అత్యుత్తమ వైద్యం అందించాలని సీఎం ఆదేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 4: సోమాజిగూడలోని యశోద హాస్పిల్‌లో చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం ఆరోగ్యం నిలకడగా ఉందని హాస్పిటల్ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల కేశారు. స్వల్ప అనారోగ్యంతో ఆయన హాస్పిటల్‌లో చేరిన విషయం విదితమే. కేసీఆర్ నీరసంగా ఉండటంతో గురువారం సాయంత్రం హాస్పిటల్‌లో చేరారు. ఆయన శరీరంలో బ్లడ్ షుగర్ అధికంగా, సోడియం మోతాదు తక్కువగా ఉన్నట్లు ప్రాథమిక పరీక్షల్లో వెల్లడైంది. మరోవైపు, కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. యశోద హాస్పిటల్ వైద్యులు, అధికారులతో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌కు అత్యుత్తమ చికిత్స అందించాలని సూచించారు. ఆయన త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని సీఎం ఆకాంక్షించారు. కాగా, చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. అనంతరం వైద్యులతో మాట్లాడి చికిత్సకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.