ప్రజల కోసం ఎన్ని కేసులనైనా ఎదుర్కొంటా..
రియల్ దందా చేసేవారిపై చర్యలు తీసుకోవాలి
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 22: పేద ప్రజలు వారి స్థలాల్లో ఇల్లు కట్టుకుంటే కొందరు గూండాలు దౌర్జన్యాలు చేస్తున్నారని, బాధితులకు అండగా నిలిచేందుకు తామే రంగంలోకి దిగామని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలోని 149 ఎకరాల్లో ఉన్న ఏకశిలా నగర్‌లో మంగళవారం జరిగిన సంఘటనపై తెలంగాణ వ్యాప్తంగా చర్చోపచర్చలు జరిగాయని అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే కాబట్టి.. వందల మంది బాధితులతో కలిసి గత సంఘటనపై వాస్తవాలు తెలియజేస్తున్నానని తెలిపారు. ఎంపీగా గెలిచిన తర్వాత నిత్యం హైదరాబాద్‌తో పాటు మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలో జరిగిన అనేక దుర్మార్గాలు, పేదల సమస్యలపై పోరాటం చేస్తున్నానని తెలిపారు. రేవంత్ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి అకారణంగా, దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు.
40-50 ఏళ్ల క్రితం ఆనాటి ప్రభుత్వాలు చెరువుల పక్కన, లే-అవుట్లలో పట్టాలు ఇస్తే ఇండ్లు కట్టుకున్నారు. ఆనాడు హైదరాబాద్‌కు వలస వొచ్చే పేదలకు టైగర్ నరేంద్ర నుంచి మొదలు బద్దం బాల్ రెడ్డి, దత్తాత్రేయ వంటి బీజేపీ నాయకులు పేదలకు అండగా ఉండి ప్రభుత్వ భూముల్లో గుడిసెలు నిర్మించారు. గతంలో బాలాజీ నగర్, జవహర్ నగర్ లో కట్టుకున్న ఇండ్లను కూల్చే ప్రయత్నం చేస్తే కాపాడుకునేలా బిజెపి పోరాటం చేసింది. పేదలకు స్థలాలు ఇచ్చి, ఇండ్లు కట్టించిన పార్టీ బిజెపి. ఇప్పుడు అవే ప్రాంతాల్లో మళ్లీ హైడ్రా పేరుతో ఇండ్లను నేలమట్టం చేస్తుంటే, అనేక ఒత్తిళ్లను ఎదుర్కొని బిజెపి పక్షాన బాధితులకు అండగా నిలిచాం అని ఈటల రాజేందర్ అన్నారు. . మూసీనది ప్రక్షాళన జరగాలంటే మూసీకి ఇరువైపులా 300 మీటర్లలో ఇండ్లన్నీ కూలగొట్టి భూములు గుంజుకొని మల్టీనేషనల్ కంపెనీలకు అప్పగించాల్సిన అవసరం లేదని, మూసీకి రెండు దిక్కులా ఇండ్లు కూల్చే సమయంలో బిజెపి ఎంపీగా పార్టీ తరఫున బాధితులకు అండగా నిలబడ్డామని చెప్పారు. బాధితుల నుంచి వందల కొద్దీ దరఖాస్తులు వొచ్చాయి. దీనిపై మల్కాజ్ గిరి కలెక్టర్ కు నిత్యం ఫోన్ లో సంప్రదించి పరిష్కరించాలని కోరాం. నగరంలో గుండాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రభావం ఉంటుంది. రియల్టర్ల పేరిట భూముల ఆక్రమణలతో దౌర్జన్యం చేశారు. దీనిపై రాచకొండ సీపీకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పరిష్కారం చూపలేదు. భూ ఆక్రమణల విషయంలో పోలీసు అధికారులకు ఫోన్ చేసి వివరించినా, పై అధికారుల ఒత్తిళ్లతో చర్యలు తీసుకోలేదు. పోలీసులు, రెవెన్యూ అధికారులు న్యాయం చేయకపోవడంతో.. బాధితులకు న్యాయం చేసేందుకు తామే అండగా నిలిచామని ఈటల పేర్కొన్నారు.
మల్కాజ్‌గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలానగర్ భూములు 1985లో ఆనాడు వివిధ సంస్థలలో పనిచేసే ఉద్యోగులు ఈ భూములు కొనుక్కున్నారు. మేడ్చల్ లోని ఘట్ కేసర్ మండలం కొర్రెముల గ్రామంలో సర్వే నంబర్ 739 నుంచి 749 వరకు 149 ఎకరాల భూమి ఉంది. 1985లో న ఏకశిల నగర్ కాలనీ పేరుతో గ్రామపంచాయతీ అనుమతితో 2086 ప్లాట్లను లే-అవుట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు 2076 మంది 200 గజాల చొప్పున ప్లాట్లను కొనుగోలు చేశారు. 2005 లో ఓనర్లే 47.25 ఎకరాల భూమిని ఎంఏ రాజు, ఎ.వెంకటేశ్, ఎ.విజయభాస్కర్ పేరుమీద సేల్ డీడ్ చేసారు. 1985లో ఈ ప్రాంతాల్లో జనవాసాలకు ఆస్కారం లేదు. 1985-2005 వరకు ఎటువంటి ఇబ్బందులు లేవు. 2005 లో 47 ఎకరాల పైచిలుకు భూమిని ఎంఏ రాజు, ఎ.వెంకటేశ్, ఎ.విజయభాస్కర్ పేరుమీద సేల్ డీడ్ చేసారు. 2006లో ఈ ముగ్గురు భూమిని కొన్నట్లుగా దొంగ డాక్యుమెంట్లు సృష్టించారు. పంచాయతీరాజ్ డీపీఓను మేనేజ్ చేసి అవి ప్లాట్లు కాదని అగ్రికల్చర్ ల్యాండ్ గా నమోదు చేయించారు.
ఈ ప్రొసీడింగ్స్ కి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేశారు. దీనిపై 2009 లో కోర్టు అనుమతిస్తే 2010 లో అది అగ్రికల్చర్ భూమి కాదంటూ తీర్పునిచ్చింది. హర్ష కన్స్ట్రక్షన్ వారే ఈ లే-అవుట్ లో 206 ప్లాట్లు కొనుగోలు చేశారు. మళ్లీ దొంగ డాక్యుమెంట్లు సృష్టించి రెవెన్యూ అధికారుల ప్రోద్బలంతో 47 ఎకరాలకు మ్యుటేషన్ సంపాదించారు. 739 నుంచి 749 సర్వే నంబర్లలో ఉన్న భూమి వ్యవసాయ భూమి కాదని రాజు, వెంకటేష్, విజయభాస్కర్ తప్పుడు పత్రాలు ఇచ్చారని తన ఆర్డర్‌లో స్పష్టం చేశారు. ఈ రికార్డులన్నీ ఇది వ్యవసాయ భూమి కాదని ప్లాట్లు అని తేల్చింది. అందుకు అనుగుణంగా అన్ని అనుమతులతో 700 మంది ఇళ్ళు కట్టుకున్నారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఈ తతంగం వెనుక ఉండి నడిపించారని పంచాయతీ సెక్రటరీ ఇచ్చిన రిపోర్ట్ చెబుతోంది. నిన్న మేము ఫీల్డ్ కి వెళ్లినప్పుడు కొంతమంది గూండాలు మాకు ఎదురుపడ్డారు. ఈ ప్రాంతంలో శ్రీనివాస్ అనే వ్యక్తి బ్యాంకులో లోన్ తీసుకుని రూ. 40 లక్షలతో ఇల్లు కట్టుకున్నాడు. అయితే, వాచ్ మెన్లు గా చెప్పుకుంటున్న 20-25 మంది గూండాలు కాళ్లా వేల్లా మీద పడ్డా దౌర్జన్యంగా ఆ ఇల్లును కూలగొట్టారు. ఆ తర్వాత కూడా రేకులషెడ్డును నిర్మించుకున్నా నేలమట్టం చేశారు. రజిత అనే మహిళ తన కుమారుడితో కలిసి ఇక్కడ జీవనం కొనసాగిస్తోంది.
