వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 5: సనత్‌నగర్, అల్వాల్, కొత్తపేట టిమ్స్ హాస్పిటల్స్, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం సమీక్షించారు. ఈ ఏడాది చివరికల్లా హాస్పిటళ్లను ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించిన నేపథ్యంలో పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. హాస్పిటళ్ల సివిల్ వర్క్స్, ఎక్విప్‌మెంట్, డాక్టర్లు, సిబ్బంది నియామకం తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఒక టైమ్‌లైన్ పెట్టుకుని అందరూ సమన్వయంతో పనిచేయాలని, నిర్ణీత సమయంలో అన్ని పనులూ పూర్తి చేయాలని మంత్రి సూచించారు. హాస్పిటళ్లు ప్రారంభించిన రోజు నుండే వైద్య సేవలు అందుబాటులోకి రావాలని ఆదేశించారు. ఈ నాలుగు హాస్పిటళ్ల కోసం అధునాతన ఎక్విప్‌మెంట్ కొనుగోలు చేయాలని సూచించారు. ఎక్విప్‌మెంట్ కొనుగోలులో సంబంధిత డాక్టర్లు, సాంకేతిక నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి దామోదర ఆదేశించారు.