుందని, కార్యకర్తలు కూడా అందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు. అలాగే భాజపా ఎదుగుదలను ఆపాలని కుట్రలు పన్నుతున్నారని ఆ పార్టీ ఎంపీ రఘునందన్‌రావు ఆరోపించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా భారాస ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపైనా ఆయన స్పందించారు.
చిట్‌చాట్‌లు ఎందుకు?.. ధైర్యముంటే ప్రెస్‌ట్‌లు పెట్టండి. తప్పుడు వార్తలు రాయిస్తున్నారని చెప్పడం ఎందుకు? భారాసతో మా పార్టీ అధిష్ఠానం ఎప్పుడూ మాట్లాడలేదు. లేనిపోని పంచాయితీలు ఎందుకు?.. కుండబద్ధలు కొట్టినట్లు- చెప్పండి. చిట్‌చాట్‌ల పేరుతో మా పార్టీని వివాదంలోకి లాగొద్దని కవితకు విజ్ఞప్తి చేస్తున్నా. సొంత పంచాయితీలు మీరే తేల్చుకోండి.. మమ్మల్ని లాగొద్దు. తెరాస గతంలో అనేక పార్టీలతో పొత్తు పెట్టుకుంది. 2004లో కాంగ్రెస్‌తో తెరాస పొత్తు పెట్టుకుంది. 2009లో మహాకూటమి పేరుతో పలు పార్టీలతో పొత్తు పెట్టుకుంది. 2014లో పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామన్నది ఎవరు? భారాసతో భాజపా ఎప్పుడైనా పొత్తు పెట్టుకుందా? రాష్ట్రంలో భాజపా బలం పుంజుకుంటోంది.. కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతోంది. పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఒక్క సీటూ గెలవలేదు. ఆ పార్టీ చెల్లని రూపాయిగా మారిందని ప్రజలు భావిస్తున్నారు. భాజపా, భారాస ఒక్కటనే తప్పడు ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవిత చెల్లని రూపాయి అయ్యారు. పదేళ్ల పాలనలో అమరుడు శ్రీకాంత్‌చారి కుటుంబానికి ఏ దక్కలేదు. తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన 1200 మంది అమరులను పట్టించుకోలేదు. కేసీఆర్ కుటుంబం పదేళ్లు దోచుకుంది. హరీశ్‌రావు భాజపా కోవర్టు అయితే మంత్రివర్గం నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని అంటూ ప్రశ్నలు సంధించారు. భారాస బలహీనపడాలి అనుకునేవాళ్లే కవిత వెనక ఉన్నారు. ఆమె కొత్త పార్టీ పెడుతోందని నాకు సమాచారముంది. భారాసకు అభ్యర్థులు లేక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కోవర్టు పని చేసే వాళ్లు భాజపాలో ఉండరని రఘునందన్‌రావు వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌అంశంపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై రఘునందన్ రావు తీవ్రంగా స్పందించారు.
యుద్ధం చేసే ధైర్యం, దమ్ము ఉంటేనే మాట్లాడాలని హితవు పలికారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. యుద్ధం అనేది మాటలతో మాట్లాడేది కాదు.. అది చేసేటోనికి తెలుస్తుంది. రేవంత్ రెడ్డిది నెత్తి కాదు, కత్తి కాదు.. అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దేశం ఏం అనుకుంటుందో మోదీ కి తెలుసు. మోదీ నాయకత్వం ఎలా ఉంటుందో భారత ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌ను మోదీ నేతృత్వంలో భారత్‌కు కలిపే ధైర్యం బీజేపీకే ఉందని స్పష్టం చేశారు. ఇది రాజకీయ దురుద్దేశంతో మాట్లాడే విషయం కాదు.. మోడీ ప్రభుత్వం పీఓకేను భారత్‌లో కలపడం కచ్చితంగా చేస్తుంది. పాకిస్తాన్ త్వరలో రెండు ముక్కలు అవుతుంది. బలూచిస్తాన్ ఏర్పాటవుతుందని ఆయన అన్నారు. ఇక రాఫెల్‌పై అసత్య ఆరోపణలు చేయడం కాంగ్రెస్ నాయకుల అలవాటుగా మారింది. ఇప్పటివరకు ఒక్క రాఫెల్ కూడా కూలలేదు. అవాస్తవాలు చెబితే చట్టపరమైన చర్యలు తప్పవు. కేసులు పెట్టి బొక్కలేస్తాం అని రఘునందన్ హెచ్చరించారు. భారత్ సైన్యం వెనుక మేము ఉన్నామని, వారికి మద్దతుగా నిలబడతామని చెప్పేందుకే తిరంగ ర్యాలీలు నిర్వహించినట్లు- ఆయన అన్నారు. రేవంత్, రాహుల్ లకు నిజంగా ధైర్యం ఉంటే ఒక బెటాలియన్‌కు నాయకత్వం వహించి వెళ్లాలని చెప్పండి. అలా పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. అందుకు సైన్యంలో లేటరల్ ఎంట్రీ ఉంది. కానీ, నాయకులు దానికి అర్హతను చూపించాలి. రాజకీయ లబ్ధికోసం మాట్లాడడం మంచిది కాదని రఘునందన్ రావు అన్నారు.