“వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వలస కుటుంబాల పిల్లలు భవన నిర్మాణ రంగంలో కూడా పనులు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పత్తి విత్తనాలు వేసే కాలంలో, పత్తి కోత సమయంలో వందలాది మంది పిల్లలు బడులు మానేసి పనులకు వెళ్తున్నారు. ముఖ్యంగా గద్వాల ప్రాంతంలోని పత్తి విత్తనాల తోటల్లో బాల కార్మిక వ్యవస్థ ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించి నిరంతర తనిఖీలు చేపట్టాలి..”
ప్రతి ఏడాది జూన్ 12న ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడమే కాకుండా, ప్రతి చిన్నారికి విద్య, రక్షణ, గౌరవప్రదమైన బాల్యాన్ని అందించాలనే సంకల్పాన్ని ప్రపంచ దేశాలు ఈ సందర్భంగా పునరుద్ఘాటిస్తాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం “బాల కార్మిక రహిత తెలంగాణ” దిశగా స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాల్సిన అవసరం ఉంది.
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే–2024పై స్వతంత్ర నిపుణుల వర్కింగ్ గ్రూప్ చేసిన విశ్లేషణ ప్రకారం రాష్ట్రంలో సుమారు 89 వేల మంది బాల కార్మికులు ఉన్నట్లు వెల్లడైంది. వీరిలో అధిక శాతం రోజువారీ కూలీలుగా పనిచేస్తున్నారు. బాల కార్మికులలో 14 శాతం ఎస్సీ మాదిగ పిల్లలు, 11 శాతం ఎస్టీ లంబాడా పిల్లలు ఉన్నట్లు సర్వే వెల్లడించింది. ఇదే నివేదిక విద్యారంగంలో తీవ్రమైన అసమానతలను కూడా బయటపెట్టింది.సర్వేలు నిర్వహించడం మాత్రమే ప్రభుత్వ బాధ్యత కాదు. వాటి ఆధారంగా సమస్యల పరిష్కారానికి స్పష్టమైన విధానాలు, కార్యాచరణ చేపట్టడమే అసలు లక్ష్యం కావాలి.
రాష్ట్రంలో ఉన్న బాల కార్మికులను గుర్తించి, కార్మిక శాఖ మరియు విద్యాశాఖ సంయుక్తంగా పని చేసి వారిని పనుల నుండి విముక్తి చేసి తిరిగి పాఠశాలల్లో చేర్పించాలి. ప్రత్యేక బ్రిడ్జ్ కోర్సులు నిర్వహించాలి. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలి.
తెలంగాణకు పెద్ద ఎత్తున వలస కుటుంబాలు వస్తున్నాయి. వారితో పాటు చిన్నారులు కూడా పనులకు వస్తున్నారు. ఇటీవల నెల్లూరు ప్రాంతం నుండి నిజామాబాద్ జిల్లా ఇటుక బట్టీలకు తీసుకువచ్చిన వెట్టి చాకిరి బాధితులలో సుమారు 200 మంది పిల్లలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇటుక బట్టీలలో పనిచేస్తున్న బాల కార్మికులను వెంటనే రక్షించి పాఠశాలల్లో చేర్పించాలి. ఆరేళ్లలోపు చిన్నారుల కోసం యాజమాన్యాలు తప్పనిసరిగా క్రెచ్ సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలి.
అలాగే, వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వలస కుటుంబాల పిల్లలు భవన నిర్మాణ రంగంలో కూడా పనులు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పత్తి విత్తనాలు వేసే కాలంలో, పత్తి కోత సమయంలో వందలాది మంది పిల్లలు బడులు మానేసి పనులకు వెళ్తున్నారు. ముఖ్యంగా గద్వాల ప్రాంతంలోని పత్తి విత్తనాల తోటల్లో బాల కార్మిక వ్యవస్థ ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించి నిరంతర తనిఖీలు చేపట్టాలి.
ఒకప్పుడు జాతీయ స్థాయిలో జాతీయ బాల కార్మిక ప్రాజెక్టు (ఎన్సీ ఎల్పీ ) ద్వారా బాల కార్మికులను రక్షించి విద్యలోకి తీసుకువచ్చే కార్యక్రమం అమలులో ఉండేది. గత పన్నెండు సంవత్సరాలుగా ఈ పథకం నిలిచిపోయింది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం స్వంతంగా ప్రత్యేక బాల కార్మిక నిర్మూలన విధానాన్ని రూపొందించి అమలు చేయాలి.
ఈ రోజు “రైజింగ్ తెలంగాణ”, “మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ” గురించి అనేక ప్రకటనలు వినిపిస్తున్నాయి. కానీ బాల కార్మిక వ్యవస్థ కొనసాగుతున్న సమాజం నిజమైన అభివృద్ధిని సాధించలేదు. ప్రతి చిన్నారి పాఠశాలలో ఉంటేనే రాష్ట్రం మానవ వనరుల్లో బలపడుతుంది. విద్యలో పెట్టుబడి పెట్టినప్పుడే భవిష్యత్తు ఆర్థికాభివృద్ధికి బలమైన పునాది ఏర్పడుతుంది. అందువల్ల ఈ జూన్ 12ను కేవలం ఒక దినోత్సవంగా కాకుండా, “బాల కార్మిక రహిత తెలంగాణ” నిర్మాణానికి నాంది పలికే రోజుగా మార్చుకుందాం.

-ఆర్ వెంకట్ రెడ్డి
ఎమ్ వీ ఫౌండేషన్





