– మా నేత గర్జించకపోతే రైతు భరోసా వేసేవాడివా?
– కాంగ్రెస్‌కు మళ్లీ ఎందుకు ఓటేయాలో చెప్పాలి
– రేవంత్‌పై బీఆర్ఎస్ నేత హరీష్‌రావు ధ్వజం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు కేసీఆర్ సభకు పోటీగా అదే సమయానికి మైకు పట్టుకుని రేవంత్ తన సంకుచిత బుద్ధిని బయటపెట్టుకున్నాడని అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ వస్తున్నారని భయపడి డైవర్షన్ కోసం ఒక కిస్తీ రైతు భరోసా వేశారని ఎద్దేవా చేశారు. ఆయన గర్జించకపోతే ఆ డబ్బులు కూడా పడేవి కావన్నారు. సకల జనులను దగా చేసి రాష్ట్రాన్ని స్కాములతో నింపిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మళ్లీ ఎందుకు ఓట్లు వేయాలో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని నిలదీశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటిల రాజకీయాలపై, కాళేశ్వరం ప్రాజెక్టుపై చేస్తున్న దుష్ప్రచారాలపై, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ సభ జరుగుతుందని ముందే తెలిసి ఆ సభకు పోటీగా అదే జిల్లాలో అదే సమయానికి రేవంత్ రెడ్డి మాట్లాడటం ఆయన కుచిత బుద్ధికి, సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని అన్నారు. కేసీఆర్ వ్యూవర్ షిప్‌లో కనీసం 10 శాతం కూడా రేవంత్‌కు రాలేదన్నారు. రెండున్నరేళ్లలో రేవంత్ స్థాయి ఎక్కడికి పడిపోయిందో, కేసీఆర్ మీద ప్రజల్లో ఉన్న అభిమానం ఏంటో ఈ లెక్కలే చెబుతున్నాయన్నారు. పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎంతో హుందాగా (స్టేట్స్‌మన్‌లా) రేవంత్ రెడ్డి పేరు ఒక్కసారి కూడా తీయకుండా రాష్ట్ర ప్రయోజనాలపై మాట్లాడితే రేవంత్ రెడ్డి రంకెలు వేయడం (‘స్ట్రీట్ మన్‌లా), ఏడవడం తప్ప ఇంకేం చేయలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ చెప్పిన మాటలు విని తప్పులు సరిదిద్దుకుంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కనీసం డిపాజిట్లు అయినా దక్కుతాయని హరీష్‌రావు హితవు పలికారు. తమ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు సీనియర్ న్యాయవాదులను కలిసేందుకే తాను, ఎంపీ రవిచంద్ర, మాజీ ఎంపీ వినోద్ కుమార్ బహిరంగంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి దిల్లీకి వెళ్లామని, అందులో దాచిపెట్టేదేం లేదని అన్నారు. కానీ రేవంత్ రెడ్డి తన మీడియా ద్వారా లీకులు ఇస్తూ డ్రామాలు ఆడాడన్నారు. కాళేశ్వరం కేసులో తీర్పు ఏవిధంగా వచ్చినా సుప్రీం కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి మే 6న హైకోర్టులో రాబోతున్న ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుల కోసం సీనియర్ లాయర్లను సంప్రదించడానికి దిల్లీ వెళ్లామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ బీఫామ్‌పై గెలిచి తాను ఇంకా బీఆరఎస్‌లోనే ఉన్నానని ఒక ఎమ్మెల్యే అనడం, దాన్ని స్పీకర్ ధ్రువీకరించడం అత్యంత దుర్మార్గమని ఆక్షేపించారు. రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ ఉందని, పట్టపగలు బ్యాగులతో దొరికిపోయిన దొంగ రేవంత్ రెడ్డి.. ఈరోజు హోంమంత్రిగా ఆయనే ఉన్నాడు కాబట్టి కంప్లైంట్ కూడా ఆయనే. ప్రభుత్వం తరఫున నామమాత్రపు లాయర్లను పెట్టి వ్యక్తిగతంగా తన తరఫున ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ్ లూSవ్ర లాంటి ఖరీదైన లాయర్లను పెట్టుకున్నాడని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో బీఆరఎస్ తరఫున జగదీశ్ రెడ్డి, డాక్టర్ సంజయ్, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ గారు ఇంప్లీడ్ అయ్యారన్నారు. ఆనాడు సమైక్యవాదులతో చేతులు కలిపి తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్ర చేసింది రేవంత్ రెడ్డి కాదా అని నిలదీశారు. నాలుగున్నరేండ్ల నుంచి స్టేల మీద బతుకుతున్న రేవంత్ రెడ్డికి ఆ స్టే వెకేట్ అయితే ముఖ్యమంత్రి సీటు ఊడటం, జైలుకు వెళ్లడం ఖాయం అని స్పష్టం చేశారు.
