సోమాలియా చిన్నారికి ఒకే స‌మ‌యంలో రెండు క్లిష్ట ఆపరేషన్లు

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 24: కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ వైద్యులు సోమాలియా దేశానికి చెందిన తొమ్మిది నెలల చిన్నారికి ప్రాణాపాయ స్థాయికి చేరిన హైడ్రోసెఫాలస్ (మెదడులో రక్షణ ద్రవం అధికంగా పేరుకుపోయి మెదడుపై తీవ్ర ఒత్తిడి ఏర్పడటం)కు విజయవంతంగా చికిత్స అందించారు. ఈ సమస్యకు కారణం కొరాయిడ్ ప్లెక్సస్ (మెదడులో రక్షణ ద్రవాన్ని తయారు చేసే భాగం) నుంచి ఏర్పడిన అత్యంత అరుదైన గ్లియోన్యూరల్ ట్యూమర్ అని వైద్యులు గుర్తించారు. ఈ కణితి కారణంగా మెదడులో రక్షణ ద్రవం (సీఎస్‌ఎఫ్) అసాధారణంగా పెరిగి మెదడుపై ప్రమాదకరమైన ఒత్తిడి ఏర్పడటమే కాకుండా చిన్నారి తల పరిమాణం కూడా అసాధారణంగా పెరిగింది. వివిధ విభాగాల వైద్యుల సమన్వయంతో ఒకే శస్త్రచికిత్సలో రెండు క్లిష్టమైన మెదడు ఆపరేషన్లు నిర్వహించి, మెదడుపై ఉన్న ప్రమాదకర ఒత్తిడిని వెంటనే తగ్గించడంతో పాటు అత్యంత అరుదైన కణితిని పూర్తిగా తొలగించారు. శిశువుల్లో ఇలాంటి కణితులు చాలా అరుదుగా కనిపిస్తాయి. చికిత్స ఆలస్యమైతే మెదడు శాశ్వతంగా దెబ్బతినడం, పిల్లల ఎదుగుదల ఆలస్యం కావడం, ఫిట్స్ రావడం, చూపు దెబ్బతినడం వంటి తీవ్రమైన సమస్యలతో పాటు ప్రాణాపాయం కూడా ఏర్పడే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. మొదట వైద్యులు వెంట్రిక్యులో-పెరిటోనియల్ షంట్ అమర్చి మెదడులో పేరుకుపోయిన అదనపు ద్రవాన్ని పొత్తికడుపు వైపు మళ్లించి మెదడుపై ఒత్తిడిని తగ్గించారు. అనంతరం అదే శస్త్రచికిత్సలో క్రానియోటమీ నిర్వహించి కణితిని పూర్తిగా తొలగించారు.  తొమ్మిది నెలల చిన్నారికి ఒక పెద్ద మెదడు శస్త్రచికిత్స చేయడమే అత్యంత క్లిష్టమైన విషయం. అలాంటిది ఒకే శస్త్రచికిత్సలో రెండు క్లిష్టమైన న్యూరోసర్జరీలు విజయవంతంగా నిర్వహించడానికి న్యూరోసర్జరీ, అనస్థీషియా, రేడియాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ విభాగాల మధ్య అత్యంత సమన్వయం అవసరమైంది. శస్త్రచికిత్స అనంతరం చిన్నారి ఆరోగ్యం వేగంగా మెరుగుపడింది. సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ డాక్టర్ లక్ష్మీనాథ్ శివరాజు మాట్లాడుతూ, “ఈ చిన్నారిలో కొరాయిడ్ ప్లెక్సస్ నుంచి ఏర్పడిన అత్యంత అరుదైన గ్లియోన్యూరల్ ట్యూమర్ కారణంగా మెదడులో రక్షణ ద్రవం నిరంతరం అధికంగా పేరుకుపోయి ప్రాణాపాయ స్థాయిలో ఒత్తిడి ఏర్పడింది. దీంతో తల పరిమాణం కూడా క్రమంగా పెరుగుతోంది. ముందుగా వీపీ షంట్ ద్వారా ఒత్తిడిని తగ్గించి, అదే శస్త్రచికిత్సలో కణితిని పూర్తిగా తొలగించాం” అని తెలిపారు. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ ప్రమోద్ గుప్తా మాట్లాడుతూ, “సోమాలియా నుంచి చికిత్స కోసం వచ్చిన తొమ్మిది నెలల చిన్నారికి ఒకే శస్త్రచికిత్సలో విజయవంతంగా చికిత్స అందించడం కేర్ హాస్పిటల్స్‌లోని అత్యాధునిక న్యూరోసర్జరీ నైపుణ్యానికి నిదర్శనం. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వచ్చే రోగులకు కూడా అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందించే సామర్థ్యం మా బృందానికి ఉందని ఈ విజయం మరోసారి నిరూపించింది” అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *