అమ్మా..  మన్నించు!

– తల్లి చితిపై ప్రమాణం.. చరిత్ర ముందు పరాభవం?
– నమ్మిన ఆశయాలకు తిలోద‌కాలు
– అంతలోనే లొంగుబాటు
– పెద్ద‌లు నింపిన స్వాతంత్య్ర‌ పోరాట స్ఫూర్తి
– మావోయిజం నింపని సిద్ధాంత దీప్తి
– మావోయిజం గుండెలో గాయం
– మల్లోజుల లొంగుబాటుపై విమర్శల జడివాన
– తల్లి మరణ సమయంలో మల్లోజుల రాసిన భావోద్వేగ లేఖ

                                                             (కాలగిరి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ రిపోర్టర్)

జగిత్యాల, ప్రజాతంత్ర, అక్టోబర్ 15: తుది వరకు నమ్మిన ఆశయాల కోసం నిలబడతానని, తన తల్లికి చేసిన హామీని రక్తంతో రాసుకున్న మనిషి పేరు మల్లోజుల వేణుగోపాల్ రావు. భగత్‌సింగ్‌ వీరత్వాన్ని ఆదర్శంగా తీసుకుని మావోయిస్టు సిద్ధాంతానికి తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడే. కానీ… అదే మనిషి తన తల్లి మరణం సాక్షిగా చేసిన ప్రమాణాన్ని తుంచుకుని, తుపాకి దించి లొంగిపోవడం.. సిద్ధాంతాల కంటే సౌలభ్యానికి లొంగడమా?  అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు 2022 అక్టోబర్ 1న తన తల్లి మధురమ్మ మరణంపై గతంలో రాసిన భావోద్వేగపూరిత లేఖ నేడు దేశమంతా చర్చనీయాంశంగా మారింది. “తెల్లవాడు నిన్ను నాడు భగత్ సింగ్ అన్నాడు… నల్లవాడు నిన్ను నేడు నక్సలైట్ అంటున్నాడు” అంటూ అతడి వేదనను ఆవిష్కరించిన ఆ లేఖ విప్లవ చరిత్రలో ఒక మానవీయ పుటగా నిలిచింది.

మల్లోజుల రాసిన లేఖ యథాతథంగా

“అమ్మా… మల్లోజుల కుటుంబంతో పెద్దపల్లి పట్టణంతో వందేళ్ల నీ రుణం తీర్చుకున్నావా అమ్మా! నీ కడుపున పుట్టిన ఆరుగురి సంతానంలో నేనే చివరివాడిని తల్లీ, నిన్ను చివరి వరకు ఏడ్పించిన వాడినీ నేనే అమ్మా. అయితే నీవున్నంత వరకు మేం క్షేమంగా వుండాలనీ సదా కోరుకునే నీ చివరి కోరికను మాత్రం తీర్చి నీకు ప్రజలు తృప్తిని మిగిల్చారమ్మా. ఇప్పటివరకూ వాళ్లే నన్ను క్షేమంగా కాపాడుకుం టున్నారమ్మా. జనం మధ్య, జనం కోసం, జనంతో వున్న నేను నీ అంత్యక్రియలైనా చూడలేకపోయా నమ్మా, అయితేనేం, వేలాది జనం, విప్లవ సానుభూతిపరులు, విప్లవ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, మిత్రులు నిన్ను ఘనంగా సాగనంపారమ్మా. నీ పార్థివ శరీరంపై వాళ్లు ఎర్రగుడ్డ కప్పుతారనీ, విప్లవ నినాదాలతో నీకు వీడ్కోలు చెపుతారనీ నిజంగానే నేను ఊహించలేకపోయానమ్మా. ఎందుకంటే చాలా మంది సోదర విప్లవకారుల తల్లులకు ఇలాంటి గౌరవం దక్కడం లేదమ్మా. నాతో పాటే అడవిలో మన పక్కూరు జోగన్న వున్నాడు. వాళ్ల తల్లి చివరి రోజులలో దిక్కులేని