భాషే ఆమె దేశమూ ప్రపంచమూ

-వంశీకృష్ణ
సింధూరం, రక్త చందనం, బందూకు, ఎగరేసిన ఎర్రని జెండా, రుద్రాలిక నయన జ్వాలిక, కలకత్తా కాళిక నాలిక ఇవిమాత్రమేకాదు విప్లవానికి కావలసింది. ఇవిమాత్రమే విముక్తికి సంకేతాలు కాదు. ఒక్కొక్కసారి మనం కలలోకూడా ఊహించని సంకేతాలు మనం అనుభవించే తీవ్రమైన వేదననుంచీ అణచివేత నుంచీ కాసేపైనా విముక్తిని ప్రసాదించే సాధనాలు కావచ్చు. ఆ విముక్తి సాధనం అంబేడ్కర్ విషయంలో వొంటినిండా కప్పుకున్న దళసరి సూట్ అయితే గాంధీ విషయంలో పలచని అంగవస్త్రం అయితే ఆమె విషయంలో నిండైననవ్వు అయింది. ఇప్పుడంటే “నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది. ఇవ్వొద్దూ ఇవ్వొద్దూ ఇవ్వొద్దూ” అని అమ్మాయిల నవ్వుమీద ‘బాయ్ మీట్స్ గర్ల్’ కవిత్వం రాస్తున్నారు కానీ ఓ యాభయ్యేళ్ళ క్రితం నవ్వు దానికదే సీరియస్ కవిత్వవస్తువు.దానికదే పోరాటవస్తువు. Right to laugh సాధించడంకోసం నవ్వే ఒక లాంగ్ మార్చ్. నమ్మకం కలగడంలేదా? ఈ కవిత చదవండి.
“గండుశిలల గానవసంతంలో ఒక స్త్రీ నవ్వు ప్రతిధ్వనిస్తున్నది/ అపురూపమైన సంపద, అమేయమైన కీర్తి ఆ నవ్వులో ప్రతిబింబిచడం లేదు/ ఆమెశరీరంలో అణువణువునా దాగిన స్వేచ్ఛాకాంక్షకి ఆ నవ్వు ఒక ప్రతీక/ ఈ చరాచరసృష్టిలో వున్న ఏ దేవాలయంలోనూ ఆ కోమలమైన హాసధ్వని వినిపించదు/ ప్రతి వస్తువూ అంగడిసరుకు అయిన ఈ విశాలవిఫణిలో ఆ స్త్రీ నవ్వులోని పారవశ్యాన్ని ఎవరూ విక్రయించలేరు/ చివరకు ఆమెకూడా/ అడవిలోని అనాఘ్రాతపవనమా ఒక్కసారి వచ్చి ఆ స్త్రీ ముఖంమీద ఒక చిన్న ముద్దు పెట్టవూ/? ఆమె నీ తనూజ కూడా కదా అందుకేనేమో ఆమె విప్పారిన వదులు వదులు శిరోజాలు అలా స్వేచ్చగా గాలికి ఎగురుతున్నాయి/ ఆ స్వేచ్ఛలో ఆమెనవ్వు ప్రతిధ్వనిస్తుంది.” ఈ కవిత భారతదేశంలో పుట్టి పాకిస్తాన్లో పెరిగి వైవాహిక జీవితంకోసం లండన్ వెళ్లి, ఆ పెళ్లికాస్తా పెటాకులు అయితే మళ్ళీ పాకిస్తాన్ వచ్చి దేశద్రోహి ముద్రతో భారతదేశంలో ఎనిమిదేళ్ల అజ్ఞాతవాసం గడిపి, చివరకు “నాకే దేశమూ లేదు, నా భాషే  నా దేశం” అని ప్రకటించుకున్న మనకాలపు మహాకవి ఫాహ్మిదా రియాజ్.
ఆమెకవిత్వం అంతా స్త్రీలు తమను తాము కొత్తగా కనుగొనడానికి చేసిన ప్రయాణంలో తమతోతాము, తమలోతాము చేసుకున్న సుదీర్ఘ సంభాషణలా ఉంటుంది. ఈ సంభాషణలో ప్రధానమైనమాటలు స్త్రీ శరీరము, ఆత్మ. ఈ మాటలకు కవిత్వాభివ్యక్తిని ఇచ్చేక్రమంలో ఆమె వాడినభాష, సృష్టించిన కొత్త నిఘంటువు వాటికవే ప్రత్యేకం. అందుకే ఈ కవిత్వంలో నూతనత్వం, మృదుత్వం కనిపిస్తాయి. పూర్తిగా వ్యక్తిగతమైన అంశాలకు కూడా సామాజిక చలనం ఏదో అద్దుకోగా అవి ఇంట్రాపర్సనల్ నుండి ఎక్సట్రా పర్సనల్ గా మారి అక్కడనుండి సార్వజనీనమూ సార్వకాలీనమూ అవుతాయి.
1946 జులై 28 న ఉత్తరప్రదేశ్ లోని మీరట్లో తొలిశ్వాసను అందుకున్నది ఫాహ్మిదా రియాజ్. ఆమె తండ్రి మీరట్లో బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్న టీచర్ రియాజుద్దీన్ అహమ్మద్. ఆమెపుట్టిన సంవత్సరానికే దేశవిభజన జరిగి పాకిస్థాన్లో ఉన్న సింధు ప్రావిన్స్ కి బదిలీ అయినాడు. ఉపఖండం రెండుగా చీలి ప్రతి చీలికా తనదైన సంస్కృతి కోసం తండ్లాట పడుతున్న సమయం. పాకిస్థాన్ ముస్లిం జాతీయత కోసం, భారత్ హిందూ జాతీయత కోసం సరిహద్దులలో ఉన్న స్త్రీల శరీరాలని ఒక మెటఫర్ గా చేసుకున్న సమయం. స్త్రీలపట్ల హింస, సొంతస్త్రీలను కాపాడుకోవడం కోసం సరిహద్దుకు అవతలవైపున వున్న స్త్రీలపట్ల చూపే వివక్ష, హింస అంతా విభజన విషాదం. ఆ విషాదానికి ప్రత్యక్షసాక్షి ఫాహ్మిదా రియాజ్. సింధు ప్రావిన్స్ లోని హైదరాబాద్లో సెటిల్ అయిన కొద్దిరోజులకే  రియాజుద్దీన్ మరణించారు. అప్పుడు ఫాహ్మిదా రియాజ్ వయసు నాలుగేళ్లు. ఆమె ఉర్దూ, సింధీ భాషాసాహిత్యాలు చదువుకుంది. కొంతకాలం పాకిస్థాన్ రేడియోలో న్యూస్ కాస్టర్ గా పనిచేసాక పెళ్లిచేసుకుని లండన్ వెళ్ళిపోయింది. అక్కడ బిబిసి ఉర్దూవిభాగంలో పనిచేస్తూనే ఫిలింమేకింగ్ లో డిగ్రీ తీసుకున్నది. తరువాత భర్తతో సరిపడక డివోర్స్ తీసుకుని పాకిస్థాన్ వచ్చేసింది.
ఆమె ఇరవయ్యవ ఏట మొదటి కవిత్వసంపుటి పత్తర్ కి జుబాన్ తీసుకువచ్చింది. ఈ శీర్షికకి రాళ్లభాష అని అర్ధం. ఆ కవిత్వసంపుటికి రాసుకున్న ముందుమాటలో ఆమె “I Would not write any poem until it forced me to write” అని చెప్పుకున్నది. ఏమీ చెప్పడానికి లేనప్పుడు ఖాళీగా వుంటాను కానీ కవిత్వంకోసం కవిత్వం రాయను అన్నది. పత్తర్ కి జుబాన్ విడుదలయిన తరువాత నాలుగేళ్లపాటు ఒక్కముక్క కూడా కవిత్వం రాయలేదు. ఆమెకు కేవలం శైలికోసం శిల్పంకోసం, కవిత్వసౌందర్యం కోసం కవిత్వం రాయడం కూడా ఇష్టం ఉండదు. అందుకేనేమో ఆమె గజల్ కూడా రాయలేదు.
పత్తర్ కి జుబాన్ తరువాత ఆమె తెచ్చిన రెండవ కవిత్వసంపుటి బదన్ దరీదా. అంటే చిరిగినశరీరం అని అర్ధమట. ఆ కవిత్వసంపుటితో ఆమె పాకిస్థాన్ సాహిత్యవర్గాలలో పెను సంచలనం రేకెత్తించింది. అప్పటినుండీ 2018 లో కన్ను మూసేదాకా ఆమె పెన్ను మూసింది లేదు. ఆమె చెప్పకుండా వదిలివేసిన విషయంలేదు. జూలియస్ క్రిస్టీవా, హెలెన్ సిక్సస్ లాంటి ఫ్రెంచ్ ఫెమినిస్టుల కవిత్వం చదువుతున్నప్పుడు, వాళ్ళ భాషను గమిస్తున్నప్పుడు మనకు కచ్చితంగా ఫాహ్మిదా రియాజ్ కవితలు గుర్తుకు వస్తాయి. ఫాహ్మిదా రియాజ్ కి ఫెమినిజం అంటే కేవలం పురుషద్వేషం కాదు “ఫెమినిజానికి చాలా వ్యాఖ్యానాలు, విస్తరణలు వున్నాయి. నాకు సంబంధించినంతవరకు ఫెమినిజం అంటే స్త్రీలుకూడా పురుషులలాగే అవధులులేని అవకాశాలతో నివసించగలిగే కంప్లీట్ హ్యూమన్ బీయింగ్స్ లా సమాజంలో ఉండగలగాలి. మరీముఖ్యంగా స్త్త్రీలు సామాజిక సమానత్వం సాధించాలి. బ్లాక్ అమెరికన్స్, దళితులులాగా. స్త్రీల సామాజిక సమానత్వసాధనలో సంక్లిష్టతలు వున్నాయి. పురుషుడిలాగా ఏ వేధింపులూ లేకుండా ఇష్టం వచ్చిన సమయంలో ఇష్టం వచ్చినట్టు నడిచే స్వాతంత్య్రం ఉండాలి. ఒక ప్రేమకవిత రాయడమూ కొలనులో ఈత కొట్టడమూ అనైతికం కాని సర్వసాధారణ విషయంలా సమాజంలో నిలువగలిగే అవకాశం ఉండాలి. వివక్ష అనేది అమానవీయం” అంటుంది.
(ముగింపు వచ్చేవారం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page