“శక్తివంతుడితో పోరాడాల్సి వచ్చినప్పుడు తాను కూడా ఒక బలవంతుడిగానే నటిస్తూ యుద్ధం చేయడం తప్ప మరో మార్గం వుండదు. ఎటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లోనైనా లక్ష్యాన్ని చేరుకోవడానికి అనేక ఐచ్ఛికాలు తప్పనిసరిగా వుంటాయి. మిమ్మల్ని అడ్డుకునే ప్రతి ద్వారాన్ని ధ్వంసం చేయాల్సిన అవసరం లేదు. ఒక నీటి ప్రవాహం మాదిరిగా ముఖద్వారం గుండా బయటపడి మీ గమ్యంవైపునకు ప్రయాణించవచ్చు.”
ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడులు చేసే అవకాశముందనేది ఎన్నో ఏళ్లుగా లేదంటే దశాబ్దాలుగా వింటున్న మాటే. ఎందుకంటే ఇరాన్ అణుబాంబును తయారుచేయబోతున్నదని, దీన్ని నిలువరించాలంటే ముందుగా దానిపై బాంబులు వేయడం తప్ప మరోమార్గంలేదని ఇజ్రాయిల్ నిరంతరంగా చెబుతూ వస్తోంది. ఇజ్రాయిల్ తాను చెబుతున్న ప్రకారమే ఇరాన్‌పై వరుస బాంబుదాడులకు పాల్పడింది. తద్వారా ఇరాన్ కూడా ప్రతిదాడులకు దిగాల్సిన తప్పని పరిస్థితి సృష్టించింది.
మరి ఇప్పుడే ఈ దాడులకు దిగాల్సిన అసరం ఏమొచ్చింది? ముఖ్యంగా యుఎస్-ఇరాన్ మధ్య అణుచర్చలు జరుగుతున్న సమయంలో? నిజానికి ఈ చర్చలు ఇజ్రాయిల్‌కు సుతరామూ ఇష్టంలేదు. ఇరాన్‌తో చర్చలకు డోనాల్డ్ ట్రంప్ విధించిన 60రోజుల గడువు ముగియడంతో ఇప్పుడు ఇజ్రాయిల్ దాడులు చేయకుండా నిరోధిస్తున్న అడ్డంకి తొలగిపోయింది. ఇప్పటివరకు ఈ దౌత్యపరమైన ప్రయత్నాన్ని ఏదోరకంగా నిర్వీర్యం చేయడానికే ఇజ్రాయిల్ ప్రయత్నించిందన్న మాట వాస్తవం. దీనికితోడు అంతర్జాతీయ అణుసంస్థ, ఇరాన్ తనవద్ద ఉన్న శుద్ధిచేసిన యురేనియం సహాయంతో అణుకార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళుతోందని బయటపెట్టింది. ఇది కూడా ఇజ్రాయిల్ దాడులకు దిగడానికి దోహదం చేసింది.
“ప్రస్తుతం ఇజ్రాయిల్ వ్యూహాన్ని పరిశీలిస్తే, ఇరాన్ అణుకార్యక్రమం కంటే, ప్రభుత్వాన్ని పడగొట్టడం ముఖ్య లక్ష్యంగా కనిపిస్తోంది. ముఖ్యంగా సైనికచర్య కంటే, ఇరాన్ ప్రజల్లోనే తిరుగుబాటు వచ్చి ప్రభుత్వాన్ని కూల్చివేసే పరిస్థితులు కల్పించే వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఫలితంగా ఇరాన్ ప్రభుత్వం ప్రస్తుత పరిణామాలను తన ఉనికికే ప్రమాదం కలిగించేవిగా భావించి, మరింత తీవ్రస్థాయిలో ప్రతీకారానికి దిగే అవకాశాలున్నాయి.ఇప్పుడు ఇరాన్‌లో అణు సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం తమవద్ద ఉన్న శుద్ధిచేసిన యురేనియంతో అణ్వ స్త్రాలు తయారుచేయడమా లేక అణ్వస్త్ర స్థాయికి ఒక మెట్టు దిగువన అంటే ఇప్పటి మాదిరిగా కొనసాగడమే అనేది అయెతుల్లా ఖమేనీ ముందున్న ప్రశ్నలు. అయితే అణ్వస్త్రం లేకపోతే ఇరాన్ ప్రభుత్వ ఉనికికే ప్రమాదమని చాలామంది ఇరాన్ నాయకుల విస్పష్ట అభిప్రాయం. ఇదిలావుండగా ఇరాన్ పౌర ప్రభుత్వానికి-మిలిటరీకి మరియు రాజ్యం-పౌరసమాజం మధ్య వున్న సంబంధాలు తీవ్రమైన ఒత్తిడిలో వున్నాయన్న మాట వాస్తవం. ఒకవైపు ఆర్థిక ఒత్తిళ్లు మరోవైపు ఇజ్రాయిల్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనలేని బలహీనత , ఇంకోవైపు బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడి పెట్టి అభివృద్ధి చేస్తున్న అణ్వస్త్ర కార్యక్రమం నిర్వీర్యమైపోవడంతో దేశంలోని అన్నివర్గాలనుంచి ఎదురయ్యే ప్రశ్నలకు జావాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది..”
