కేసీఆర్ బాధితులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేసిన మంత్రి పొంగులేటి
వాసాలమర్రి(హైదరాబాద్), ప్రజాతంత్ర, జూన్ 19: వాసాలమర్రి గ్రామాన్ని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగమా గం చేస్తే నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లోని ఇందిరమ్మ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రెవె న్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో అర్హులైన 205మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఆయన మంజూరు పత్రాలను గురువారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. నాడు గ్రామస్తులతో కేసీఆర్ సంహపంక్తి భోజనం చేసి ఆగవ్వ అనే వృద్ధురాలిని పక్కన కూర్చోబెట్టుకుని ఇల్లు కట్టిస్తానని ఇచ్చిన హామీ నెరవేర్చలేదని, ఇప్పుడు ఆమె మాటల్లోనే వింటుంటే ఎంతో బాధ కలిగిందని అన్నారు. ఆగవ్వ మాటల ప్రకారం కేసీఆర్ చేసిన మోసం బట్టబయలు అయిందన్నారు. కేసీఆర్ మాటలు నమ్మి ఆగవ్వతోపాటు గ్రామస్తులందరూ ఆగమమయ్యారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వాసాలమర్రిని అన్ని విధాలుగా ఆదుకుంటూ అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుందన్నారు. వాసాలమర్రి లాగానే ఇండ్లు ఇస్తామంటూ బొమ్మను చూపి ఓట్లు వేయించుకున్న కేసీఆర్ ఏ ఒక్క ఊరికీ ఇండ్లు ఇవ్వకుండా రాష్ట్రాన్ని అధోగతి పాల్జేశారని విమర్శించారు. ఆర్ధిక ఇబ్బందులెన్ని వున్నా ఇచ్చిన హామీల మేరకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఇంటి నిర్మాణ పనులు మొదలు పెట్టడానికి డబ్బులు కూడా లేవని ఆగవ్వ చెప్పడంతో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వెంటనే రూ.లక్ష అందజేశారు. తక్షణమే ముగ్గు పోసి పనులు చేపట్టాలని సూచించారు. ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డికి మంత్రి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఛైర్ పర్సన్ బండ్రు శోభారాణి, జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.