జూబ్లీహిల్స్‌ను మళ్లీ సాధిస్తున్నాం

– మెజార్టీ ఎంతో తేలాల్సి ఉంది
– రాష్ట్రం వచ్చింది కానీ.. పరిస్థితి బాగాలేకుండె
– నాడు కరెంటు లేదు.. హైదరాబాద్‌లో ఇన్వర్టర్‌ లేని ఇల్లు లేదు
– అనతి కాలంలోనే రాష్ట్రాన్ని నెంబర్‌-1గా తీర్చిదిద్దిన కేసీఆర్‌
– షేక్‌పేటలో కేటీఆర్‌ రోడ్‌ షో

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31: చావు నోట్లో తల పెట్టి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌గా తీర్చిదిద్దారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. తాము అధికారంలో ఉన్నపుడు హైదరాబాద్‌లో 42 ఫ్లైఓవర్లు కట్టామని,
అటు పల్లెలను కూడా అభివృద్ధి చేసిన ఘనత మనదేనని చెప్పారు. ఉప ఎన్నిక ప్రచారంలోా భాగంగా షేక్‌పేట రోడ్ షోలో ఆయన మాట్లాడారు. వెయ్యికి పైగా గురుకుల పాఠశాలలు పెట్టి పేదలకు చదువు అందించాం..షాదీ ముబారక్‌, కేసీఆర్‌ కిట్‌ వంటి ఎన్నో పథకాలు అమలు చేశాం అని వివరించారు. పరిశ్రమలు వచ్చాయి.. ఐటీ అభివృద్ధి జరిగింది అని చెప్పారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో మళ్లీ మనమే గెలవబోతున్నామని, అయితే మెజారిటీ ఎంత అనేది తేలాల్సి ఉందని అన్నారు. 2023 ఎన్నికల్లో హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాలేదని, జూబ్లీహిల్స్‌లో మాగంటి గోపినాథ్‌ను మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించారని, నియోజకవర్గంలో ఆయన ప్రతి ఒక్కరికీ అండగా నిలిచారని కేటీఆర్‌ చెప్పారు. దురదృష్టవశాత్తూ ఆరోగ్య సమస్యలతో గోపినాథ్‌ కన్నుమూశారని, ఉప ఎన్నికలో ఆయన సతీమణి సునీతను ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఏ ఒక్కరికీి కూడా మేలు జరగలేదని, ఎన్ని వాగ్దానాలు ఇచ్చారో మీరంతా ఒక్కసారి గుర్తుచేసుకోవాలన్నారు. అరచేతిలో స్వర్గం చూపిస్తూ 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలన చూశారు.. రెండేళ్ల కాంగ్రెస్‌ పాలన చూశారు.. ఈ రెండేళ్ల కాంగ్రెస్‌ పాలనలో ఒక్కరికైనా మేలు జరిగిందా ఆలోచించాలన్నారు. పేదలకు పథకాలు ఇచ్చే తెలివిలేదు.. కేసీఆర్‌ పథకాలు కంటిన్యూ చేసే ఆలోచన లేదని విమర్శించారు. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్‌ ఓట్లడుగుతుందో నాకైతే అర్థం కావడం లేదన్నారు. కానీ ఈ ప్రభుత్వంలో కొత్తగా ఒక్క పట్టా ఇచ్చింది లేదు.. హైదరాబాద్‌లో లక్ష డబుల్‌ బెడ్రూం ఇళ్లు కేసీఆర్‌ కట్టిస్తే ఈ కాంగ్రెస్‌ సర్కార్‌ ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యం అంటారు.. పేదల ఇంటిపైకి బుల్డోజర్‌ పంపిస్తున్నారని, ఈ రెండేళ్లలోనే కొన్ని వేల మంది పేదల ఇళ్లు నేలమట్టం చేశారని ఆరోపించారు. హైడ్రాను తెచ్చి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని నాశనం చేశారన్నారు. ఆటో అన్నలను ఇబ్బంది పెట్టారు.. ఉన్న పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకు పారిపోతున్నాయి.. కేసీఆర్‌ అద్భుతంగా పనిచేసి తెలంగాణను నెంబర్‌ వన్‌ చేస్తే ఇప్పుడు లాస్ట్‌లో నిలబెట్టారని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అంటే కుటుంబానికి పెద్ద.. ఆయనే పనికిమాలిన మాటలు మాట్లాడితే ఇక పెట్టుబడులు పెట్టేది ఎవరు అని నిలదీశారు. ఇక్కడ నాలుగు లక్షల మంది కాంగ్రెస్‌కు బుద్ధి చెబితే నాలుగు కోట్ల మంది ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page