– రేవంత్ రెడ్డి విశ్వసనీయతకు పరీక్ష ఉప ఎన్నిక
– బీఆర్ఎస్ కేటీఆర్, బీజేపీ రామచంద్రరావు నాయకత్వాలకు సవాల్
– ఒక రాజకీయ నేత పనితీరుకు కొలమానం ఎన్నికలు మాత్రమే!
ప్రజాతంత్ర న్యూస్ నెట్ వర్క్, అక్టోబర్ 28: వాతావరణశాఖ అధికారుల సమాచారం ప్రకారం ప్రస్తుతం ‘మోంథా’ పెను తూఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాన్ని మచిలీపట్నం-కాకినాడల మధ్య మంగళవారం రాత్రికి తాకనుంది. దీని ప్రభావంతో పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించింది. తెలంగాణా కూడా’మోంథా’ ప్రభావం కనిపిస్తున్నది. ఇదే సమయంలో తెలంగాణలో మరో రకమైన తూఫాన్ అలజడి సృష్టిస్తోంది. అదే కాంగ్రెస్ పార్టీలో అతర్గతంగా కొనసాగుతున్న రాజకీయ కుమ్ములాటల తూఫాన్ ! ఇది జూబ్లీ హిల్స్ ఎన్నికలో పార్టీ నౌకను ఏదరికి చేరుస్తుందో తెలియని అయోమయ స్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అనుసరించబోయే విధానాలకు సంబంధించిన వ్యూహాల రూపకల్పనకు రాష్ట్ర స్థాయి ప్రధాన కేంద్రం గాంధీ భవన్‌లో ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలపై ఆధిపత్యం ఎట్లా సాధించాలనే అంశాలకు సంబంధించిన చర్చలకు బదులు, పార్టీ నేతలు ఒకరిపై మరొకరు కత్తులు నూరుకుంటూ, తమ సహజసిద్ధమైన ఆత్మహత్యా సదృశ రాజకీయాల తో అంతర్గత తుపానుకు కారణమవుతున్నారని, రాజకీయ తుపాను హెచ్చరిక నిపుణులు చెబుతున్న మాట!! పైకి మామూలుగా కనిపిస్తున్నా అంతర్గతంగా విభేదాల కుంపట్లు కుదిపేయడం గ్రాండ్ ఓల్డ్ పార్టీ సహజలక్షణం అన్న సంగతి రాజకీయాలపై కనీస అవగాహన ఉన్న వారెవరైనా ఇట్టే చెప్పేస్తారు.
రేవంత్ నాయకత్వంలో ఈ రెండేళ్ల కాలంలో కాస్త అదుపులో ఉన్నట్లు కనిపించినా, ఇప్పుడు విభేదాల నెగళ్లనుంచి పైకి ఎగసి పడుతున్న సెగలు పొగలను ఆపడానికి ఇప్పుడు ఆయన నానా కష్టాలు పడాల్సి వొస్తున్నది. ఇంత జరుగుతున్నా, అధిష్టానం నుంచి రాష్ట్ర, జిల్లా స్థాయిల వరకు నాయకులు వల్లెవేసేది ఒకటే మాట ‘మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పాలు ఒకింత ఎక్కువ అని, సబ్ చల్తా హై’ అని నవ్వుతూ చెబుతుంటారు. అంతవరకు బాగానే ఉంది కానీ ఈ సబ్ చల్తా హై అనేది సరిగ్గా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సమయంలో చోటు చేసుకుంటుండటమే, రేవంత్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నది! ముఖ్యంగా ప్రజల్లో రేవంత్ ప్రభుత్వ విశ్వసనీయతకు కొలమానంగా పరిగణించే ఈ ఎన్నికల సమయంలో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కచ్చితంగా ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకునే జరుగుతున్నాయని భావించాల్సి వస్తోంది. ప్రస్తుతం సీనియర్ మంత్రులు, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి నుంచి రేవంత్‌కు సహాయ నిరాకరణ కొనసాగుతున్నదనేది వెలువడుతున్న వార్తల సారాంశం. ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో పార్టీ పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైంది.
పార్టీ లోపలి వర్గాలనుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ముఖ్యంగా ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం లోపించడం, విపక్షాలనుంచి తనకు ఎదురవుతున్న దాడులను ఐకమత్యంగా దీటుగా ఎదుర్కొనడంలో పార్టీ నేతలు విఫలమవుతున్న తీరు రేవంత్‌ను మనోవేదనకు గురిచేస్తున్నది! పార్టీ సమావేశాల్లో రేవంత్ ఇదే అంశాన్ని బాహాటంగానే వేలెత్తి చూపుతున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీనికి తోడు సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రభుత్వాన్ని విమర్శి స్తుండటం, వీరిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో మరింతగా రెచ్చిపోతున్నారన్న సంగతిని కూడా రేవంత్ పార్టీ సమావేశాల్లో కాస్త గట్టిగానే చెబుతున్నట్టు తెలుస్తోంది. నిజానికి టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ నియమితమైనప్పుడే పార్టీలో అసమ్మతి భగ్గుమంది. కానీ ఆయన పార్టీకి అధికార పీఠాన్ని దక్కేలా చేయడంలో విజయం సాధించడంతో అంతా మౌనం దాల్చారు. ఈ మౌనం వెనుక సమయం కోసం ఎదురు చూపు దాగి ఉన్నదన్న సంగతిని ప్రస్తుత పార్టీ అంతర్గత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాదు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ పరాజయం పొందితే, రేవంత్‌రెడ్డి అసమర్థ నాయకుడుగా, విఫల ముఖ్యమంత్రిగా, అధిష్టానం చెవిలో పోరు పెట్టేందుకు పార్టీ నాయకులు కాచుకు కూర్చున్నారనేది మాత్రం సుస్పష్టం. అందువల్ల జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేవంత్ నాయకత్వానికి పెను సవాలు విసురుతోంది.
ఇదే సమయంలో బీఆర్ ఎస్, బీజేపీలు కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తూ ఎన్నిక బరిలో దిగాయి. కాకపోతే వీటిని కూడా అసమ్మతి బెడద వెంటాడుతుండటం గమనార్హం. ముఖ్యంగా బీఆర్ ఎస్ నాయకుడు కేటీఆర్, బీజేపీ నాయకుడు రామచంద్రరావు నాయకత్వాలకు ఈ ఉప ఎన్నిక సవాలుగా మారింది. ఈ ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోతే, అసమ్మతి వర్గ నేతలు, రేవంత్‌ను గద్డె దించడానికి ఏ ఒక్క అవకాశాన్ని వదలరనేది నిష్టుర సత్యం. తమ శైలి రాజకీయాలతో హైకమాండ్‌పై ఒత్తిడిని తీవ్రం చేస్తారు. క్షేత్రస్థాయి సమాచారం ప్రకారం ఈ ఉప ఎన్నిక ప్రధానంగా బీఆర్ ఎస్, కాంగ్రెస్‌ల మధ్య ఉండబోతున్నది. బీజేపీ ప్రభావశీలత చాలా తక్కువగా స్పష్టమవుతోంది. ఎన్నిక జరిగేది ఒకే స్థానానికైనా, దీని ప్రభావం ఆయా పార్టీల నాయకత్వాలపై తీవ్రంగా ఉండనుంది. ఓటమితో ఆయా పార్టీల నాయకులపై ఇప్పటివరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి ఒక్కసారి భగ్గుమనే అవకాశాలే ఎక్కువ ! ముఖ్యంగా అధికార కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఒక విషమ పరీక్ష కానుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





