కాకతీయ కలగూర గంప-25
ఉపోద్ఘాతం:
‘ఆచార్య బృహస్పతి’ గా ప్రసిద్ధి చెందిన కైలాస్ చంద్రదేవ్ బృహస్పతి గారు గొప్ప హిందుస్తాని సంగీత గురువు. ఆయన గొప్ప సంగీతజ్ఞాని,మేధావి మరియు రచయిత. కాన్పూర్ లోని విక్రమ్ జిత్ సింగ్ సనాతన ధర్మ కళాశాలలో సంగీతాచార్యులు. ఆకాశవాణి సంగీత కార్యక్రమ రూపకల్పన లో ప్రధాన సలహాదారు. కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ కు సలహాదారు గా కూడా వుండే వారు. ఆయన రాసిన అనేక సంగీత సంబంధిత గ్రంథాలలో “రాగ రహస్య’ అనే హిందుస్తాని సంగీత. గ్రంధం సంగీత కళాకారుల లో బహుళ ప్రాచుర్యం పొందింది.
ఆయన భార్య శ్రీమతి సులోచన బ్రహస్పతి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ప్రముఖ గాయకురాలు. 1994లో, ఆమెకు సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది, ఇది భారతీయ సంగీత నాటక అకాడమీ సంగీత, నృత్యం & నాటకాల జాతీయ అకాడమీ ద్వారా అభ్యసించే కళాకారులకు ఇచ్చే అత్యున్నత భారతీయ గుర్తింపు. రామ్ పూర్- సదారంగ్ పరంపరలో నిష్ణాతురాలు.రామ్ పూర్ – సహస్వాన్ ఘరానా కు చెందిన పండిత భోలానాధ్ భట్, ఉస్తాద్ ముస్తాక్ హుస్సేన్ ఖాన్ గార్ల వద్ద తొలి శిక్షణ పొందిన తదుపరి తన గురువు, భర్త అయిన ఆచార్య కైలాస్ చంద్రదేవ్ బృహస్పతి గారి వద్ద కూలంకషం గా శిక్షణ పొంది ఖయాల్, టుంరీలు, టప్పాలు, దాద్రాలు మున్నగు వివిధ బాణీలలో పాడగల గొప్ప హిందుస్తాని శాస్త్రీయ సంగీత విదూషీమణి.
జరిగిన విషయం:
1931-32 ప్రాంతంలో ప్రైమరీ విద్యను తన గ్రామంలో ముగించిన పిదప 6వ తరగతిలో జాయిన్ కావడానికి హన్మకొండ చేరుకుని అప్పటి కాలేజియేట్ స్కూల్ లో చేరిన పీ వీ మధ్యాన్న భోజనం ముగించి స్కూల్ ఆవరణలో వున్న వాటర్ టాంక్ నల్లా వద్ద నీళ్ళు తాగుతున్న పీ వీ కి అప్పుడే అక్కడకు వచ్చిన అదే వయస్సు గల మరో పిల్లవాడు పరిచయమ య్యాడు. ఇద్దరూ పేర్లు పరిచయం చేసుకోవడం వల్ల, ఒకరు “పాములపర్తి వెంకట నరసింహా రావు” అనీ, మరొకరు “అరె! నా పేరు పాములపర్తి సదాశివరావు” అనీ తెలుసుకున్నారు. ఆ సాయంత్రమే తన మిత్రున్ని వరంగల్ లోని మట్టెవాడలో గల తన ఇంటికి తీసుకు పోయిన సదాశివ రావు ఇంట్లోని పెద్దలకు పరిచయం చేయడం, వారి ద్వారా ఇద్దరి మధ్య గల ‘దూరపు బంధుత్వం’ తెలిసికోవడం జరిగింది. ఆ విధంగా ఆ మంచినీటి నల్లా వారి మధ్య ఒక గొప్ప మైత్రికి నాంది పలికింది. క్రమేణా ఇద్దరి మధ్య స్నేహితం బలపడటం, ఆదివారాల్లో ఇద్దరూ భద్రకాళి గుట్ట, పద్మక్షమ్మ గుట్ట, సిద్ధేశ్వరాలయం, వరంగల్ కోట, వేయిస్తంభాల గుడీ మొదలగు స్థలాలకు తిరగడం చేసేవారు. వయస్సు పెరిగి నూనూగు మీసాలు వచ్చేసరికి ఎప్పుడైనా సినిమాలను చూడటానికి చెరో 5 రూపాయలు తీసుకొని హైదరాబాద్ పోయి వచ్చేవారు. సినిమాలు, పౌరాణిక నాటకాలు చూసి మెల్లిగా ఇద్దరిలో సంగీతం పట్ల మక్కువ పెరిగింది.