జీవితం గడిపి వీధుల్లో అడుక్కుతింటూ తనువు చాలించిందని విన్నపుడు ఆయనతో పాటు మేమనుభవించిన వేదన అక్షరాలలోకి అనువదించలేనిదమ్మా. పైగా ‘అభాగ్యులైన’ దళితులకు ఈ నికృష్ట బ్రాహ్మణీయ కుల వ్యవస్థలో దక్కే స్థానం తెలుసు కదా! వాటన్నింటిని అంతం చేసి నిజమైన కుల విముక్త, దోపిడీ విముక్త, లింగ‌ వివక్షకు తావులేని సమాజ నిర్మాణానికి అంకితమైన విప్లవకారులకు జన్మనిచ్చిన వారంతా విప్లవ మాతృమూర్తులేనమ్మా, వారంతా గౌరవనీయులే. నీతో సహ వారందరికి శిరస్సు వంచి వినమ్రంగా విప్లవాంజలులు ఘటిస్తున్నానమ్మా. నీ అంత్యక్రియలలో పాల్గొన్న వారందరికి అశ్రు నయనాలతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వారు పాడిన పాటలు నా చెవులలో ఇంకా, ఇంకా నేనున్నంత వరకు ప్రతిధ్వనిస్తునే వుంటాయి. అమ్మా, వలపోతగా నా సహచర సోదరులు చేసిన గానం నా గుండెలలో భద్రంగా వుంటుందమ్మా. నేను వారి ఆశలను వమ్ము చేయకుండా, నీకూ, అమరుడైన నా సోదరునికి మన కుటుంబానికి ఏ కళంకం రాకుండా, జనానికి దూరం కాకుండా తుదివరకూ నమ్మిన ఆశయాల కోసం నిలబడుతాననీ మరోసారి హామీ ఇస్తున్నానమ్మా.. “పెద్దపల్లి పెద్దవ్వ” లేదనీ, “విప్లవ మాతృమూర్తి కన్ను మూసిందనీ”, “అమ్మా మళ్లీ పుడుతావా” అంటూ అనేక విధాలుగా నీ జీవితాన్ని గుర్తు చేసుకుంటూ తమ భావాలకు అక్షరరూపం ఇచ్చిన కలం యోధులందరికీ వినమ్రంగా ఎర్రెర్ల వందనాలు తెలుపుకుం టున్నాను. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల సంకెళ్ల‌ నుండి దేశ విముక్తి కోసం బాపు పోరాడాడు. అన్న, దోపిడీ విముక్తి కోసం పోరాడుతూ ప్రాణ త్యాగం చేశాడు. దేశం నుండి సామ్రాజ్యవాదులు వెళ్లిపోయినా దోపిడీ అంతం వరకు పోరాడాలనీ షహీద్ భగత్ సింగ్ అన్నాడు. మహాకవి శ్రీ శ్రీ తెల్లవాడు నిన్ను నాడు భగత్ సింగ్ అన్నాడు.. నల్లవాడు నిన్ను నేడు నక్సలైట్ అంటున్నాడు. ఎల్లవారు మిమ్ము రేపు వేగుచుక్కలంటారని చెప్పాడు. నువు అలాంటి వేగుచుక్కలను కన్నతల్లివి. నిన్ను వీరమాతగా ప్రజలు గుర్తిస్తున్నారమ్మా. బయటి పత్రికలు నీ త్యాగాన్ని ఎత్తిపడుతున్నట్టే, లోపల నాకు నా సహచర కామ్రేడ్స్ నుండి అందుతున్న సాంత్వన సందేశాలలో ఒకరు “అమ్మ చివరి వరకు కూడ విప్లవకారులకు స్ఫూర్తిదాయకంగా వుంది. తన ఇద్దరు కొడుకులను ఉద్యమానికి అంకితం చేసింది… పిల్లలను ఉద్యమానికి అంకితం చేసిన వీరమాతకు విప్లవ జోహార్లర్పిద్దాం” అంటూ రాస్తే, మరో కామ్రేడ్, “మధురమ్మ నిజంగానే మధురమైన గొప్ప మాతృమూర్తిగా నిలిచిపోయింది. రాంజీదాదా (కోటన్న) కూడ మాకు అమ్మ గురించి చెప్పేవాడు. అమ్మకు జోహార్లు