ఆ ప్లాట్ ను చదును చేసుకుంటుండగా గూండాలు వచ్చి దౌర్జన్యం చేశారు. రియల్టర్లు, గూండాల గురించి మహిళ తమకు మొర పెట్టుకున్నారు. దాంతో ఫీల్డ్ కి బాధితులతో కలిసి వెళ్లాం. ఆ గూండాలు కనీసం వెనక్కితగ్గకుండా దౌర్జన్యంగా వ్యవహరించారు. అందుకే ఆ గూండాలపై నాలాంటి వారు చేయి ఎత్తాల్సి వొచ్చింది. భూముల ధరలు పెరగడంతో రియల్టర్లు ఆక్రమణలకు పాల్పడుతున్నారు. 2007లో ఎల్‌ఆర్‌ఎస్ (ల్యాండ్ రెగ్యులరైజ్ స్కీం) చట్టం వొచ్చింది. లేఅవుట్లను రెగ్యులరైజ్ చేసుకునే యాక్ట్ ను తీసుకొచ్చారు. శంకర్‌పల్లిలో వందల కోట్ల విలువైన 460 ఎకరాల భూమి ఉంది. ధరణి వొచ్చిన తర్వాత ఈ భూమిని అగ్రికల్చర్ భూమిగా మార్చివేసి ప్లాట్లన్నీ రద్దు చేసి, రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేశారు. ఇప్పుడు చేసిన తప్పులకు ఆ కలెక్టర్ జైలుపాలయ్యారు. భూఅక్రమాల వెనుక దుర్మార్గులు ఎవరు? పేదల ఆస్తులకు రక్షణ ఎక్కుడుందో చెప్పాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డికి ఉంది అని ఈటల రాజేందర్ అన్నారు. గండిపేట మం. వట్టినాగులపల్లి వెయ్యి ఎకరాలు, షాద్ నగర్ లోని ఈదుల పల్లి, ఈర్లపల్లి, నాదర్ గుల్, బాలానగర్, గగన్ పహాడ్ వంటి అనేక ప్రాంతాల్లో భూ అక్రమాలు జరిగాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పేదల భూములు గుంజుకునే ప్రయత్నం చేయడం దుర్మార్గం.
సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు తమ్ముళ్లు హైదరాబాద్ చుట్టుపక్కల భూములను పంచుకుంటున్నారనే మచ్చ, అపనింద వస్తున్నది. దీనిపై ఎంక్వైరీ చేస్తే ఈ ఘటనల వెనుక ఎవరున్నారో బయటకొస్తుంది. హైదరాబాద్ లో మొత్తం ఎన్ని లే-అవుట్ లు ఉన్నాయో ఈసీ సర్టిఫికెట్ ఉంటుంది. దాన్ని పరిశీలిస్తే భూములు వివరాలు స్పష్టంగా తెలుస్తాయి. కాళేశ్వరం మీద పెట్టిన డబ్బుల కంటే వందల రెట్లు సంపద భూ ఆక్రమణల ద్వారా నడుస్తోంది. బాజప్తా ముఖ్యమంత్రుల కార్యాలయాల్లో ఇట్లాంటి ఘటనలపై చర్చలు జరిగాయి. ఇప్పుడు అదే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా పాత గ్రామపంచాయతీ లే-అవుట్లకు సంబంధించి నోటీసులిచ్చి అగ్రికల్చర్ ల్యాండ్లను రద్దు చేసి మళ్లీ ప్లాట్లన్నింటినీ రీస్టోర్ చేయాలని ఈటల కోరారు. పెద్దల అండతోనే అధికారులు ఎల్‌ఆర్‌ఎస్ ను పెండింగ్ పెట్టారు.
భూ అక్రమాల దౌర్జన్యాలపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు, హెచ్‌ఆర్సీ, లోకాయుక్త వంటి సంస్థలకు ఫిర్యాదు చేస్తాం. మహిళల ఆత్మగౌరవాన్ని కించపర్చిన వాళ్లు, పేద ప్రజల రక్తం కళ్లజూసివారిపై ఖచ్చితంగా నాలాంటి వారు కన్నెర్ర జేస్తారు. నాలాంటివాళ్లపై కేసులు పెడతారా..? తెలంగాణ ఉద్యమంలో నాపై 150 కేసులు ఉన్నాయి. ఇది మరో కేసు అవుతుంది. నా తెలంగాణ ప్రజల కోసం ఎన్ని కేసులనైనా ఎదుర్కొంటా. రేవంత్ రెడ్డికి హైదరాబాద్ చుట్టుపక్కల భూములు, రియల్టర్ల, బ్రోకర్లపై ఎక్కువ అవగాహన ఉంది. అధికారం అండతోనే భూ ఆక్రమణలు జరుగుతున్నాయని ఈటల రాజేందర్ విమర్శించారు.