ఒక హర్మనీ పెట్టె, తబలా కొనుక్కొని ఇద్దరూ సంగీత సాధన చేసేవారు. బాల్యంలో సంగీతం పై పెరిగిన ఈ ఆసక్తి వీరిని శాస్త్రీయ సంగీతం (ముఖ్యంగా హిందుస్తానీ సంగీతం)పై గొప్ప పట్టు సంపాదించి వివిధ సంగీత రాగ, తాళాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఒక కళా కారుడిచ్చిన సంగీత ప్రదర్శన బాగోగులపై చర్చించుకునే స్థాయికి పెరిగింది. వీరి అలనాటి శిష్యుడు శ్రీ కొండబత్తిని జగదీశ్వరరావు గారి మాటల్లో … “కాకతీయ కళా సమితి ( వరంగల్ లో 1945 నుండి 1958 వరకు పనిచేసిన సాంస్కృతిక సంస్ధ ) కార్యక్రమాల్లో పీవీ గారు కూడా అప్పుడప్పుడూ పాల్గొనేవారు. పీవీ గారు తబలా వాయిస్తే, సదాశివరావుగారు హార్మోనియంపై అరుదైన రాగాల గమకాల్ని తమ గొంతుతో చూపించే వారు. ఆ దృశ్యం ఎంతో కమనీయంగా వుండేది”. మిత్రులు దూరంగావున్నా సంగీత సాహిత్య అభిరుచులను పంచుకోవడం జరిగేదన్న దానికి ఒక ఉదాహరణ, 1981 ప్రాంతంలో సదాశివ రావు ఆచార్య బృహస్పతి గారు రాసిన ‘రాగ రహస్య’ పుస్తకం చదివి అందులో కొన్నింటిపై రచయిత వివరణలు కోరుతూ ఒక ఇన్ లాండ్ లెటర్ ఆ పుస్తక ప్రచురణకర్తలకు రాయడం, దాన్ని వారు ఢిల్లీ లోని ఆ రచయిత ఇంటికి ఫార్వర్డ్ చేయడం జరిగింది.
కానీ అప్పటికే ఆయన నిర్యాణం చెందటం వల్ల ఆయన సతీమణి శ్రీమతి సులోచనా బృహస్పతి గారు తాను కూడా సంగీత విదూషీమణి కాబట్టి వివరణలిస్తూ ఆ పుస్తక మలి ప్రచురణలో ఆ వివరణలు పొందుపరుస్తామని ఒక లేఖ ద్వారా తెలియజేయడం జరిగింది.ఈ లేఖా పరిచయాన్ని ఉటంకిస్తూ సదాశివరావు శ్రీ పీవీ కి ఆమె అడ్రస్ పొందుపరుస్తూ ఆమెను ఇంటికి పిలిపించు కోమని కోరడం జరిగింది. అప్పటి విదేశాంగ మంత్రి పీ వీ గారు ఆమెను ఇంటికి పిలిపించుకొని ఇంట్లోనే ఆమె సంగీత కార్య క్రమాన్ని ఏర్పరచారనితెలిసింది. ఇక వరంగల్ లో 1982 లో జరిగిన ‘పోతన పంచశతి’ ఉత్సవాల సందర్భంగా సదాశివరావు ఉత్సవ కార్య క్రమం రూపొందించినపుడు ఆమె పాట కచేరీని ఆ కార్యక్రమంలో పొందుపరచారు. ఆమె వరంగల్ వచ్చి ఆ ఉత్సవంలో తన గాన కౌశలం ప్రదర్శించి జనుల మెప్పు పొందారు.
శ్రీమతి పాములపర్తి చంద్రకీర్తి
పాములపర్తి. నిరంజన్ రావు