– అధికారంలోకి రాగానే అమలు
– బీహార్ కా తేజస్వి ప్రణ్ పత్ర విడుదల
– మహాగఠ్‌బంధన్ మేనిఫెస్టో విడుదలలో తేజస్వి
పాట్నా, అక్టోబర్ 28: బీహార్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విపక్ష మహాఘట్‌బంధన్ మంగళవారం నాడు విడుదల చేసింది. ‘బిహార్ కా తేజస్వి ప్రమాణ్ పత్ర’అనే టైటిల్‌తో ఆర్జేడీ నేత, కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్, కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ‘నూతన, అభివృద్ధి చెందిన బిహార్’ తమ విజన్ అంటూ ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని మేనిఫెస్టో వాగ్దానం చేసింది. 20 రోజుల్లో ప్రతి కుటుంబంలోని ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపింది. జీవికా దీదీలకు ప్రభుత్వ ఉద్యోగులుగా శాశ్వత హోదా కల్పిస్తామని ప్రకటించింది. కాంట్రాక్టు కార్మికులు, ఔట్‌సోర్సింగ్ వర్కర్లను పెర్మనెంట్ చేస్తామని, పాత పెన్షన్ పథకాన్ని తిరిగి తీసుకువస్తామని తెలిపింది. రైతులు పండించిన పంటలన్నింటికీ కనీస మద్దతు ధర ఇస్తామని, మండీ, మార్కెట్ కమిటీలు పునరుద్ధరిస్తామని పేర్కొంది. జన్ స్వాస్థ్య సురక్ష యోజన కింద ప్రతి ఒక్కరికీ రూ.25 లక్షల ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తామని, జనాభాకు అనుగుణంగా 50 శాతం రిజర్వేషన్‌ను పెంచుతామని హామీ ఇచ్చింది. తేజస్వి యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్డీయే నేతల ప్రసంగాలు వినే ఉంటారని, ఒక్క నేత కూడా బీహార్‌ను ఎలా మందుకు తీసుకువెళ్తారో చెప్పడం లేదని అన్నారు. నితీష్‌కుమార్‌ను ఎన్డీయే కీలుబొమ్మగా పేర్కొన్నారు. బీహార్ సీఎం నితీష్‌కుమార్‌ను ఎన్నికల కోసమే బీజేపీ వాడుకుం టోందని, నితీష్ బీహార్ సీఎం కారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఇప్పటికే ధ్రువీకరించారని, ఎన్నికల తర్వాత బీజేపీ నితీష్‌ను సీఎం చేసే ప్రసక్తే లేదని అన్నారు. ఇండియా కూటమి తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించిందని, కానీ ఎన్డీయే ఒక్క మీడియా సమావేశంలో కూడా తమ సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించలేదని అన్నారు. కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఈ సందర్భంగా మాట్లాడుతూ, మహాగట్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగా తామే ప్రకటించామని, ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోను కూడా మొదటగా తాము విడుదల చేశామని చెప్పారు. దీనిని బట్టే బీహార్ విషయంలో తామెంతో కృతనిశ్చయంతో ఉన్నామో అర్ధం చేసుకోవచ్చన్నారు. తొలి రోజు నుంచి బీహార్‌కు ఏమి చేయదలచుకున్నామో డిసైడ్ చేసుకున్నామని, బీహార్‌కు తిరిగి పట్టాలపైకి తీసుకువస్తామని చెప్పారు. మహాఘట్‌బంధన్ ‘ప్రాణ పత్ర’ కోసం బీహార్ రాష్ట్రం ఎదురుచూస్తోందని, ఈరోజు తమకు శుభదినమని అన్నారు. మహాఘట్‌బంధన్ ఉప ముఖ్యమంత్రి అభ్యర్థి, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ చీఫ్ ముఖష్ సహానీ మాట్లాడుతూ, నవీన బీహార్ కోసం సంకల్ప పత్రాన్ని ఈరోజు విడుదల చేశామని, రాబోయే 30-35 సంవత్సరాల పాటు బిహార్ ప్రజలకు సేవలందిస్తామని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను తాము నెరవేరుస్తామని, ఇచ్చిన హాలన్నీ నెరవేరుస్తామని వాగ్దానం చేశారు. రాష్ట్ర ప్రజలంతా మహాగట్‌బంధన్‌కు మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు. ఎన్డీయేకు ఎలాంటి సంకల్పం లేదని, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని హాగట్‌బంధన్ ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





