- తడిసిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
- నష్టపోయిన పంటల నివేదిక అందించండి
- పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
ములుగు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4 : నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందిస్తామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. శుక్రవారం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం అమృతండా, లక్ష్మిపూర్, కర్లపల్లి, చంద్రుతండా గ్రామాల్లో అకాల వడగండ్ల వర్షంతో వలన నష్టపోయిన పంటలను మంత్రి సీతక్క పరిశీలించారు. అకస్మాత్తుగా కురిసిన వడగండ్ల వర్షానికి కోతకు వొచ్చిన ధాన్యం రాలిపోయి నీటి పాలు అయిందని, వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి నివేదిక ఇవ్వాలని అధికారులను కోరారు. వెంటనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కి ఫోన్ చేసి జరిగిన పంట నష్టాన్ని వివరించి నష్టపరిహారం ఇవ్వాలని కోరగా తక్షణమే నాగేశ్వర్ రావు పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ రైతులందరికీ కాంగ్రెస్ అండగా ఉంటుందని, నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందిస్తామన్నారు. తడిసిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ , ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, టీపీసీసీ సభ్యులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లాడి రాంరెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, కార్మిక శాఖ జిల్లా అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఇస్సార్ ఖాన్ , జిల్లా వ్యవసాయ అధికారి సురేష్ కుమార్, ఏవోలు, కిసాన్ సెల్ అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.