రాష్ట్రంలో పెట్టుబ‌డుల‌కు అనువైన వాతావ‌ర‌ణం

మలేషియా పెట్టుబ‌డుల‌కు ప్రోత్సాహం అందిస్తాం..
పామాయిల్ సాగులో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం అవ‌స‌రం
రాష్ట్రంలో మ‌రో రెండు డ్రైపోర్టులు
ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి శ్రీధర్ బాబు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 23 : ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణలో అత్యంత అనుకూలమైన వాతావరణం నెలకొల్పామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. సోమవారం ఆయన సెక్రటేరియట్ లో మలేషియా వాణిజ్య ప్రతినిధుల సమావేశంలో ప్రసంగించారు. గత నెలలో మలేషియా తెలుగు మహాసభలకు హాజరైన సందర్భంగా తనను కలిసిన అక్కడి పారిశ్రామికవేత్తలు, ఆయన పిలుపు మేరకు రాష్ట్ర పర్యటనకు వొచ్చారు. మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా) చొరవతో ఈ సమావేశం ఏర్పాటయింది.

వ్యవసాయ, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పిసిసి అధ్యక్షుడు మహేశ్ గౌడ్‌తో కలిసి మలేషియా ప్రతినిధి బృందంతో భేటీలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సోలార్ విద్యుత్‌ రంగం, డ్రైపోర్టుల నిర్మాణం, మురుగు నీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు, మహిళా పారిశ్రామికవేత్తలు, అంకుర సంస్థలకు విదేశాల్లో మార్కెటింగ్ సౌకర్యం కల్పించే విషయాలను ఆయన వారితో చర్చించారు. తెలంగాణ మలేషియా దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మెరుగు పర్చడం, పామాయిల్ సేద్యంలో సహకరించడం, పర్యాటక రంగంలో పెట్టుబడులు, సహకారం లాంటి అంశాలను మంత్రులు ప్రతినిధి బృందానికి వివరించారు. వివిధ రంగాలకు చెందిన దాదాపు 20 మంది మలేషియా ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.

ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కూడా ఇక్కడ అవకాశాలు సమృద్ధిగా ఉన్నాయని శ్రీధర్ బాబు ఈ సందర్భంగా వెల్లడించారు. హుసేన్ సాగర్ జలాశయంలో పూడికతీత, అందులోకి చేరుతున్న మురుగు నీటిని శుద్ధి చేయడంలో అత్యాధునిక సీవరేజ్ ప్లాంట్ల ఏర్పాటులో ప్రతినిధులు పాలు పంచుకోవాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ఇప్పటికే ఒక డ్రై పోర్టు పనులు జరుగుతుండగా మరో రెండు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సంకల్పించిందని ఆయన వెల్లడించారు. వాటి నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. కిన్నెరసాని, శ్రీశైలం బ్యాక్ వాటర్స్ ను పర్యాటక ఆకర్షణీయ కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు రిసార్టులు నిర్మించాలని శ్రీధర్ బాబు సూచించారు. రాష్ట్రంలో 64 లక్షల మంది మహిళలు స్వయం సహాయక బృందాల సభ్యులుగా ఉన్నారని వారు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు. మలేషియాలో తెలంగాణ ఉత్పత్తులను పరిచయం చేసేందుకు ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలన్న శ్రీధర్ బాబు ప్రతిపాదనకు ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు, ఇక్కడి ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించే విషయమై వి-హబ్ ఒప్పందం చేసుకోవడాన్ని శ్రీధర్ బాబు ప్రశంసించారు. సమావేశం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన మలేషియా తెలంగాణా అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్. తిరుపతి, ప్రధాన కార్యదర్శి సందీప్ గౌడ్, సలహాదారు అమర్నాథ్ గౌడ్ లను శ్రీధర్ బాబు అభినందించారు.

పామాయిల్ విత్తనాలు అందించాలి :  మంత్రి తుమ్మ‌ల‌
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ ప్రస్తుతం మలేషియా నుంచి పామాయిల్ మొలకలు దిగుమతి చేసుకుంటున్నామని, అలా కాకుండా విత్తనాలు సరఫరా చేయడం గానీ, ఇక్కడే నర్సరీ ఏర్పాటు చేయడానికి ముందుకొస్తే సహకరిస్తామని తెలిపారు. ఎక్కువ ఎత్తు పెరగని, తక్కువ పొడవున్న ఆకులు ఉండే రకాలను అభివృద్ధి చేయాలని కోరారు. పామాయిల్ నుంచి ఉప ఉత్పత్తులను తయారు చేయడంలో సహకరించాలని తుమ్మల కోరారు. వొచ్చే 4-5 సంవత్సరాల్లో పది లక్షల ఎకరాలకు పామాయిల్ సాగుని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. 20 లక్షల ఎకరాల సాగుకు పనికొచ్చే భూములు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గ్యానోడెర్మా వ్యాధిని తట్టుకునే రకాలను అభివృద్ధి చేయాలని సూచించారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, టీజీఐఐసీ ఎండీ డా. విష్ణువర్దన్ రెడ్డి, పరిశ్రమల శాఖ కమిషనర్ డా. మల్సూర్, టీజీఐఐసీ సిఇఓ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page