సరస్వతి పుష్కరాల సందర్భంగా సరస్వతి ఘాట్ వద్ద ప్రతి రోజు సాయంత్రం నిర్వహిస్తున్న సరస్వతి నవరత్న మాలా హారతి కార్యక్రమం అద్భుతంగా కొనసాగుతోందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ.మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. గురువారం పుష్కరాల 8వ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరయ్యారు. వర్షంలో తడుస్తూనే మంత్రి, కలెక్టర్, ఎస్పి, భక్తులు హారతి కార్యక్రమాన్ని వీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి సరస్వతి మాతకు ఘనంగా హారతి ఇచ్చి పుష్కరాల పవిత్రతను, మహాత్మ్యతను వివరించేందుకు ప్రతి రోజు కాశి పండితులచే ఘనంగా సరస్వతి నవరత్న మాలా హారతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులు హారతి కార్యక్రమంలో పాల్గొని భక్తిశ్రద్ధలతో సరస్వతి దేవిని దర్శించుకుంటున్నారని అన్నారు. పుష్కరాల నిర్వహణపై మంత్రి శ్రీధర్ బాబు జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలను విజయవంతంగా నిర్వహిస్తున్న అధికారులను అభినందించారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ పుష్కరాల నిర్వహణకు కృషి చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రజలందరిలో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించే విశిష్ట కార్యక్రమం అని మంత్రి పేర్కొన్నారు. సరస్వతి పుష్కరాలు మే 26వ తేదీ వరకు కొనసాగనున్న నేపథ్యంలో భక్తులు పెద్దఎత్తున తరలివచ్చే అవకాశం ఉందని, అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే తదితరులు పాల్గొన్నారు.