అరమరికల్లేని అంతరంగపు అనిర్వచనీయ భావ విశాలతను కొత్తపలకగా ప్రఖ్యాత కవి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి ప్రజ్వలింపజేశారు. ఉరిమే ఆకాశంలో వాస్తవాల సునామీలా వ్యక్తమవుతూనే ఆకురాలిన నిశ్భబ్దంలా నిండారా కవిత్వమై ఆయన ప్రవహిస్తారు. చక్రం తిప్పి కుండల్ని తిప్పినంత ఒడువుగా/ మగ్గం మీద మేలిమి చీరల్ని నేసినంత ప్రేమగా/ మార్పుకు స్వాగత తోరణాల్ని కడుతూ కవిత్వాన్ని అందమైన తైలవర్ణ చిత్రం చేయడం కోసం కవిగా ఆయన పడే తపనకు ప్రతివాక్యం ప్రతిబింబంగా కన్పిస్తుంది. మస్తిష్కాల్లో చెదిరిపోని కవితాహర్మ్యాన్ని నిర్మించేందుకు కణకణమండే కొలిమిని కూడా మకుటంగా ధరించగలిగి హృదయ నిబ్బరంతో అడుగుముందుకే వేయడం ఆయన నైజమైంది. కవిత్వం అంతరంగంలో కనీసం ఒక కదలికనైనా తీసుకు రాగలిగిన ఉత్ఫ్రేరకం. లోలోపలి సృజనాత్మకతతో భావ రసాయనిక క్రియ జరిగాక కవిలో ఆవిష్కృతమైన, అభివ్యక్తమైన కవిత్వం పాఠకునిలో కదలిక కలిగించి పునర్వికాసం చెందాలి. ఊహాశాలితలో వైశిష్ట్యం, ఆడంబరం అంటని భాష, నిర్మాణ సులభత, విభిన్న అంశాల వైవిధ్యతతో కవి కవిత్వం కొనసాగాలి. ఇలాంటి ఎన్నో ప్రత్యేకతల మేలిమిగా నరసింహారెడ్డి కవిత్వం కనిపిస్తుంది.
నిర్మాణ పరమైన ప్రత్యేకతతో, ఆలోచనాత్మకమైన కవిత్వానికి కొత్తపలక వేదికైంది. చెట్ల ఆకుల నడుమ పిచ్చుకలు/ నిశ్భబ్దాన్ని సాధన చేస్తుంటాయి… మజీదు హృదయం నుండి/ సాయం కాలపు అజా ప్రవహిస్తుంది.. దేవలోకాన్ని తాకి రావాలని/ నందివర్ధయనం గేటెక్కి చూస్తోంది వంటి వాక్యాలలో సునిశితమైన కవి దృష్టికోణం, లో చూపు వ్యక్తమైంది. మలుపుకున్న కాలువల వల్ల వచ్చిన/ పంటల పచ్చదనం ఉండొచ్చు కాని/ కన్నీటి వెచ్చదనం తెలువదు అని దోపిడి పెద్దన్ ల దర్పాన్ని ప్రశ్నించి నిరసన గళాన్ని కవి వినిపించారు. ఇప్పుడో పలక దొరికితే బాగుండు/ చెరిపి రాయాల్సిన జీవితపు పాఠాలు/ చాలా గుర్తుకు వస్తున్నాయి అంటూ ఒకప్పటి చీకట్లను తరమేసిన తెల్లని దీపం లాంటి జీవన బలపం దిద్దిన పలకను తలచుకున్నారు. ఆశల నీరింకిన కళ్ల వెతల్ని విశ్ఱదీకరించారు. స్పందించి వేదన చెందిన హృదయాల నిరంతర మధనాన్ని అక్షరీకరించారు. రైతుల సంసారాల్లో మరణ శయ్యల్ని కళ్లుండీ చూడలేకపోయామని ఆగ్రహించారు. అన్నం పెట్టే రైతుల గుండెమంటల్ని జాగ్రత్తగా గమనించారు. పచ్చని నేల తివాచీలా ఉండే పల్లెలు ఘోరంగా దెబ్బతిన్న వైనాన్ని చూసి కుమిలిపోయారు. వాళ్లు ధనధాన్యాల గరిసెలు నింపుకుంటే మనోళ్లు పోరాటాల చరిత్రలు సృష్టిస్తరు అంటూ ఇరుప్రాంతాల ప్రజల తీరును విశ్లేషించారు. జీవితం గురించిన పాఠాలు చెప్పింది పలక అంటూ ఎన్ని నేర్పింది నాకు ఎదురైన అక్షరం దాన్ని ఆవిష్కరించడానికి హృదయం బలపంగా అవతారమెత్తుతుంది అని చెరిపి రాయాల్సిన జీవితపు పాఠాల కోసం పలక మళ్లీ ఇప్పుడు దొరికితే బాగుండు అంటారు.
