ముగిసిన మావోయిస్టు చ‌ర్చ‌ల క‌మిటీ ప్ర‌స్థానం

  • ఒక్కొక్కరిగా నేలకొరిగిన అగ్ర‌నేత‌లు 
  • నాడు రామ‌కృష్ట‌, మొన్న సుధాక‌ర్, ర‌వి అలియాస్ గ‌ణేష్‌ 
  • మావోయిస్టు పార్టీకి కోలుకోని దెబ్బ‌
  • ర‌వి మ‌ర‌ణంతో ఉలిక్కిప‌డిన‌ ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా 
  • స్వ‌గ్రామం వెలిశాల‌లో విషాద ఛాయ‌లు

జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, ప్ర‌జాతంత్ర‌, జూన్ 18 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా, చిట్యాల మండలం, వెలిశాల గ్రామం ఉలిక్కిపడింది. నాడు విప్లవ ఉద్యమానికి ఊతమిచ్చిన వెలిశాల.. నేడు శోకసంద్రంలో మునిగిపోయింది. ఇదే గ్రామానికి చెందిన మావోయిస్ట్ పార్టీ అగ్రనేత గాజర్ల రవి అలియాస్ గణేష్, అలియాస్ ఉదయ్… ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా, మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. నాలుగు దశాబ్దాల క్రితం పీపుల్స్‌వార్ ఉద్యమంలోకి వెళ్లిన గాజర్ల రవి అంచెలంచెలుగా దళ సభ్యుడి స్థాయి నుంచి కేంద్ర కమిటీ స్థాయికి ఎదిగాడు. ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి హోదాలో శాంతి చర్చల్లో పాల్గొన్నాడు. శాంతి చర్చల ఎజెండా తయారు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. గాజర్ల రవిపై ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది.

ఇటీవల ఓఏబీలో మావోయిస్టలు, పోలీసులకు మధ్య ఎన్ కౌంటర్లు జరిగి అటు పోలీసులు, ఇటు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో బుధవారం (2025 జూన్ 18న) తెల్లవారుజామున భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భారీ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టు నేతలు మృతి చెందారు. వీరిలో గాజర్ల రవి (ఎలియాస్ ఉదయ్), వెంకట రవి లక్ష్మీ చైతన్య (ఎలియాస్ అరుణ), అంజు అనే మావోయిస్టు ఉన్నారు. ఈ ఘటన ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రత్యేక జోనల్ కమిటీకి తీవ్ర ఎదురుదెబ్బగా పోలీసులు భావిస్తున్నారు.

అడ్డతీగల ఎన్‌కౌంటర్ మావోయిస్టు పార్టీపై గణనీయమైన ప్రభావం చూపనుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో గాజర్ల రవి (ఎలియాస్ ఉదయ్), వెంకట రవి లక్ష్మీ చైతన్య (ఎలియాస్ అరుణ), అంజు వంటి కీలక నేతల మృతి ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (AOB) ప్రత్యేక జోనల్ కమిటీకి తీవ్ర ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. గాజర్ల రవి, AOB జోనల్ కమిటీ కార్యదర్శిగా, మావోయిస్టు కార్యకలాపాలను సమన్వయం చేసే కీలక వ్యక్తి. అతని మృతితో నాయకత్వంలో శూన్యత ఏర్పడి, సాయుధ చర్యల సమర్థత తగ్గే అవకాశం ఉందని చెప్పొచ్చు. అరుణ, మహిళా విభాగంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. ఆమె లేకపోవడం మహిళా క్యాడర్‌లను బలహీనపరచవచ్చు.

ఉద్యమ బాటలోనే కుటుంబం

పెత్తందార్ల వ్యవస్థకు వ్యతిరేకంగా తాడిత, పీడిత, బలహీన వర్గాల కోసం పోరుబాట ఎంచుకున్న వారిలో వెలిశాలలోని గాజర్ల కుటుంబం ఒకటి. కుటుంబంలోని అందరూ అప్పటి పీపుల్స్ వార్ ఉద్యమం వైపు అడుగులు వేశారు. గాజర్ల కుటుంబంలోని నలుగురు సోదరుల్లో ముగ్గురు అజ్ఞాతంలోకి వెళ్లారు. పెద్దవాడైన సమ్మయ్య సింగరేణిలో పనిచేసి పదవీ విరమణ చేసి హన్మకొండలో స్థిరపడ్డారు. ఆయనపై కూడా మావోయిస్ట్ సానుభూతిపరుడిగా ముద్ర వేయడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మిగతా ముగ్గురు అప్పటి పీపుల్స్ వార్ ఉద్యమంలో చేరి అజ్ఞాతంలోకి వెళ్లారు. వీరిలో గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్.. 35 ఏళ్లకు పైగా మావోయిస్ట్ పార్టీలో పనిచేసి ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. మరో సోదరుడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు కూడా అజ్ఞాతంలోనే ఉండి అనారోగ్య కారణాలతో జనజీవన స్రవంతిలో కలిశారు. పోరుబాట వీడి కొంతకాలం పాటు మీడియాలో చేరారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి పనిచేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పరకాల నియోజకవర్గం నుంచి టికెట్ కోసం ప్రయత్నించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అజ్ఞాతంలోనే ఉన్న మరొకరే గాజర్ల రవి అలియాస్ గణేశ్ అలియాస్ ఉదయ్. నాలుగు దశాబ్దాల్లో అంచెలంచెలుగా కేంద్ర కమిటీ స్థాయికి ఎదిగారు.

ప్రభుత్వంతో శాంతి చర్చల ప్రతినిధిగా…..

గాజర్ల రవి అలియాస్ గణేశ్ అలియాస్ ఉదయ్ స్వస్థలం భూపాలపల్లి జిల్లా వెలిశాల. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2004 అక్టోబర్‌లో జరిపిన శాంతి చర్చల్లో మావోయిస్టు పార్టీ తరపున ప్రతినిధిగా గాజర్ల రవి అలియాస్ గణేశ్ ఉన్నారు. ఉత్తర తెలంగాణ స్పెషల్‌ జోనల్‌ కమిటీ కార్యదర్శి హోదాలో శాంతి చర్చల్లో పాల్గొన్నారు. శాంతి చర్చల ఎజెండా‌ను తయారు చేయడం‌లో గాజర్ల రవి కీలక పాత్ర పోషించారు.

పార్టీ సభ్యునిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన గాజర్ల రవి.. అనేక సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉండేవారు. పీపుల్స్ వార్ పార్టీలో చేరిన ఆయన సుదీర్ఘ కాలం ఉత్తర తెలంగాణ ప్రాంతంలోనే పనిచేశారు. 1994లో మహదేవపూర్ ఏరియా కమిటీ కార్యదర్శిగా ఉన్నప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో లెంకలగడ్డ వద్ద మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో పంజాబ్ కమెండోల కమాండెంట్ జీఏ సాహితో పాటు మరో ఏడుగురు కమెండోలు మరణించారు. పంజాబ్ లో టెర్రరిస్టులను అంతమొందించడంలో పాత్ర పోషించిన సాహి లెంకలగడ్డ ఎన్ కౌంటర్ లో మరణించడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనకు కర్త, క్రియ, కర్త అంతా కూడా గణేష్ గా పోలీసులు ఆయనను టార్గెట్ చేసుకున్నప్పటికీ పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నారు. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో జరిగిన పలు ఎదురు కాల్పుల్లో గణేష్ బలగాల కళ్లుగప్పి తప్పించుకున్న సందర్బాలు ఎన్నో. ప్రముఖులను టార్గెట్ చేసి మందుపాతరలను పేల్చే విషయంలో పీపుల్స్ వార్ లో ప్రముఖంగా వినిపించిన పేర్లలో గణేష్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. మహదేవపూర్, మహాముత్తారం, ఏటూరునాగారం తదితర ప్రాంతాల్లో రిక్రూట్ కూడా గణేష్ కారణంగా పెద్ద ఎత్తున జరిగింది.

ఒక్కొక్కరిగా నేలకొరిగిన అగ్ర‌నేత‌లు

కాగా మావోయిస్టుచర్చల కమిటీలో ముగ్గురు కీలక వ్యక్తులు రామకృష్ణ‌, సుధాక‌ర్‌, గాజ‌ర్ల రవి ఇలా ఒక్కొక్క‌రు నేల‌కొరిగారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఆర్కేగా ప్రపంచానికి తెలిసిన అక్కిరాజు హరగోపాల్ 2021లో అనారోగ్య కార‌ణాల‌తో మ‌ర‌ణించిన‌ట్లు పార్టీ అప్ప‌ట్లో ప్రకటించింది.
అనారోగ్యంతో బాధపడుతున్న 63 ఏళ్ల రామకృష్ణ 2021 అక్టోబరు 14 ఉదయం 6 గంటలకు మరణించారని మావోయిస్టు పార్టీ ప్రకటన విడుదల చేసింది.

ఇక మ‌రో అగ్ర‌నేత సుధాకర్‌(అలియాస్ సింహాచలం) మృతి ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు.  కేంద్ర కమిటీ సభ్యుడుగా ఉన్న సుధాకర్ పై రూ.50 లక్షల రివార్డు ఉంది. సుధాకర్ స్వస్థలం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం. గత 40 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో సుధాకర్ ఉన్నారు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిపిన శాంతి చర్చల్లో ఆయన పాల్గొన్నారు. కీలక నేతల మృతితో మావోయిస్టు పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page