మణిపూర్ రక్తపాతం – పాలకుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం

“మణిపూర్ లాంటి సున్నితమైన సరిహద్దు రాష్ట్రంలోకి అత్యాధునిక ఆయుధాలు, దారణమైన తుపాకులు ఎలా వస్తున్నాయి? సరిహద్దుల గుండా జరుగుతున్న ఆయుధాల అక్రమ రవాణాన్ని కేంద్రం ఎందుకు అడ్డుకోలేకపోతోంది? ఒక పక్కన అమాయక ప్రజలు, మహిళలు, చిన్న పిల్లలు నిత్యావసర వస్తువులు దొరకక, ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు వలసపోతుంటే, కేంద్రం కేవలం కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందనేది పచ్చి నిజం. ఆ కమిటీలు కూడా ఇరు వర్గాల మధ్య నమ్మకాన్ని పూరించడంలో ఘోరంగా విఫలమయ్యాయి.”

వెంక గారి భూమయ్య
సీనియర్ జర్నలిస్ట్
మొబైల్ : 9848559863

మణిపూర్ రాష్ట్రంలో గత మూడేళ్లుగా సాగుతున్న అమానుష రక్తాపాతం, అదుపులేని జాతి వివక్ష ఈ దేశ ప్రజాస్వామ్యానికే ఒక పెద్ద మచ్చగా మారాయి. ఒకే రాష్ట్రంలో దశాబ్దాలుగా కలిసి నివసించే ప్రజలు నేడు తమ భౌగోళిక సరిహద్దులను బట్టి విడిపోయి, ఒకరినొకరు బద్ధ శత్రువులుగా చూసుకుంటూ ప్రాణాలు తీసుకుంటుంటే, దేశాన్ని ఏలుతున్న కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందనే ప్రశ్న ప్రతి ఒక్కరి గుండెల్లో రగులుతోంది. ఇది కేవలం రెండు వర్గాల మధ్య జరిగిన ఒక సాధారణ అంతర్గత ఘర్షణ కాదు; వ్యవస్థల పూర్తి వైఫల్యం, అధికార పీఠాల ఉదాసీనత వల్ల పుట్టుకొచ్చిన ఒక భయంకరమైన మానవ నిర్మిత విపత్తు. ఒక సున్నితమైన సరిహద్దు రాష్ట్రంలో ఇంతటి దారుణం జరుగుతున్నా కేంద్రం తీసుకుంటున్న చర్యలు శూన్యమనే విమర్శలు రావడం పాలకుల అసమర్థతను ఎత్తిచూపుతోంది.

