భూసమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలి

జిల్లా కలెక్టర్లకు మంత్రి పొంగులేటి దిశానిర్దేశం

 

హైదరాబాద్‌ : తెలంగాణ సమాజంలో భూమి కీలకమైన అంశమని, గత ప్రభుత్వం ధరణి పోర్టల్‌తో చేసిన తప్పిదాల వల్ల రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో వందల కుటుంబాలు భూ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నాయని భూ భారతి చట్టం ద్వారా ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపాలని రెవెన్యూ హౌసింగ్‌ సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయా జిల్లా కలెక్టర్లకు సూచించారు. కొత్తగా నియమితులైన సంగారెడ్డి కలెక్టర్‌ ప్రావీణ్య, సిద్దిపేట కలెక్టర్‌ హైమావతి, హైదరాబాద్‌ కలెక్టర్‌ హరిచందన, నిజామాబాద్‌ కలెక్టర్‌ వినయకృష్ణారెడ్డి, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ స్పెషల్‌ సెక్రటరీ రాజీవ్‌గాంధీ హనుమంత్‌ సచివాలయంలో మంత్రి పొంగులేటిని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో భూములకు సంబంధించి రైతులు అనుభవించిన కష్టాలకు, బాధలకు విముక్తి కల్పించేలా భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వస్తున్న దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వచ్చే రెండు నెలలు రెవెన్యూ శాఖకు అత్యంత కీలకమైనవని, భూ సమస్యల పరిష్కారానికి గడువుగా నిర్ణయించిన ఆగస్టు 15నాటికి న్యాయబద్దమైన అన్ని దరఖాస్తులను పరిష్కరించాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజాపాలన మొదలై ఏడాదిన్నర అవుతోందని, ఎవరూ ఊహించని రీతిలో భూ సమస్యలను పరిష్కరిస్తూ సంక్షేమం అభివృద్ది పధకాలను ప్రజలకు చేరవేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం రూపొందించిన పధకాలను అమలు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించవలసిన బృహత్తర బాధ్యత కలెక్టర్లదేనని మంత్రి పొంగులేటి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page