– కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
దేశంలో ఖనిజ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఈ సంస్కరణల కారణంగా దేశంలోని మినరల్ బ్లాకుల వేలం పారదర్శకంగా కొనసాగుతున్నదన్నారు. దీంతో జవాబుదారీతనం పెరిగిందన్నారు. శుక్రవారం ఆయన ఇండియా హాబిటాట్ సెంటర్‌లో క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్ సెమినార్‌లో ప్రసంగించారు. ఇప్పటికే 34 బ్లాకులకు సంబంధించిన వేలం ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది.మరిన్ని క్రిటికల్ మినరల్స్ కు సంబంధించి వేలం వేసేందుకు మరిన్నిచర్యలు తీసుకుంటున్నామన్నారు. గత మూడేళ్లలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ ఐ) 445 ఎక్స్‌ప్లొరేషన్ (క్రిటికల్ మినరల్స్ వెలికితీత) ప్రాజెక్టులను చేపట్టిందన్నారు. నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ ట్రస్ట్ ద్వారా 185 ప్రాజెక్టులకు నిధులు కేటాయించాం.అలాగే విదేశాల్లో ఉన్న మినరల్స్ వెలికితీసేందుకు ఆస్ట్రేలియా, అర్జెంటీనా, చిలీ వంటి దేశాలతో ఇప్పటికే ద్వైపాక్షిక ఒప్పందం చేసుకున్నామని గుర్తు చేశారు. అర్జెంటీనాలోని కాటమాక ప్రావిన్స్ లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాబిల్ ఇప్పటికే 15 వేల హెక్టార్ల మేర స్థలంలో ఖనిజాల వెలికితీత ప్రారంభించింది.ఈ ఏడాది జనవరిలో రూ.16,300 కోట్లతో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మిషన్ కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అదనంగా రూ.18 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయని తెలిపారు. దేశంలో క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించే దిశగా డిమాండ్ ఉన్న లిథియం, కోబాల్ట్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వంటి క్రిటికల్ మినరల్స్ ను వెలికితేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. 2040 నాటికి క్రిటికల్ మినరల్స్ డిమాండ్ 4 నుంచి 6 రెట్లు పెరగనుందని తెలిపారు. ప్రస్తుతం భారతదేశం ఈ క్రిటికల్ మినరల్స్ విషయంలో 100 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.
క్రిటికల్ మినరల్స్ రంగంలో ఆత్మ నిర్భర భారత్ సాధించే విషయంలో గనుల రంగం నిరంతరం కృషి చేస్తోందన్నారు.ఈ ఆర్థిక సంవత్సరంలో జపాన్ ను దాటి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2047 నాటికి వికసిత భారత్ గా ఎదిగేందుకు అవసరమైన ఎనర్జీ అవసరాలను తీర్చే దిశగా ఈ రంగం ముందుకు సాగుతోందన్నారు. దేశ విద్యుత్ భద్రత సాధించేందుకు నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కీలక పాత్ర పోషిస్తుంది. కోబాల్ట్ పౌడర్, లిథియం అయాన్ బ్యాటరీ స్క్రాప్, లెడ్, జింక్ సహా 12 క్రిటికల్ మినరల్స్ కు దిగుమతి సుంకాన్ని ఎత్తేస్తూ ఈ ఏడాది బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని బలోపేతం చేసేందుకు ప్రభుత్వంతో పాటు ప్రైవేటు, ప్రభుత్వ రంగం సంస్థలు, విద్యావేత్తలు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రారంభించిన నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ఔట్ రీచ్ ఫోరం ద్వారా ఈ రంగంలోని అన్ని రకాల పరిశ్రమలను ఏకతాటిపైకి తీసుకురావచ్చునన్నారు. దేశంలోని క్రిటికల్ మినరల్ రంగం, విద్యుత్ భద్రత, ఆహార భద్రతపై అవగాహన కల్పించే అవకాశం కలుగుతుందన్నారు. క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని పరిశ్రమల ప్రతినిధులను కోరారు. కాబిల్ మాదిరిగానే కోలిండియా లిమిటెడ్, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్, సింగరేణి సంస్థలు కూడా దేశంలో, విదేశాల్లో బ్లాకులను సొంతం చేసుకుని, ఖనిజాల వెలికితీత పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.