– తలపట్టుకున్న జిల్లా ఎక్సైజ్ అధికార్లు
– ప్రభుత్వ ఉద్యోగులు వ్యాపారులుగా మారితే ఎలా?
– ఎక్సైజ్ కమిషనర్ ఆగ్రహం
– ముఖ్యమంత్రి జిల్లా కావడంతో మరింత తలనొప్పి
– అధికారుల్లో సునామీ సృష్టించిన ‘ప్రజాతంత్ర’
మహబూబ్ నగర్ ప్రజాతంత్ర, అక్టోబర్ 31: మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మద్యం షాపు లక్కీ డీప్‌లో దక్కించుకున్న వ్యవహారంపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ తీవ్రంగా స్పందించింది. హైదరాబాద్‌లోని ఎక్సైజ్ కమిషనరేట్‌లో ఈ పరిణామంపై శాఖాపరంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనిపై తక్షణమే విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఈ సంఘటనపై మూడు రోజుల క్రితం (‘ప్రజాతంత్ర’ దినపత్రిక) లో ప్రచురితమైన కథనం నేపథ్యంలో మరుసటి రోజే ఈ సమావేశం ఏర్పాటు చేయడం గమనార్హం.సమావేశంలో కమిషనర్ జిల్లా శాఖపై ఆగ్రహం వ్యక్తం చేశారని శాఖ సిబ్బంది ద్వారా సమాచారం. ఎక్సైజ్ కమిషనర్ నిర్వహించిన సమావేశం లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలై ఉండి, మద్యం వ్యాపారంలో పాలుపంచుకోవడం ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని కమిషనర్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ‘ప్రభుత్వ ఉద్యోగులు వ్యాపారులుగా మారితే ఎలా?’: “ప్రభుత్వ ఉద్యోగులు తమ వృత్తి ధర్మాన్ని పక్కనబెట్టి, ఇలాంటి వ్యాపార లావాదేవీల్లో పాల్గొనడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. దీనివల్ల శాఖకు చెడ్డపేరు వస్తుంది” అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఉపాధ్యాయురాలిపై చర్యలకు ఆదేశం సదరు ఉపాధ్యాయురాలిపై విద్యాశాఖ ద్వారా తక్షణమే శాఖాపరమైన విచారణ జరిపి, తీసుకున్న చర్యలను నివేదించాలని ఎక్సైజ్ కమిషనర్ ఆదేశించినట్లు సమాచారం. ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాల మేరకు, మహబూబ్‌నగర్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఇప్పటికే ఈ వ్యవహారంపై వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. శుక్రవారం ఎక్సైజ్ కమిషనర్ కు మహబూబ్నగర్ ఎక్సైజ్ పర్యవేక్షకులు ఈ విషయంపై హాజరు కావలసి ఉండగా కొన్ని కారణాలవల్ల అధికారి వెళ్లలేకపోయారని తెలిసింది. సదరు ఉపాధ్యాయురాలు మద్యం వ్యాపారం నుంచి వైదొలగకపోతే, ఆమెకు దక్కిన లైసెన్స్‌ను రద్దు చేసే అంశాన్ని పరిశీలించాలని కమిషనరేట్ నుంచి సూచనలు వచ్చినట్లు తెలుస్తోంది. విద్యా శాఖ అధికారులు సైతం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని, ఉద్యోగ నియమావళిని ఉల్లంఘించినందుకు గాను ఆమెపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉంది . ప్రభుత్వ ఉద్యోగులు అసాంఘిక లేదా వివాదాస్పద వ్యాపారాల్లో పాల్గొనకుండా కఠినమైన నిబంధనలు అమలు చేయాలనే దిశగా ఎక్సైజ్ కమిషనరేట్ కదిలిందని, ఈ సంఘటన ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక హెచ్చరికగా నిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ అంశం సోమవారం వరకు తేల్చాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్ గడువు విధించినట్టుగా సమాచారం. ప్రజాతంత్ర దినపత్రిక లో లక్కీ డ్రాలో ప్రభుత్వ టీచర్ కు షాపు దక్కడంపై వచ్చిన శీర్షికలతో ఎక్సైజ్ శాఖకు ఒక కనువిప్పు జరిగిందని సమావేశంలో కమిషనర్ ప్రస్తావన చేసినట్టు సమాచారం. భవిష్యత్తులో టెండర్ల నమోదు దరఖాస్తులలో మరొక కాలం చేర్చాలని అందులో వారి వృత్తిని పేర్కొనాలని ప్రతిపాదనలను చేసినట్టు తెలిసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో జిల్లా ఎక్సైజ్ శాఖకు తలనొప్పిగా మారింది.
మద్యం షాపుపై రాజకీయ నాయకుల కన్ను
ప్రభుత్వ టీచర్ కు దక్కిన మద్యం షాపు ను ఎలాగైనా వదిలిపెట్టొందని కాంగ్రెస్, బి.ఆర్ఎ.స్. నాయకులు కుమ్మక్కైనట్టు పట్టణంలో గుసగుసలు వినపడుతున్నాయి. ప్రభుత్వ టీచర్ కు దక్కిన మద్యం షాపు చలానా కూడా వీళ్ళే కట్టారని ప్రచారం జరుగుతుంది. మేమున్నాం ఏం కాదు మేము చూసుకుంటామని ఉపాధ్యాయురాలికి వారి కుటుంబానికి ధైర్యం చెబుతున్నట్టు తెలుస్తోంది. వారికి ఎంతో కొంత ముట్ట చెప్తామంటున్నారట. కొంతమంది జర్నలిస్టులకు వార్తలు రాయవద్దని ముడుపులు ఇచ్చినట్టు సమాచారం. ఓ పక్క శాఖా పరంగా అధికారులు ఆయోమయంలో ఉంటే వీరు మాత్రం మద్యం షాపును దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ధర్మాపూర్ 16వ షాపు నెంబర్లు టెండర్లు వేసిన మిగతావారు దాదాపు 25 మందికి పైగా సోమవారం జరిగే ప్రజా దర్బార్లో ఫిర్యాదు ఇచ్చేందుకు సమాచారం అడుగుతున్నట్టు తెలిసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