చెపుదాం”, అంటూ రాసింది. పోతే, మరో  కామ్రేడ్ నాయ‌కుడు నిన్ను గుర్తు చేసుకుంటూ, ” నేను చివరిసారి 1980 వేసవిలో అమ్మా-బాపును కలిశాను. నేను ఎప్పుడు ఇంటికి వెళ్లినా నీవు లేకపోయినా మా అమ్మ లాగే ”తిని పో బిడ్డా’ అనేది. అడవిలో ముదిమి వయసులోని తల్లులు వచ్చి ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నపుడు నాకు అమ్మా-నాన్నలే గుర్తొస్తారు. వాళ్లలోనే మన అమ్మా-బాపులను చూసుకుందాం” అంటూ ఓదారుస్తూ రాశాడు. మరో కామ్రేడ్ “అమ్మ మరణవార్త అందరినీ కలచివేసేదే. భారత విప్లవోద్యమానికి సేవలందించే పుత్రులను ఇచ్చిన తల్లి. శత్రువు ఎన్ని నాటకాలు ఆడినా ప్రజల పక్షం నిలిచిన మాతృమూర్తి. అమ్మకు అందరం విప్లవ జోహార్లర్పిద్దాం”. ఇలా సహచర కామ్రేడ్స్ అంతా నీ సేవలను గుర్తు చేసుకుంటున్నారమ్మా. జన్మనిచ్చిన నా తల్లి రుణం ఎర్ర జెండా సాక్షిగా నేను ఆమెను సదా పీడిత ప్రజలు గుర్తుంచుకునే విధంగా వారి విముక్తికి అంకితమై తీర్చుకుంటానమ్మా. నీ మరణ వార్త మాకు మరు క్షణంలోనే తెలియదనీ, మన మధ్య ఎలాంటి ఆన్ లైన్ సంబంధాలు లేవనీ, వుండవనీ తెలిసినా, కడసారి చూపుకైనా నేను రాలేననీ వందశాతం వారికి తెలిసిందే.. అయినప్పటికీ, ఈ ఆఖరి నిముషంలోనైనా పెద్దపల్లి పెద్దవ్వకు ఖాకీ రాబందుల పొడ పడకుండా ప్రాణం పోతులేదు కదా అని జనం తిట్టిపోసుకుంటారనీ లోలోపల బాధగా చాలా మందికి వున్నప్పటికీ హృదయమున్న పీడిత ఖాకీ సోదరులు విధిలేక యధావిధిగా తమ బాస్ ల ఆదేశాల ప్రకారం నీ అంతిమ యాత్రకు కాపలా విధులు నిర్వహించడం రాజ్య స్వభావాన్ని వెల్లడి చేస్తుందమ్మా. అయితే, నీ మరణంతో వారు ఇక గతంలో మాదిరి తరచుగా మన కడప తొక్కే అవసరం లేకుండా చేశావమ్మా. నీవు లేకున్నా మిగిలిన నా సోదరుని కుటుంబాన్నైనా ఇకపై వాళ్లు వేధించకుండా వుంటారనుకోగలమా! బ్రాహ్మణవాదం పరమ దుర్మార్గమైనదమ్మా, పగ తీర్చుకునేవరకు సిగలు ముడివేయని పాఖండులమ్మా పాలకులు. నీకు మూడేళ్ల వయసులోనే బాపుతో పెళ్లి జరిపించారని చెప్పేదానివి. ఫలితంగా చిన్న వయసులోనే నీ కడుపున పుట్టిన బిడ్డలు నీకు దక్కడం లేదనీ వరుసగా ముగ్గురిని కోల్పోయిన తరువాత బాపు హేతువాదే అయినప్పటికీ నీవు మాత్రం రాతి దేవుళ్లను కడుక్క తాగి, మట్టి దేవుళ్లను పిసుక్కు తాగి మమ్మల్ని ముగ్గురిని బతికించుకున్నానని మాకు ఏ చిన్న ఇబ్బంది కలిగిన ఏడుస్తూ చెప్పేదానివి అమ్మా.. ముగ్గురు పోగా మిగిలిన మా ముగ్గురిలో చెట్టెత్తు నీ నడిపి కొడుకును (మల్లోజల కోటేశ్వర్లు) విప్లవకారుడని, ప్రమాదకరమనీ 57వ ఏట దోపిడీ రాజ్యం పొట్టనపెట్టుకోగా అతడు ఆపాదమస్తకం గాయాలతో