జల వివాదాలపై సెప్టెంబర్ లో ముఖ్యమంత్రుల సమావేశం

“కేంద్ర జల సంఘం ప్రతి పాదించిన ఫార్ములా అమలు జరిగి ఉంటే తెలంగాణ ఎక్కువగా లాభ పడేది. గతంలో బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 89 మేరకు విచారణ జరుపుతున్న సమయంలో ఈ ప్రాజెక్టు రాష్ట్ర విభజన చట్టం 11వ షెడ్యూల్ లేదని వ్యాఖ్యానించి వున్నది. అయితే ప్రస్తుతం 1956 అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం క్రింద విచారణ జరుపుతున్నందున ఏ వైఖరి తీసుకొంటుదోనని ట్రిబ్యునల్ వెలుపల డిపిఆర్ ఆమోదం పొందాలని దీనితో పాటు బిఆర్ఎస్ పార్టీని కట్టడి చేయ వచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విఫల యత్నం చేసినట్లుంది..”

shankaraiah
వి. శంకరయ్య
విశ్రాంత పాత్రికేయుడు

ట్రిబ్యునళ్లు కోర్టులు రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించలేవని సంప్రదింపులు ద్వారానే పరిష్కారం చేసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచించారు. కర్నాటక తెలంగాణ మహారాష్ట్ర ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి సెప్టెంబర్ లో ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. గోదావరి బేసిన్ లో రాష్ట్రాల మధ్య జల వివాదాలు దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా వుండటం నిజమే గాని ట్రిబ్యునల్ తీర్పులు అన్ని రాష్ట్రాలు గౌరవించి వుంటే ఈ పరిస్థితి ఏర్పడేది. ఇప్పుడు హోంమంత్రి కొరడా ఝుళిపించితే ఎంత వరకు దారికొస్తారో వేచి చూడాలి.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో మొన్న బుధవారం దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ సూచన చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో వున్నందున ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ సమావేశంలో పాల్గొని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పథకానికి అనుమతి ఇవ్వాలని కోరారు. కీలక మైన సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని కోరారు. కాగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గంగా కావేరి అనుసంధానం చేపట్టాలని కోరారు. ప్రస్తుతం గోదావరి కావేరి అనుసంధానంతో 500 టియంసిలు వరద జలాలను కావేరి బేసిన్ కు తరలించ వచ్చని చెప్పారు.

అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పథకం మీద పెట్టుకున్న ఆశలు నీరు గారి పోయాయి. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం బనకచర్ల అనుసంధానానికి తెర పడటంతో ఆ ప్రభావం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై పడింది. పరస్పర అంగీకారంతో పోలవరం బనకచర్ల అనుసంధానానికి అంగీకరించి తద్వారా కృష్ణ జలాలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఆంధ్ర ప్రదేశ్ నుండి నిరభ్యంతర పత్రం సాధించి కేంద్ర జల సంఘం వద్ద డిపిఆర్ అనుమతి పొంది బిఆర్ఎస్ పార్టీని కట్టడి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించారు.

కేంద్ర జల శక్తి శాఖ కు కూడా ఈ అంశంలో ఇబ్బంది ఎదురైంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పాదించిన పోలవరం బనకచర్ల అనుసంధానానికి వరద జలాలు ఆధారంగా అనుమతి ఇచ్చేందుకు నిబంధనలు అంగీకరించవు. కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కున్న పరపతితో ఏ విధంగానైనా ఆమోదించ వలసి వచ్చింది. అందుకే ఒకప్పుడు ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు డిపిఆర్ ఆమోదించ లేమని చెబుతుండిన కేంద్ర జల సంఘం దిగి వచ్చి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పథకం డిపిఆర్ ఆమోదానికి రెండు రాష్ట్రాల మధ్య రాజీ ఫార్ములా ప్రతి పాదించింది. అయితే ఈ ఫార్ములాకు వెంటనే ఆంధ్ర ప్రదేశ్ ముందుకు రాలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తన వైఖరి్ మార్చుకొని ఈ టర్మ్ లో ఈ పథకం చేపట్టడం లేదని ఇటీవల ప్రకటించారు.

