ముఖ్య మంత్రి గారికి బహిరంగ లేఖ

గౌరవ నీయులైన ముఖ్యమంత్రి గారికి వ్రాయునది ఏమనగా !

మీరు బెంగుళూరు లో హిందూ పత్రిక నిర్వహించిన సదస్సులో బడులను మూసి వేస్తామన్న ప్రకటన ఆందోళన కలిగించే అంశం. ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత సంక్షోభం లో కూరుకుపోయే పరిస్థితి. తక్షణమే ఆ ఆలోచనను విరమించుకోవాలని విజ్ఞప్తి.

ముఖ్య మంత్రి అయ్యింది  బడులు మూయడానికి కాదు మెరుగుపరచడానికి పని చేయాలి. సోనియా గాంధీ గారి నేతృత్వం లో  యుపిఏ ప్రభుత్వం లో విద్యా హక్కు చట్టం తో దేశ వ్యాప్తంగా మారు మూలా ప్రాంతాలలో బడులు తెరిస్తే మీరేమో  మూసి వేస్తామంటున్నారు. 4000 బడులకు కుదించి బస్సులు పెట్టి పిల్లలను ఇంటికి వెళ్లి  పికప్ చేసుకుంటామని అంటున్నారు. బడులకు కాలేజీలకు వెళ్ళే సమయం లో  ఆర్టిసి బస్సులు సరిపోక సమయానికి రాక కిక్కిరిసిన జనాలతో  విద్యార్థులు నానా ఇబ్బంది పడుతున్నారు. ఇంటి నుండి పికప్ చేసుకుంటామంటే నమ్మేటట్లు లేదు. చాలా బడులలో  బోధించే టీచర్లు లేక అవస్థ పడుతున్నారు.వాస్తవానికి గత పాలకులు గత ప్రభుత్వాలు బడులకు తగ్గట్లు గా టీచర్లను నియమించకుండా బహుళ తరగతి బోధనను ప్రవేశ పెట్టినందు వలన విశ్వాసం కోల్పోయి ప్రభుత్వ బడులలో  పిల్లలు తగ్గారు.తరగతికొక టీచర్ ఉండే ప్రైవేటు బాట పట్టరాని గమనించాలి. 25-26 విద్యా సంవత్సరం లో కేవలం 28 శాతం  మంది  విద్యార్థులు మాత్రమె ఒకటవ తరగతి లో చేరారు. ప్రభుత్వ బడులలో నమోదు ఏడాదికేడాది తగ్గుతూ వస్తుంది. మీరన్నట్లు పెరగడం లేదని గమనించాలి.

 పిల్లలు తగ్గారు  కాబట్టి బడులు మూసి వేస్తామనడం అన్యాయం. ప్రభుత్వ విధానం వలన జరిగినది  ఈ తప్పిదం.  ఆ బడులలో టీచర్లను ఇచ్చే  పని చేయడానికి ముఖ్యమంత్రి అయ్యారు.వాగ్దానాలు కూడా చేసారు. ఎన్నికలలో బడులుమూసి వేస్తామని ఎప్పుడు చెప్పలేదు. ఎండా కాలం సెలవులలో ఒక్క బడికి గంటేడు సున్నం వేయలేదు. ఉన్న బడులను కాపాడానికి సర్పంచులు ఉపాధ్యాయులు  ప్రతి గ్రామం లో తిప్పల పడుతున్నారు ఎవరి స్పూర్తి నో ఏమో కానీ మీరు  ఇప్పుడు బడులు మూస్తామని బాంబు  వేశారు. వద్దు సర్ అలా ఆలోచించకండి దయచేసి. మన తెలంగాణ విద్య సూచికలు అంతా బాగాలేవు దేశం లో ఇతర రాష్ట్రాలను జిల్లాలను పోల్చుకుంటే.

ఈ నెలలో విడుదల చేసిన 24-25 పెర్ఫర్మన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (PGI-2) నివేదిక  ప్రకారం వాస్తవానికి  తెలంగాణ జాతీయ ర్యాంకింగ్‌లో 26వ స్థానం నుండి 28వ స్థానానికి పడిపోయింది. కాని మీరు  తెలంగాణా ఆవిర్బావ సభలో మరియు సామాజిక మాధ్యమ  వేదిక గా తెలంగాణా మంచి పనితీరు కనబరచినట్లు ప్రకటించారు. వివరాలకు వెళ్తే అలా లేదు. చేయ వలసిన పని చాల ఉంది.