కేసీఆర్‌కు భయపడి రైతు భరోసా వేశాడు
ఇప్పటికే రెండు సీజన్ల రైతు భరోసా ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి.. నిన్న కేసీఆర్ జగిత్యాల సభలో గర్జిస్తారని భయపడి రాత్రికి రాత్రి ఒక ఎకరానికి కిస్తీ వేశాడని విమర్శించారు. రూ.5000 కోట్లు వేయాల్సి ఉండగా ఇంకా రూ.4000 కోట్లు బకాయి ఉంది.. వడ్లు కల్లాలకు వచ్చినా రైతు భరోసా పూర్తి స్థాయిలో వేయలేదు.. మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే మున్సిపల్ ఎన్నికల తర్వాత మిగతా రైతు భరోసా ఇస్తానని రేవంత్ మిర్యాలగూడ, సిద్దిపేట సభల్లో చెప్పాడు.. వచ్చే సంవత్సరం సూపర్ ఎల్ నినో వల్ల కరువు వస్తుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తే రేవంత్ రెడ్డికి సోయొచ్చింది అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, లక్ష కోట్లు కొట్టుకుపోయాయని నిన్నటిదాకా దుష్ప్రచారం చేసిన వ్యక్తి ఇవాళ మేడిగడ్డ రిపేరు చేసుకుని వాడుకుంటామని ఒప్పుకున్నాడన్నారు. రెండు పిల్లర్లు కుంగితే మొత్తం ప్రాజెక్టు కొట్టుకుపోయినట్లా అని ప్రశ్నించారు. కాళేశ్వరంలో ‘ఎ’ తెలవని, ‘బి’ తెలవని రేవంత్ రెడ్డి ఎల్లంపల్లి తామే కట్టామని అబద్ధాలు చెబుతున్నాడు. కేసీఆర్ ఎంత గొప్పగా ఆలోచించారంటే వరద ఉంటే మిడ్ మానేరు నుంచి, మధ్యస్థంగా నీరుంటే ఎల్లంపల్లి నుంచి, కరవు వస్తే మేడిగడ్డ నుంచి నీటిని లిఫ్ట్ చేసుకునేలా కాళేశ్వరాన్ని డిజైన్ చేశారని హరీష్‌రావు చెప్పారు. రేవంత్ శంకుస్థాపన చేసిన గంధమల్ల కూడా కాళేశ్వరంలో భాగమేనన్నారు. మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కి.మీ సొరంగాలు, 1531 కి.మీ గ్రావిటీ కెనాల్, 98 కి.మీ ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు నీటి లిఫ్ట్, మొత్తంగా 240 టీఎంసీల వినియోగం.. మ్తొంగా ఇదీ కాళేశ్వరం అని చెప్పారు. లోయర్ మానేరు నుంచి సూర్యపేట దాకా నిండిన చెరువులు, కూడెల్లి, హల్దీ వాగులు పొంగడం, అన్నపూర్ణ, రంగనాయక, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నిండటం కాళేశ్వరం ఫలితాలు కాదా అని అడిగారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు సముద్ర మట్టానికి +148 మీటర్ల ఎత్తులో ఉంటే.. అక్కడి నుంచి మిడ్ మానేరు (+318 మీటర్లు), అనంతగిరి (+397 మీటర్లు), రంగనాయక సాగర్ +490 మీటర్లు), మల్లన్న సాగర్ +557 మీటర్లు), కొండపోచమ్మ సాగర్ (+618 మీటర్ల) ఎత్తుకు గోదావరి నీళ్లను మోటార్లు లేకుండా ఎలా తీసుకువస్తావు రేవంత్ రెడ్డీ అని నిలదీశారు. ఇది ముమ్మాటికీ కాళేశ్వరం లిఫ్ట్ చేసిన ఫలితమేనన్నారు. ఎల్లంపల్లి, ఎస్సారెస్పీలు పూర్తి చేసింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన నాడు శిలాఫలకం మీద రాష్ట్ర మంత్రిగా తన పేరుందని, ఆనాడు మంత్రిగా ఉన్న తన వెనక రేవంత్ రెడ్డి నిక్కర్లు వేసుకుని తిరిగాడని, కావాలంటే వీడియోలు పంపిస్తా అని అన్నారు. కాంగ్రెస్ ఆ ప్రాజెక్టును పూర్తి చేయలేదు.. ముంపు బాధితులకు పరిహారం కూడా ఇవ్వలేదు.. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ ఆదేశాలతో రూ.2052 కోట్లు ఖర్చు పెట్టి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఇళ్లు కట్టించి ఎల్లంపల్లిని పూర్తి చేసింది తాను మంత్రిగా ఉన్నప్పుడేనని హరీష్‌రావు స్పష్టం చేశారు. 1953లో ఎస్సారెస్పీ కడితే 50 ఏళ్లయినా కాంగ్రెస్ నాయకులు పది లక్షల ఎకరాలకు నీళ్లివ్వలేదన్నారు. బీఆరఎస్ వచ్చే నాటికి 6 లక్షల ఎకరాలకు నీరందేదని, లోయర్ మానేరు కాలువలు బాగు చేసి రూ.2000 కోట్లతో కాకతీయ కాలువ ఆధునికీకరించి 12 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చింది కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు.
మీకు ఎందుకు మళ్లీ ఓటు వేయాలి
రైతుబంధు, రెండు సీజన్ల రైతు భరోసా ఎగ్గొట్టినందుకా.. తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు అప్పగించినందుకా.. తెలంగాణ డబ్బులను దిల్లీకి, కుప్పానికి కడుతున్నందుకా.. 2 లక్షల ఉద్యోగాలిస్తామని నిరుద్యోగులను మోసం చేసినందుకా.. నెలకు రూ.2500 ఇస్తామని మహిళలను దగా చేసినందుకా.. స్కీములు లేవు కానీ రాష్ట్రాన్ని స్కాములతో నింపినందుకా.. సింగరేణిని దోచుకున్నందుకా.. హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టినందుకా.. ఖమ్మం వెలుగుమట్లలో వేల ఇండ్లు కూల్చినందుకా.. కలుషిత ఆహారంతో 200 మంది గురుకుల విద్యార్థులను పొట్టనపెట్టుకున్నందుకా.. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా లక్షలాది విద్యార్థులను అంధకారంలో నెట్టినందుకా.. ఉద్యోగులను, రిటైర్డ్ ఉద్యోగులను, ఆర్టీసీ కార్మికులను, అంగన్వాడీలను రోడ్డున పడేసినందుకా.. ఫార్మా కంపెనీల కోసం లగచర్ల రైతుల చేతులకు బేడీలు వేసినందుకా.. కులవృత్తులను ధ్వంసం చేసినందుకా కాంగ్రెస్‌కు మళ్లీ ఎందుకు ఓటేయాలి అని ప్రశ్నించారు. నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదని హరీష్‌రావు అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