మొదట్లో ఈ ఘర్షణలు కేవలం ఇంఫాల్ లోయ ప్రాంతంలో కేంద్రీకృతమైన మైతీ వర్గానికి, చుట్టుపక్కల ఉన్న కొండ ప్రాంతాలలోని కూకీ-జో తెగలకు మధ్య మాత్రమే పరిమితమై ఉండేవి. కానీ కాలక్రమేణా ఎత్తైన పర్వతాలలో నివసించే నాగా వర్గం కూడా ఈ హింసలోకి లాగబడటంతో సమస్య మరింత జటిలమైంది. చిన్న చిన్న గొడవలు కాస్తా చివరకు పరస్పర అపహరణలు, బందీల రాజకీయాలు, మరియు నడిరోడ్డుపై పాస్టర్లను, సామాన్య గ్రామస్తులను నరికి చంపేంత క్రూరత్వానికి దారితీశాయి. కూకీల ఆధీనంలో ఉన్న ఆరుగురు నాగా బందీలను అత్యంత అమానుషంగా చంపి అడవుల్లో పడేసిన ఉదంతం ఇక్కడి పగ ఏ స్థాయికి చేరిందో స్పష్టం చేస్తోంది. ఇవన్నీ కళ్లముందు జరుగుతున్నా దేశ రక్షణను, అంతర్గత భద్రతను పర్యవేక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వం కేవలం మూగప్రేక్షకుడిలా ఉండిపోవడం అత్యంత శోచనీయం.
ఇలాంటి భయానక పరిస్థితుల్లో కేంద్రం తన బాధ్యత నుండి ఎంతమాత్రం తప్పించుకోలేదు. కేవలం వేలాది మంది సైనిక బలగాలను, సీఆర్పీఎఫ్ దళాలను మోహరించినంత మాత్రాన సరిపోదని క్షేత్రస్థాయి పరిస్థితులు నిరూపిస్తున్నాయి. అక్కడ హింస ఆగకపోవడానికి కారణం కేంద్ర నిఘా వర్గాల పూర్తి వైఫల్యమే. మణిపూర్ లాంటి సున్నితమైన సరిహద్దు రాష్ట్రంలోకి అత్యాధునిక ఆయుధాలు, దారణమైన తుపాకులు ఎలా వస్తున్నాయి? సరిహద్దుల గుండా జరుగుతున్న ఆయుధాల అక్రమ రవాణాన్ని కేంద్రం ఎందుకు అడ్డుకోలేకపోతోంది? ఒక పక్కన అమాయక ప్రజలు, మహిళలు, చిన్న పిల్లలు నిత్యావసర వస్తువులు దొరకక, ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు వలసపోతుంటే, కేంద్రం కేవలం కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందనేది పచ్చి నిజం. ఆ కమిటీలు కూడా ఇరు వర్గాల మధ్య నమ్మకాన్ని పూరించడంలో ఘోరంగా విఫలమయ్యాయి.
ఈ సంక్షోభం వెనుక ఉన్న భౌగోళిక అసమానతలను, ప్రాంతీయ అభివృద్ధి లోపాలను సరిదిద్దడంలో కేంద్రం ఎప్పుడూ దూరదృష్టితో ఆలోచించలేదు. రాజకీయ నాయకులు తమ ఓటు బ్యాంక్ స్థిరపరుచుకోవడం కోసం ఈ జాతి వివక్షను, ప్రాంతీయ పగలను మరింత పెంచి పోషిస్తున్నారు. ఎన్నికల ప్రచారాల్లో కనబరిచే ఉత్సాహం, దేశంలోని ఒక రాష్ట్రం తగలబడిపోతుంటే పరిష్కారం చూపించడంలో ఎందుకు కనిపించడం లేదని సామాన్య ప్రజలు నేడు పాలకులను నిలదీస్తున్నారు. మైతీలు లోయకే పరిమితమై, నాగాలు కొండలపై ఉండిపోయి, కూకీలు వీరిద్దరి మధ్య నలిగిపోతూ భౌగోళిక బంధీలుగా మారిన ఈ దుస్థితికి పాలకుల అసమర్థతే కారణం.
జాతి వివక్ష అనేది ఒక నవసమాజాన్ని లోపలి నుండి తినేసే మహమ్మారి లాంటిది. మణిపూర్‌లో నేడు మనుషుల మధ్య గోడలు బద్దలైపోయాయి, మానవత్వం మరియు ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం పూర్తిగా చచ్చిపోయింది. ఒక వర్గం నివసించే ప్రాంతంలోకి మరో వర్గం అడుగుపెట్టడమే మరణశాసనంగా మారిన ఈ తరుణంలో పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సమంజసం కాదు. బలగాల మోహరింపుతో తాత్కాలికంగా అణచివేయడం కాదు, ఢిల్లీ వేదికగా అన్ని వర్గాల ప్రతినిధులను ఒకే తాటిపైకి తెచ్చి, కఠినమైన రాజకీయ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేశ సార్వభౌమాధికారానికి సవాలు విసురుతున్న ఇటువంటి శక్తులపై ఉక్కుపాదం మోపకపోతే వ్యవస్థలు కూలిపోతాయి.
సరిహద్దు రాష్ట్రంలో నెలకొన్న ఈ అస్థిరత కేవలం మణిపూర్‌కే పరిమితం కాదు, ఇది దేశ సమగ్రతకే ముప్పు తెచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఓటు బ్యాంక్ మరియు స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టాలి. బాధితులకు తగిన న్యాయం చేస్తూ, ఆయుధాలు పట్టిన ముఠాలపై ఉక్కుపాదం మోపాలి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా కాకుండా, అత్యున్నత అధికార యంత్రాంగం నేరుగా రంగంలోకి దిగి మణిపూర్ గడ్డపై శాంతిని పునరుద్ధరించకపోతే, చరిత్ర పాలకుల నిర్లక్ష్యాన్ని ఎన్నటికీ క్షమించదు. ఒక దేశ ప్రగతి దాని సరిహద్దుల భద్రతపై, ప్రజల ఐక్యతపై ఆధారపడి ఉంటుంది. మణిపూర్ రగులుతున్నంత కాలం భారతదేశ కీర్తి ప్రతిష్ఠలు అంతర్జాతీయంగా దెబ్బతింటూనే ఉంటాయి. కాబట్టి, కేంద్ర ప్రభుత్వం ఇకనైనా నిద్ర వీడి తక్షణమే శాశ్వత పరిష్కారాన్ని చూపించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *