కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గిపోతుందనే వాదన సత్యదూరం
రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ పార్టీ పూర్తిగా అదృశ్యం
పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
నిజామాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: కేసీఆర్ చెప్పినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయినట్లా అని పీసీసీ చీఫ్ బీ. మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్‌కు పగటి కలలు కనడం అలవాటుగా మారిపోయిందని, ఆయన శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని సూచించారు. పట్టభద్రుల ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టే సత్తాలేని బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వొస్తుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ‘ఫామ్ హౌస్‌లో విశ్రాంతి తీసుకునే కేసీఆర్‌కు,అభివృద్ధిని పరుగులెత్తించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోలికేంటని‘ అంటూ మండిపడ్డారు.
ప్రజలు తమ వెంటే ఉన్నప్పుడు, కాంగ్రెస్ బలంగా కొనసాగుతున్న సమయంలో, గ్రాఫ్ తగ్గిపోతుందన్న అభిప్రాయం అసత్యమని ఖండించారు. ఫామ్ హౌస్‌లో కూర్చొని పెన్ను, పేపర్ తీసుకుని గ్రాఫ్ గీస్తే, కాంగ్రెస్ పార్టీకి మద్దతు తగ్గిపోతుందా? అంటూ కేసీఆర్‌ను ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 56 శాతం బీసీలు తమ వెంటే ఉన్నారని, ఏడాదిలో 56,000 ఉద్యోగాలను కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. రైతులకు రుణమాఫీ సహా పలు కీలక హామీలను అమలు చేసినట్లు వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో, కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గిపోతుందనే వాదన నమ్మశక్యం కాదని స్పష్టం చేశారు.
కేసీఆర్ గ్రాఫ్ పూర్తిగా కిందపడిపోయి, ఫామ్ హౌజ్‌కే పరిమితం అయిపోయిందని వ్యాఖ్యానించారు. ‘నీ అల్లుడు, బిడ్డ హరీష్ రావు, కవితలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇదే పార్టీ పరిస్థితిని అర్థమయ్యేలా చేస్తుంది‘ అంటూ కేసీఆర్‌కు చురకలంటించారు. రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ పార్టీ పూర్తిగా అదృశ్యం అవుతుందని, ఆ పార్టీలో తండ్రి, కొడుకు మాత్రమే మిగిలిపోతారని గౌడ్ సెటైర్లు వేశారు.