లోచూపులు ఉన్న వాళ్లు ధ్నరించగల మణిమకుటం గురించి, వెనకటి రోజుల గొప్పతనాన్ని గుర్తు చేస్తూ విషపూరిత రసాయిన వ్యర్థాలతో కాలుష్యమయంగా మారిన ఇప్పటి పరిస్థితి బేరీజు వేశారు. ఇక్కడొక ఊరుండేది/ ఎవరైనా చూపిస్తారా ? అని ప్రశ్నించారు. సృష్టికే సవాలు విసురుతరు/ మనోళ్లు పోరాటాల చరిత్రలు సృష్టిస్తరు అంటూ తెలంగాణ నైజాన్ని చూపించారు. అన్ని కోల్పోయిన తనం మిగిలిన తెలంగాణ వాసిని రావియాపుల గలగలల కింద/ రాలిపోయే కన్నీటి కింద/ చెప్పుకోలేని బాధబిడ్డా కరువు/ వెంట వస్తే నేను కూడా నీకో బరువు అని బాధపడ్డారు. మహలంతా ఒంటరి / దాన్నిండా చీకటి అని వేదనను హృదయ ధ్రావకంగా చెప్పారు. పనిలేకపోవడమంటే/ జీవితము పెద్దగా లేకపోవడమేనని , జీవతం జింకకాళ్లకు మానని గాయాలను, రహదార్ల మీద మొలిచిన బ్రహ్మజెముడు తుప్పులను ఉపమానాలుగా చూపారు.
జన్న, మరణ చిత్రంలో ఆకులై అంతా కలిసే తిరుగుతుంటారు అంటారు. ఉలికన్నా ఊహపెద్దదని చెప్పారు. కాలువ జీవనది కావడాన్ని సగటు మనిషి ఆశగా చూపారు. కళల గ్రహం మీద చింత లేకుండా పాటలు కట్టి ఆటలాడి కాలుమోపమంటారు. వేగానికి ఆగడం ఉండదని అంటూ స్మశానం సృష్టించే వేగం నిరంతరం యముడికి స్వాగత తోరణాలు కడుతుందని చెప్పారు. కళ్లోనికుంటలో నాన్నను అస్పష్ట జ్ఞాపకంగా, కాలానికి ఆరబెట్టిన నీటి రంగుల వర్ణచిత్రంగా చూపారు. వలస కాలంలో ఆకలి భయాన్ని కాలే కడుపుల మీది నుంచి చూసారు. బాధ్యతతో/ మానవత్వంతో ఫైళ్లను పరిష్కరించకుంటే జీవితాలు ముగిసిపోతాయని హెచ్చరిస్తారు. పంటచేలలో పరవశాల పాటలు మొదలు పెట్టాలని ఖరీఫ్ లో కురిసిన వర్షాలను చూసి అన్నారు. వారిది జీవనమే/ మనకది సర్కస్ అని చెప్పారు. దూరాన్ని చూపుల్తో కొలుద్దామని/ దుఃఖంతో / ఎడారుల్ని కల్పుదామని/ అతడు పోతాడు/ ఆమె వెళ్లిపోతుందని వాస్తవికతను ప్రతిపాదించేందుకు సిద్ధమౌతారు.
బంధించిన పావురాయి లాంటిది జీవితం/ నిజాయితీకి చర్చపెట్టే ఆత్మఘర్షణ మధ్య ఏమీ సాధించినట్టనిపించదు అని వేదన పడ్డారు. మబ్బు వెళ్లిపోయాక/ మధనం ప్రారంభమైనట్టు/ మక్కలెండిపోయాక / జల్లులందుకున్నై/ భయమంతా యాసంగి కూడా దక్కదేమోననే భయాందోళనను కళ్లముందు ఉంచారు. కొల్లేటి కొంగలు బారు కట్టిన కళాత్మక సింగిడిలో నిఖార్సైన నగిషీలు చెక్కిన ఉలిగా కలెక్టర్ లవ్ అగర్వాల్ పనితనాన్ని కవిత్వీకరించారు. ఒడుపుగా నగర సాగరంలో కలిపే బతుకు మలుపును చూపించారు. సృష్టి రహస్యాల సంక్షిప్తిగా రంగుల కళలను వర్ణించారు. మెరుపు లాంటి చైతన్య స్పూర్తిగా ఆచార్య పేర్వారం జగన్నాథంను గొప్పగా స్మరించారు. నిశ్చలత్వం మీద కలయ తిరిగే జ్ఞాపకాలను తలిచారు. డైరీలో తొలి పేజీ రాత ఆనంద సంవేదననలు కలగలిసిన నడిచే చరిత్ర అన్నారు. వందల బాల్యాలు జతకట్టిన కాడమల్లె పూలచెట్టుపై ఎగిరిన అవధులు దాటిన ఆనందాల పిట్టల సమ్మోహాన్ని పరిచయం చేసి బరువైన జ్ఞాపకాలను కవితామాలికగా 10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం కోసం రాశారు. మాటజారని సమాధానం ఎంత విభిన్నమైందో, విలక్షణమైందో చెబుతూ గాయపరచడం సులువేసుమా అంటారు.
చెమట చుక్కలు దాల్చేవారి బారెడు చిక్కుల్ని భావాల ఆర్ద్రతచలోకి ఒంపారు. కలలు సమాంతరమై సంఘర్షించుకున్ననప్పుడు వడిపెట్టిన దుఃఖాన్ని చూపించారు. నగరానికి నింపాదిగా నిద్రించడం తెలియదంటారు. విలువల్ని అద్దుకున్న వార్తలిచ్చే పాత్రికేయతను తలెత్తుకోనివ్వమంటారు. కళల వేదిక కలహాలకు నిలయమైతే నైతికత దిగిపోతుందని వేదన చెందారు. శాశ్వతం కాని కళల కోసం వెంపర్లాటలు వద్దంటారు. పతనోన్నతిలో కుంటిసాకుల పర్యవసానం చూపించి ఉన్నచోటే ఉసూరుమంటూ ఉండడమెలా అని ఉద్యోగి పక్షాన ప్రశ్నిస్తారు. భవిత పునాదిగా ధరిత్రి రాసుకునే నూతన చరిత్రలో విపులమైన స్పష్టత ఉంటేనే విజయాలు సమకూరుతాయంటారు. అహాన్ని వదిలి ఎవరికి వారు సరైన తూనిక రాళ్లతో తూకం వేసుకోవాలని సూచించారు. అందరూ నగలేసుకుంటారు/ కొందరే చిరునగ వేసుకుంటారు అని చెప్పారు. ఇన్ని పూలుండగా/ ఎప్పుడూ ముండ్ల గురించిన బాధలేలా అంటారు. ఇంత పచ్చని పొలం చీర/ యేటి మగ్గమే నేసింది సుమా అని ఆత్మ విశ్వాసాన్ని ప్రకటిస్తారు. భవనాలు పైపైకి/ మమకారాలు లోలోపలికి అని వేదన పడ్డారు. కల్లోలాల పొక్కిలి వాకిళ్లలో అలుకుల పూతల పట్నం జీవితాన్ని చూపిస్తూ అంతరంగ శుద్ధిని గుర్తుచేశారు. ఓ మహోజ్వల చరిత్ర లక్ష్మీ సెహగల్ జీవితం అన్నారు.
మట్టిలో పుట్టి/ మట్టిలో కలవడానికి మధ్య/ తీరిక లేకుండా/ మట్టిరంగులన్నీ తూర్పార బట్టిండు అంటూ మట్టికి సారెతో సౌంధర్యం అద్దిన బొమ్మల రాజుకు శతకోటి నిశ్చల దృశ్యాలతో ఎడతెగని దండాల తోరణం కట్టారు. చింతాక్రాంతమైన విముక్తి చరిత్రను చూపించారు. వచించడం, రచించడాన్ని ప్రస్తావిస్తూ భేషజాల్లేని వాస్తవాలను తెలిపి భూమితో రుణం తీరిపోయినా జగతిపై నలుగురు నడిచే తీరును వివరించారు. రాలిన చెట్ల ఆకులను జాలితో చేరదీసే మనుషులను గుర్తు చేసుకొని పశుత్వపు మనస్తత్వాలను మానవాళిలో గమనించి ఇప్పటికైనా జీవలక్షణం పెరగాలంటారు. పంచదార పర్యవసానాలను విశ్లేషించారు. తెలిసింది అందరికీ కొంచమే అన్నారు. అక్కడ రాలిపోయిన కల్షలు శఖజలాలు అవుతున్నాయి/ తలపుల వీణపై తట్టిచూడాలంటే మళ్లీ అక్కడికే పోవాలంటారు.
అనుభవాల గాయాల మీద ఆలోచనల లేపనమే మనిషికి మనస్సు ఊయల అంటారు. 107 బస్టాప్‌లో నిలబడి నిత్యం ప్రయాణించిన జీవన సందడిని అక్షరబద్ధం చేశారు. మానవ కథా వికాసంలో/ మార్మికత ముడివిప్పితే/ రతనాలు పరుచుకున్న వీధి అంగల్లు/ వసంతోత్సవాలు/ చరిత్రకెక్కిన చీకటి కోణాలు/ శిలా నిక్షిప్త హృదయాన్ని తట్టిలేపడానికి/ జరిగిన కళింగ యుద్ధాలు / సంకల్పిత అని కాలగీతికను ప్రవచించారు. భీభత్సాలు, అసంకల్పితాల అశక్తతతల మధ్య ఒదిగిపోతున్న వాస్తవాలను కవిత్వ వేదికపై విశ్లేషించారు. విస్తరించే నీలి నీడలున్నా జీవాస్త్రాల్ని సంధించారు. ధర్మాగ్రహం వినిపించారు. మేధోయాగానికి నిర్వచనం రాసేందుకు కొత్తపలకను యుద్ధ సైనికుడిగా సిద్ధం చేశారు. మానవ కార్యాచరణ చరిత్రకు కవిత్వాన్ని జీవన మాధ్యమంగా మార్చి మరోప్రస్థానపు పిలుపయ్యారు.
– డా. తిరునగరి శ్రీనివాస్
9441464764





