వందేళ్ల వేడుకల్లో ఎమ్మెల్యే హరీష్‌రావు
మెదక్, ప్రజాతంత్ర, డిసెంబర్ 23 : కల్లోల జగతికి శాంతి సందేశం అందించిన కరుణామయుడి గొప్ప ప్రార్థనా మందిరంగా మెదక్ చర్చి ఖ్యాతి గాంచిందని మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అన్నారు. సోమవారం మెదక్ చర్చి వందేళ్ల వేడుకల్లో హరీష్‌రావు పాల్గొని మాట్లాడారు. మెదక్ చర్చి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు. వందేళ్లుగా ఆసియాలోనే రెండో అతిపెద్ద క్రైస్తవ పుణ్యక్షేత్రంగా మెదక్ చర్చి వర్ధిల్లుతోందన్నారు.
ఈ చర్చి నిర్మాణాన్ని ఇంగ్లాండ్‌కు చెందిన రెవరెండ్ చార్ల్స్ వాకర్ ఫాస్నెట్ 1914లో ప్రారంభించగా.. 1924 డిసెంబర్ 25న పూర్తయ్యిందన్నారు. ఈ కార్యక్రమంలో వారి మనువడు పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పారు. మెదక్ ప్రాంతంలో 1914లో తీవ్ర కరువు ఉండేదనీ, ప్రజలు ఆకలితో అలమటించేవారన్నారు. చార్లెస్ వాకర్ ఫాస్నెట్ కరువుతో అల్లాడుతన్న ప్రజలను చూసి చలించాడన్నారు. ఉచితంగా కాకుండా ప్రజలకు పని చూపి, వారి ఆకలి తీర్చాలని సంకల్పించాడని తెలిపారు. అలా వారి చేత ఏసుక్రీస్తు మందిరం నిర్మిస్తూ, వారి ఆకలిని తీర్చాడని చెప్పారు. చారిత్రాకమైన ఈ చర్చి మన మెదక్ జిల్లాలో ఉండటం మనకే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఎంతో గర్వకారణమనీ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఆయన వెంట స్థానిక బిఆర్‌ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.