ఎప్పుడైతే ఇజ్రాయిల్ దాడులు మొదలయ్యాయో వెంటనే ట్రంప్ రంగంలోకి దిగి ఇరుదేశాలు తక్షణం ఒక ఒప్పందానికి రావాలని పిలుపునిచ్చారు. కానీ ఇటువంటి దౌత్య పరిష్కారం ఎట్టిపరిస్థితుల్లో లభించే అవకాశమే లేదు. ఈ నేపథ్యంలో ఇక చేసేదిలేక తమ లక్ష్యాలపై దాడులు చేయవద్దని ఇరాన్‌ను ట్రంప్ హెచ్చరించి ఊరుకున్నారు. ఇజ్రాయిల్ దాడులతో తనకు సంబంధం లేదని ట్రంప్ చెబుతున్నా పరిస్థితులు గమనిస్తే కొన్ని మిశ్రమ సంకేతాలు వెలువడుతున్నాయి.
ఇదే సమయంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చీ ఒక ప్రకటన చేస్తూ, యు.ఎస్. సమ్మతి లేకుండా తమదేశంపై ఇజ్రాయిల్ దాడులకు దిగే అవకాశమే లేదు కాబట్టి ఈ దాడులకు తానే బాధ్యురాలిని యు.ఎస్. అంగీకరించాల్సిందేనని స్పష్టం చేశారు. అంతేకాదు ఈ దాడుల ద్వారా ఇజ్రాయిల్ వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడటమే కాదు, బలవంతంగా తమను యుద్ధంలోకి లాగిందని కూడా ఆరోపించారు. యు.ఎస్.ను విశ్వసనీయ మధ్యవర్తిగా ఇరాన్ ఎందుకు భావించడంలేదో మనకు ఈ ప్రకటన స్పష్టం చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే జూన్ 15న యు.ఎస్.తో జరగాల్సిన ఆరో రౌండ్ అణుచర్చలను తాత్కాలికంగా నిలిపేసింది.
ఇరాన్ మద్దతున్న హమాస్, హిజ్ బుల్లా తీవ్రవాద సంస్థలను దాదాపు సమూలంగా ఇజ్రాయిల్ దెబ్బతీసిన తర్వాత మధ్యప్రాచ్య రాజకీయ క్రీడలో చాలా మార్పులు వచ్చాయన్నది తాజాగా ఇరాన్‌పై జరిపిన దాడులు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఇరాన్‌కున్న బలమైన నెట్‌వర్క్ ను ధ్వంసం చేసినట్లయింది. అంతేకాదు గతంలో ఏ నోటితో అయితే ట్రంప్ ఇజ్రాయిల్ దాడులు తప్పని పేర్కొన్నారో ఆయనతోనే అద్భుతం అని అనిపించగలిగింది.
ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రతీకారంగా క్షిపణి దాడులకు దిగినా, కాలం గడిచేకొద్దీ క్రమంగా ఒక్కటొక్కటిగా తనకు అనుకూలాంశాలు తగ్గిపోవడం ఖాయం. అంటే ఏడాది క్రితం ఉన్నన్ని అవకాశాలు ఇరాన్‌కు ఇప్పుడు లేవు. ఎందుకంటే తనకు అనుకూలంగా పనిచేసే హమాస్, హిజ్‌బుల్లా పూర్తిగా దెబ్బతినడంతో నిస్సహాయ స్థితిలో పడిపోయిన ఇరాన్ చేసే ప్రతీకారదాడులు కూడా బలహీనంగానే ఉంటాయి . పరిస్థితులు తనను తప్పనిసరిగా ఏదోరకంగా అంగీకారానికి రావడానికి దారితీసేవిగా ఉన్నా , ఇందుకు భిన్నంగా ఇరాన్ తీవ్రస్థాయి నిర్ణయాలు తీసుకునే అవకాశాలే ఎక్కువ. ముఖ్యంగా అణు కార్యక్రమం నుంచి వెనక్కు మళ్లదు. ఒకవేళ ఇజ్రాయిల్ దాడులకు, యు.ఎస్. ఒత్తిళ్లకు లొంగిపోతే ఇరాన్‌లో అధికార మార్పిడి తథ్యం.
ముఖ్యంగా ఇరాన్ ప్రభుత్వం రెండు రకాలుగా అంతర్గత వ్యతిరేకతను ఎదుర్కొనాల్సి ఉంటుంది . మొదటిది ఇప్పటికే కొనసాగుతున్న విపక్షాల వ్యతిరేక వైఖరితో పాటు, ఇప్పటివరకు తనకు విశ్వాసపాత్రులుగా ఉన్నవారు ఈ లొంగుబాటును తమను మోసగించడంగా పరిగణించే ప్రమాదముంది. ప్రస్తుతం ఇజ్రాయిల్ వ్యూహాన్ని పరిశీలిస్తే, ఇరాన్ అణుకార్యక్రమం కంటే, ప్రభుత్వాన్ని పడగొట్టడం ముఖ్య లక్ష్యంగా కనిపిస్తోంది. ముఖ్యంగా సైనికచర్య కంటే, ఇరాన్ ప్రజల్లోనే తిరుగుబాటు వచ్చి ప్రభుత్వాన్ని కూల్చివేసే పరిస్థితులు కల్పించే వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఫలితంగా ఇరాన్ ప్రభుత్వం ప్రస్తుత పరిణామాలను తన ఉనికికే ప్రమాదం కలిగించేవిగా భావించి, మరింత తీవ్రస్థాయిలో ప్రతీకారానికి దిగే అవకాశాలున్నాయి.
ఇప్పుడు ఇరాన్‌లో అణు సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం తమవద్ద ఉన్న శుద్ధిచేసిన యురేనియంతో అణ్వ స్త్రాలు తయారుచేయడమా లేక అణ్వస్త్ర స్థాయికి ఒక మెట్టు దిగువన అంటే ఇప్పటి మాదిరిగా కొనసాగడమే అనేది అయెతుల్లా ఖమేనీ ముందున్న ప్రశ్నలు. అయితే అణ్వస్త్రం లేకపోతే ఇరాన్ ప్రభుత్వ ఉనికికే ప్రమాదమని చాలామంది ఇరాన్ నాయకుల విస్పష్ట అభిప్రాయం. ఇదిలావుండగా ఇరాన్ పౌర ప్రభుత్వానికి-మిలిటరీకి మరియు రాజ్యం-పౌరసమాజం మధ్య వున్న సంబంధాలు తీవ్రమైన ఒత్తిడిలో వున్నాయన్న మాట వాస్తవం. ఒకవైపు ఆర్థిక ఒత్తిళ్లు మరోవైపు ఇజ్రాయిల్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనలేని బలహీనత , ఇంకోవైపు బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడి పెట్టి అభివృద్ధి చేస్తున్న అణ్వస్త్ర కార్యక్రమం నిర్వీర్యమైపోవడంతో దేశంలోని అన్నివర్గాలనుంచి ఎదురయ్యే ప్రశ్నలకు జావాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఇజ్రాయిల్ జరిపిన దాడులు ఈ ప్రాంతంలో ఇప్పటికిప్పుడు ఎటువంటి మార్పులకు కారణమవుతాయో చెప్పడం కష్టం. కాకపోతే మధ్యప్రాచ్యంలో భద్రతా పరంగా ప్రస్తుతం ఉన్న రూపురేఖలు మారిపోవడం మాత్రం ఖాయం. ఇప్పుడు ఇరాన్ ప్రతీకార దాడులు పరిస్థితిని మరింత దిగజారుస్తాయే తప్ప మెరుగుపరచకపోగా, ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాని యు.ఎస్, ఇజ్రాయిల్ డిమాండ్లకు తలొగ్గాల్సి న పరిస్థితులు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ కు యుద్ధం చేయడం తప్ప మరో దారిలేదు. ఇంతటి సందిగ్ధ పరిస్థితుల్లో ఒక వాస్తవం మాత్రం స్పష్టమైంది. తన దాడులను సహచర దేశాలు ఖండించకపోవడం ఇజ్రాయిల్‌కు సానుకూల పరిణామం. ఇక ముందు కూడా ఎటువంటి కష్టనష్టాలకు భయపడకుండా ముందుకెళుతూ, రాబోయే దశాబ్దాల్లో ప్రాంతీయ గతిశీలతలో మార్పులు తేవడానికే ఇజ్రాయిల్ అడుగులు ముందుకు వేస్తుందనేది స్పష్టమైంది.
-శామ్ సుందర్