నేపథ్యంలో ఇన్నాళ్లూ తన వద్ద వుంచుకొన్న బనకచర్ల అనుసంధానం పథకాన్ని కేంద్ర జల శక్తి శాఖ ఆంధ్ర ప్రదేశ్ కు తిప్పి పంపింది. కేంద్ర జల శక్తి శాఖకు చెందిన నిపుణుల కమిటీ గోదావరి ట్రిబ్యునల్ అవార్డుకు వ్యతిరేకంగా వుందని నోట్ కూడా పెట్టింది. ఈ పరిణామాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గంపడాశ గల్లంతయింది.
ట్రిబ్యునల్ తీర్పు వస్తే తప్ప పాలమూరు రంగారెడ్డి దానితో పాటు గండి ప్రాజెక్టులకు ఇప్పట్లో డిపిఆర్ లు అనుమతి
పొందే అవకాశం లేకుండా పోయింది.

అంతేకాదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పథకానికి డిపిఆర్ సాధించి కేంద్ర జల సంఘం ఆమోదం పొందితే ఈ పథకంపై ఇంకా వ్యయం చేయ దలచిన నిధులు కేంద్రం ప్రభుత్వం నుండి రాబట్టీ జాతీయ ప్రాజెక్టుగా ప్రకటింప చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఆ అవకాశం చేజారి పోయింది. మొన్న ఆగస్టు 20 వతేదీ చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో(సదరన్ జోనల్ కౌన్సిల్) లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లుడుతూ పాలమూరు రంగారెడ్డి నక్కల గండి ప్రాజెక్టులకు తెలంగాణ నీళ్లు కోరుకున్నా దిగువ వున్న రాష్ట్రానికి మిగులు జలాలపై వున్న హక్కుల కొనసాగుతాయని నొక్కి చెప్పారు.

గమనార్హమైన అంశమేమంటే ఎగువ రాష్ట్రాలు నుండి కూడా రక్షణ కోరుతూ తెలంగాణ లోని కీలక ప్రాజెక్టులకు కేంద్రం ఆర్థిక సహాయం చేయాలని కోరారు. కేంద్ర జల సంఘం ప్రతి పాదించిన ఫార్ములా అమలు జరిగి ఉంటే తెలంగాణ ఎక్కువగా లాభ పడేది. గతంలో బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 89 మేరకు విచారణ జరుపుతున్న సమయంలో ఈ ప్రాజెక్టు రాష్ట్ర విభజన చట్టం 11వ షెడ్యూల్ లేదని వ్యాఖ్యానించి వున్నది. అయితే ప్రస్తుతం 1956 అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం క్రింద విచారణ జరుపుతున్నందున ఏ వైఖరి తీసుకొంటుదోనని ట్రిబ్యునల్ వెలుపల డిపిఆర్ ఆమోదం పొందాలని దీనితో పాటు బిఆర్ఎస్ పార్టీని కట్టడి చేయ వచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విఫల యత్నం చేసినట్లుంది.

దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పోలవరం బనకచర్ల అనుసంధానం ప్రస్తావన తీసుకు రాలేదు-గాని గోదావరి కావేరి అనుసంధానం పథకం గురించి నొక్కి చెప్పారు. అయితే వరద జలాల భావ జాలం ఆయన్ను వీడినట్లు లేదు. గోదావరి కావేరి అనుసంధానం అమలు చేసి 500 టియంసిల వరద జలాలను కావేరీ బేసిన్ కు తరలించాలని పునరుద్ఘాటించారు. అంతేకాకుండా గంగా కావేరి అనుసంధానం చేపట్టాలని ఆకాంక్షించారు. సహజంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి పాదించే పథకాలెప్పుడూ భారీగా వుంటూ ఫలితాలు రెండు మూడు దశాబ్దాల తర్వాతనే లభ్యమయ్యేటివిగా వుంటాయి. ఒక దశాబ్ద కాలంగా గోదావరి కావేరి అనుసంధానం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. గోదావరి నుండి కావేరి అనుసంధానానికి గోదావరిలో మిగులు నీళ్లు లేవని కేంద్ర జల సంఘం తేల్చి వేసింది. అందుకే ఛత్తీస్గఢ్ వాడుకోని 148 టియంసిలు కోసం జాతీయ జల అభివృద్ధి సంస్థ తంటాలు పడుతోంది. గోదావరినది లోని వరద జలాలు తరలించునట్లయితే ఎప్పుడో గోదావరి కావేరి అనుసంధానం అమలుకు వచ్చేది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *