జాతి నిర్మాణంలో నెహ్రూ పాత్రను చెరిపేయలేరు..

రాజ్యాంగం అంటే సంఘ్‌  ‌పుస్తకం బుక్‌ ‌కాదు
ఎందరో మహానుభావుల అనుభవసారం
దేశ ప్రజలను కాపాడే ‘సురక్షా కవచం’
లోక్‌సభలో రాజ్యంగంపై చర్చలో ఎంపీ ప్రియాంక

న్యూదిల్లీ, డిసెంబర్‌ 13: ‌భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకొని 75వ ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా లోక్‌సభలో ప్రత్యేక చర్చ జరిగింది. జమిలిపైనా ప్రభుత్వం ముందుడుగు వేయడంతో వాడీవేడీగా చర్చ సాగింది. ఇందులో విపక్షాల తరఫున కాంగ్రెస్‌ ‌నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా చర్చను ప్రారంభించారు. ఎంపీగా ఇటీవలే పార్లమెంట్‌లో అడుగుపెట్టిన ఆమె.. లోక్‌సభలో ప్రసంగం చేయడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికార బిజెపి, ఆరెస్సెస్‌పై విమర్శలు చేశారు. రాజ్యాంగం అంటే సంఘ్‌ ‌బుక్‌ ‌కాదని ఆర్‌ఎస్‌ఎస్‌ను ఉద్దేశించి దుయ్యబట్టారు. బిజెపి ఎల్లప్పుడూ గతం గురించే మాట్లాడుతుంది. కానీ, దేశ ప్రగతి కోసం ఇప్పుడేం చేస్తున్నారో వారు మాట్లాడాలన్నారు. దేశంలో జరిగే అన్నిటికీ నెహ్రూనే కారణమా? నెహ్రూ పేరును, ఆయన ప్రసంగాలను మీరు పుస్తకాల నుంచి తొలగించగలరేమో.. కానీ, స్వతంత్య్ర పోరాటంలో, జాతి నిర్మాణంలో ఆయన పాత్రను చెరిపేయలేరు‘ అని ప్రియాంక కౌంటర్‌ ఇచ్చారు.. ఈ సందర్భంగా 2017లో జరిగిన ఉన్నావ్‌ అత్యాచార ఘటనను ఆమె ప్రస్తావించారు. ఇలాంటి ఘటనల్లో బాధితులకు పోరాడే హక్కును రాజ్యాంగమే కల్పించిందన్నారు.

ఈ సందర్భంగా అదానీ వ్యవహారంపై కాంగ్రెస్‌ ఎం‌పీ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘ఒక్కరిని కాపాడటం కోసం 142 కోట్ల మంది భారతీయుల ప్రయోజనాలను విస్మరిస్తున్నారు. సంపద, రోడ్లు, పోర్టులు, గనులు అన్నీ ఆయనకే ఇస్తున్నారు‘ అని మండిపడ్డారు. ప్రజల తరఫున పోరాడే ప్రతిపక్షాల గళాన్ని అణచివేసేందుకు తప్పుడు కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేసి విపక్ష నేతలపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇతర దేశాలతో పోలిస్తే మన స్వాతంత్య్ర పోరాటం ప్రత్యేకమైనది. సత్యం, అహింస అనే పునాదులపైనే మనం పోరాడాం. మన స్వాతంత్య్ర ఉద్యమం ప్రజాస్వామ్య గళం. దాన్నుంచి ఉద్భవించినదే రాజ్యాంగం.

ఇది కేవలం డాక్యుమెంట్‌ ‌కాదు.. అంబేడ్కర్‌, ‌మౌలానా ఆజాద్‌, ‌రాజగోపాలచారి, నెహ్రూ వంటి ఎంతోమంది నేతలు ఎన్నో ఏళ్ల పాటు తమ జీవితాలను అంకితం చేసి దీన్ని రూపొందించారు. ప్రజా హక్కులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తే శక్తిని రాజ్యాంగం మనకు కల్పించింది. ఇది దేశ ప్రజలను కాపాడే ‘సురక్షా కవచం’లా ఉంది. అయితే దీన్ని బద్దలుకొట్టేందుకు అధికార ఎన్డీయే ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది. గత పదేళ్లలో ఈ రక్షణ కవచాన్ని బలహీనపర్చింది. లేట్రల్‌ ఎం‌ట్రీ, ప్రైవేటీకరణ వంటి చర్యలతో రిజర్వేషన్లను బలహీనపర్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ మెజార్టీ వచ్చి ఉంటే రాజ్యాంగాన్ని మార్చాలని ఎన్డీయే భావించింది. అది జరగకపోవడంతో ఆ ప్రతిపాదనలపై వెనక్కి తగ్గింది. ఇది సంవిధాన్‌.. ‌సంఘ్‌ ‌రూల్‌ ‌బుక్‌ ‌కాదు‘ అని కాంగ్రెస్‌ ఎం‌పీ దుయ్యబట్టారు. కులగణన జరగాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page