– ఏడుగురి మృతి
– నిద్రలో ఉన్న సమయాన ఘటన
కోల్‌కతా, ఆగస్టు 17 : పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లా తారాపీఠ్‌లో నాలుగు అంతస్తుల ఒక హోటల్‌లో సోమవారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. తెల్లవారుజామున సుమారు 4 గంటల ప్రాంతంలో హోటల్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక్కసారిగామంటలు చెలరేగాయి. ఏసీ యూనిట్లలో సాంకేతిక లోపం కారణంగా భారీగా మంటలు వచ్చి క్షణాల్లోనే భవనమంతా వ్యాపించాయి. ఆ సమయంలో అతిథులంతా నిద్రలో ఉన్నారు. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం క్షణాల్లోనే పొగ అలుముకుంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న సహాయక బృందాలు స్థానికులతో కలిసి రక్షణ చర్యలు చేపట్టాయి. ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేసి మృతులను, గాయపడిన వారిని రాంపూర్‌హాట్ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, బాధితులంతా ప్రసిద్ధ కాళీ ఆలయాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులుగా తెలుస్తోంది. ఘటనపై కోల్‌కతాకు చెందిన ఓ బాధిత మహిళా అతిథి స్పందించారు. హోటల్ మొత్తం పొగతో నిండిపోయిందని, దాని వల్ల చాలామంది తప్పించుకోలేకపోయారని తెలిపారు. అలాగే, పలువురు శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందిపడ్డారని వెల్లడించారు. బయటకు వచ్చేందుకు దారి కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హోటల్‌లో కనీస అగ్నిమాపక భద్రతా చర్యలు లేవని ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. ఫైర్ అలారం కూడా పనిచేయలేదన్నారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