విగతజీవిగా నీ ఇంటికి, నీ ముందుకు రాక తప్పలేదమ్మా. నీవు ఆ దృశ్యాన్ని చూసి తట్టుకోలేకపోయావు. కానీ, దోపిడీ రాజ్యం నిర్ధాక్షిణ్యమైనదమ్మా. అందుకే అన్నింటికీ తెగించి పేదల రాజ్యం కోసం పోరాడక తప్పదమ్మా. నీవు బతికున్నంతవరకు నీ కొడుకులు క్షేమంగా వుండాలనీ నిత్యం కోరుకుంటూ వుండేదానివి అమ్మా. కానీ, అన్నను రాజ్యం హత్య చేసింది. కానీ, ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా పీడిత ప్రజలు ఆయన విప్లవ సేవలను స్మరించుకుంటూ గత సంవత్సరం కూడ ఆయన దశ వర్ధంతి వేళ ‘ప్రహార్’ దాడిని ఓడిద్దామని ప్రతిన బూని ఆయన అమరత్వాన్ని చాటుతూ ‘ప్రపంచ సోషలిస్టు విప్లవం వర్ధిల్లాలని’ నినదిస్తూ ఆయన ఆశయాల సాధనకై ప్రతిన పూనారమ్మా. అమరులను స్మరించుకునే ప్రతి నిముషం వారిని కన్న వారు గూడ గుర్తొస్తారు. ఆ రకంగా మన రక్త బంధం చరిత్రలో విప్లవ బంధంగా నిలిచిపోయి అజ‌రామ‌రం అయిందని అనుకోవచ్చమ్మా. నా ప్రజలకు తుదివరకు సేవ చేసి నీ రుణం తీర్చుకుంటానమ్మా. నీ కడుపున పుట్టినందుకు సంతోషంగా వుంది. ప్రతి తల్లీ తన బిడ్డలు ఎలాంటి వారైనప్పటికీ సహజంగానే పేగు బంధంతో తుది వరకూ వారి బాగునే కోరుకుంటుందమ్మా. నేను నీకు తెలియనంత చేరువలో, నీ చెంతలోనే, ప్రపంచమే ఒక పల్లెగా మారిన వేళ నేనున్నప్పటికీ నిన్ను చూడలేని నిర్బంధ పరిస్థితులలో వుండడం నా తప్పేమీ కాదమ్మా. నిర్దాక్షిణ్యమైన ఫాసిస్టు పాలకుల పాలన అలాంటిదమ్మా. తల్లులకు బిడ్డలను దూరం చేస్తున్నారు, కట్టుకున్నదానికి తన వారిని కాకుండా చేస్తున్నారు. పల్లెల్లో పడచు బిడ్డల బతుకులను బుగ్గి పాలు చేస్తున్నారు. రైతును పంటకు దూరం చేస్తున్నారు. అడవులను ఖాకీమయం చేస్తూ మూలవాసులను అడవికీ పరాయివాళ్లుగా చేస్తున్నారు. కార్మికులను వీధుల పాలు చేస్తున్నారు. ముస్లిం, దళిత సోదరులను ఊచకోత కోస్తున్నారు. వాళ్ల దాష్టీకాలను ఎన్నని రాయను తల్లీ! ఇప్పటివరకూ నా మనసులోని భావాలను నీతో పంచుకోవడానికి చాలా సందర్భాలలో పౌర, పోలీసు అధికారులే అవకాశాలను కల్పించారమ్మా. నీతో పాటు వాళ్లూ గుర్తుంటారు. చరిత్ర అంటేనే మంచితో పాటు చెడు కూడ నమోదవుతుంది కదా! 800 ఏళ్ల తరువాత తమకు అధికారం దక్కిందనీ హిందుత్వ శక్తులు సంబురపడుతూ కాషాయ జెండాను ఎగురేయడానికి ప్రపంచ పెట్టుబడులకు ఎర్ర తివాచీలు పరుస్తున్నారు. వారి కార్పొరేటీకరణకు, అడవులను వారి భద్రతా బలగాలతో నింపేస్తున్నారు. ఫలితంగా దేశం కార్పొరేటీకరణ-నిసైన్యీకరణకు వ్యతిరేకంగా నినదిస్తున్నది” అంటూ లేఖను ముగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page