ఇదే నివేదిక లో దేశం లో ఉన్న 783 జిల్లాలకు   తెలంగాణ లో 28 జిల్లాలు ౩౦౦ స్థానం నుండి 675 వ స్థానం లో ఉన్నాయి. చాల జిల్లాలు బీహార్,జార్ఖండ్ ఉతరప్రదేశ్ లాంటి వెనుకబడిన రాష్ట్రాల జిల్లాల తో సమానంగా ఉన్నయని గుర్తించాలి.  ఒక్క జనగామ జిల్లా మాత్రమే 99 వ స్థానం లో ఉంది. ఎంతో ఆర్భాటంగా విద్యా కమిషన్ ను వేసి  పలు సభలలో కమిషన్ పని తీరును  గొప్పగా  చెప్పిన మీరు   విద్యా కమిషన్ సూచనలు సిఫారసులను అమలు చేస్తామని చెప్పలేదు. కేకే కమిటి ఏమి తేల్చలేదు. బడులు వచ్చే వారం తెరుస్తున్నారు. కమిషన్ ఎక్కడా బడులను మూసి వేయమని సిఫారసు చేయలేదు. అసలు కమిషన్ రిపోర్టు మీద ప్రభుత్వ సమీక్ష  జరిగినట్లు లేదు.

మీరు తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడేన్శియాల్ స్కూల్స్ ఇంకా శంకుస్థాపన స్థాయి లోనే ఉన్నాయి. వాటికి పెడుతున్న ఖర్చు చాల అధికం అని కూడా చర్చ ఉంది. ఈ విద్యా సంవత్సరం లో అందుబాటులోకి వచ్చే దశలో లేవు. ఈ నేపధ్యం లో ఉన్న బడులను బాగు చేయకుండా పైగా మూసి వేస్తామని ప్రకటించడం  ప్రజలను ఆందోళన కలిగించే చర్య.

క్యూర్ ఏరియ లో నివసిస్తున్న తల్లిదండ్రులు ప్రభుత్వ బడులు లేక ప్రైవేటు ఫీజులకు అప్పులు చేసి  నానా అవస్థలు పడుతున్నట్లు ఇటీవల జరిగిన ఒక సదస్సులో వారి దుఖాలు  పంచుకున్నారు. నిఘా వర్గాల ద్వారా మీకు ఈ సమాచారం వచ్చి  ఉంటుది. వచ్చిన వాళ్ళు అందరు తెలంగాణా విద్యా కమిషన్ సిఫారసులను అమలు పరచాలని, ప్రతి డివిజన్ లో ఒక తెలంగాణా పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ఏకవాక్య తో తీర్మానించారు. ఈ విషయం మీద మీరు దృష్టి సారించి పట్టణ పేదల విద్యా డిమాండును గమనిస్తారని ఆశిస్తున్నాను.

అలాగే రాష్ట్రం లో ఎక్కువ పిల్లలు నమోదు అయి ఉన్న అన్నిబడుల మీద సమీక్ష చేసి  మౌలిక వసతులు బోధనా సిబ్బందిని తక్షణమే  ఏర్పాటు చేయండి.  ప్రజల విశ్వాసం పొందండి.  సమస్యల పరిష్కారం వైపు ఆలోచించాలి తప్ప  బడులను మూసి వేస్తామనే ఆలోచనలను విరమించుకోవాలని విజ్ఞప్తి.  జిల్లాల వారిగా పట్టణాల వారిగా ఎంతో అనుభవాలు ఉన్న ఉపాధ్యాయుల సలహాలు పౌర సమాజం సూచనలు తీసుకుని  విద్యా సమీక్షలు జరిపి మంచి నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నాము. మీ సమయం అమూల్యమే అయినా బాల్యం అత్యంత  అమూల్యం. విద్య పొందడం బాలల హక్కు. అందించడం  చట్టబద్ద బాధ్యత.  మీరు బలంగా  ఎప్పుడు చెప్పే ‘విద్య తోనే విముక్తి’ అని నమ్మిన తల్లిదండ్రులకు భరోసా ఇస్తారని బడులను మూసివేసే ఆలోచనను విరమించుకుంటారని   విన్నవించుకుంటూ

(గత మూడు దశాబ్దాలుగా బాల కార్మిక నిర్మూలనకు ప్రభుత్వ విద్యా బలోపేతానికి  ప్రభుత్వ విధానాలలో మార్పులకు విద్యా శాఖతో కలిసి పని చేసిన అనుభవం తో మీ ప్రకటనతో కలత చెంది  రాస్తున్న ఈ లేఖ లోని అంశాలను పరిశీలించాలని మనవి.  నేను తెలంగాణ   విద్యా కమిషన్ సలహాదారుని  కూడా. మిమ్మలి కలిసే అవకాశాలు తక్కువ కావడం  వలన ఈ బహిరంగ లేఖ,  )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *