– కేటీఆర్ ఘాటు విమర్శలు
హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్ 30:జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమే మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు క్షేత్రస్థాయి వాస్తవాలను గ్రహిస్తున్నట్లు కనిపిస్తున్నదని చెప్పారు. అందుకే పూర్తిగా దిగజారిన పార్టీ పరువును కాపాడుకోవడానికి అడ్డగోలు ప్రయత్నాలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఆపద మొక్కులు మొక్కుతున్నదని ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం సినీ కార్మికులకు అడ్డగోలు వాగ్దానాలు చేయడం, మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను కేబినెట్‌లోకి తీసుకోవడం, మంత్రులు గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ వీధుల్లో హడావుడిగా తిరగడం వంటివి ఆ పార్టీ తీవ్ర ఒత్తిడిలో ఉందనడానికి నిదర్శనమని చెప్పారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోతేనే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హాలను అమలు చేస్తుందన్నారు. అందుకే కాంగ్రెస్, దాని నాయకత్వానికి గుణపాఠం చెప్పడానికి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సరైన వేదిక అని చెప్పారు. ఈమేరకు కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





